రాజు, రవి ఇద్దరూ స్నేహితులు. వాళ్ల అమ్మానాన్నలు కూలిపని చేసి జీవించేవారు. అయినా రాజు వాళ్ల నాన్నకు చదువంటే ఇష్టం. తను ఎంత కష్టపడి పని చేసినా రాజును మాత్రం బడికి పంపేవాడు.







రవి వాళ్ల నాన్న మాత్రం మొండివాడు. రవిని బడికి పంపకుండా తనతోబాటు పనికి తీసుకెళ్లేవాడు. అయితే రవికి చదువంటే చాలా ఇష్టం. ప్రొద్దున పనికి పోతూనే, రాత్రిళ్లు రాజు దగ్గరికెళ్ళి చదువుకునేవాడు.







ఒకరోజు రవి వాళ్ల నాన్నకు వేరే ఊళ్ళో ఏదో‌ పని పడింది. రవిని కూడా వెంటబెట్టుకొని పొరుగూరు వెళ్ళాడు. అక్కడ ఆయనకు బాగా దాహమైంది.
ఒక చెరువు కనబడితే నీళ్లు త్రాగుదామని వెళ్లారు ఇద్దరూ.







అక్కడ ఓ బోర్డుమీద వ్రాసి ఉన్నది:
'ఈ నీరు విషపూరితం' అని.
అయితే రవి వాళ్ల నాన్నకు చదువు రాదు కదా, బోర్డును పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాడు- నీళ్ళు త్రాగేందుకు.







అంతలో బోర్డు ముందు నిలబడి, ఏం రాసి ఉందో గట్టిగా చదివాడు రవి. అది వినగానే రవి వాళ్ళ నాన్న గబుక్కున వెనక్కి తిరిగి వచ్చేసాడు. రవికి చదువు రావటం వల్లనే తనకు ప్రాణాపాయం తప్పిందని గుర్తించాడు వాళ్ళ నాన్న. దాంతో ఆయన మనసు మారింది. 'చదువు వల్ల విజ్ఞానం పెరుగుతుంది' అని ఆయనకు అర్థం అయ్యింది.







చదువనేది మనిషికి ఎంత అవసరమో గుర్తించాడు రవి వాళ్ళ నాన్న. ఆ మరుసటి రోజు నుండి రవిని బడికి పంపించ సాగాడు ఆయన. బడిలో రవి చక్కగా చదువుకున్నాడు. మంచి పేరు తెచ్చుకున్నాడు.