రమేష్‌కి వేగంగా పోతుండటం అంటే చాలా ఇష్టం. మోటార్ బైకులు చాలా వేగంగా పోతాయి కదా, అందుకని అతనికి బైక్ రేస్ అంటే చాలా ఇష్టం . కానీ ఎంత ఇష్టం ఉన్నా, మరి అతనికి బండి లేదు. దాంతో చాలా బాధగా ఉండేది అతనికి.

అయితే కాలేజీలో డిగ్రీ చదువుకునే సమయంలో అతనికి ఒక అవకాశం వచ్చింది. వాళ్ళ కాలేజీ తరపున అతను ఒక బైక్ రేస్ పోటీకి వెళ్ళగల్గాడు. అక్కడ పోటీ పెట్టిన కంపెనీ వాళ్ళే రేసింగ్ బైకులు కూడా ఇస్తారు.

వాటినెక్కి ఎవరు ఎక్కువ వేగంగా వెళ్తారో, వాళ్ళకు అంత గొప్ప బహుమతి వస్తుంది. రమేష్ అందులో గెలిచాడు! ఐదు లక్షల రూపాయలు బహుమతిగా ఇచ్చారు వాళ్ళు!

రమేష్‌కి చాలా సంతోషం వేసింది- తన చదువుకు సరిపోయేంత డబ్బు వచ్చిపడిందని.

అయితే, అంతలోనే అతనికి ఆ డబ్బుతో సొంత బైక్ కొనుక్కోవాలని ఆశ పుట్టింది. ఆ పోటీకి వచ్చిన వాళ్లలో చాలా మందికి సొంత బళ్ళు ఉన్నాయి మరి! వాళ్లని చూసి అతనికి సొంత బైకు కావాలన్న తపన మరింత ఎక్కువైంది.

తన తల్లిదండ్రులని అడిగితే వాళ్ళు 'ఈ వచ్చిన డబ్బు నీదే, నీకు ఇష్టం వచ్చినట్లు వాడుకోవచ్చు. కానీ చూడు, నీకు ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి, మరిన్ని అవసరాలు భవిష్యత్తులో ఎదురవుతాయి కూడా..అందుకని వీటిని వాడకుండా పొదుపు చేసుకుంటే నయమేమో, ఆలోచించు" అన్నారు. కానీ రమేష్ పట్టు విడవలేదు. ఎంతో బ్రతిమలాడి వాళ్లను ఒప్పించాడు. తనకొచ్చిన బహుమతి డబ్బులతో ఒక రేసింగ్ బైకును కొన్నాడు. ఆ బైక్ మీద ఎంతో వేగంగా వెళ్లటం మొదలు పెట్టాడు.

మీరు చూసే ఉంటారు- అలా ఎంతో మంది ఎన్నో చోట్ల బైక్‌లు నడిపేందుకు పెట్రోలును వాడిఉంటారు.

ఎంతో డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. ఆ బళ్ళకి ప్రతిరోజూ పెట్రోల్ పోయించాలి కదా! మరి ఆ ప్రత్యేకమైన రేసింగ్ బైకుల్లో వాడే పెట్రోల్ కూడా ప్రత్యేకమైనదే- ఎంతో ఖరీదైనది. రమేష్ చిన్న చిన్న దూరాలకు కూడా బైక్ వాడేవాడు మరి!

అలాగ, ఇక రమేష్ ఖర్చు పెరిగిపోయింది. అంతకు ముందు నెలకొకసారి డబ్బులు అడిగి తీసుకునేవాడు, ఇప్పుడు ప్రతిరోజూ వాళ్ల నాన్నని డబ్బులు అడిగే పరిస్థితి వచ్చింది. దానితోబాటు అతని ఆరోగ్యం కూడా, మెల్లగా పాడవ్వటం మొదలయింది. పొట్ట పెరిగింది, కడుపు చుట్టూ క్రొవ్వు పేరుకున్నది, నడుం నొప్పి, భుజాల నొప్పి మొదలైనాయి. మొదట్లో రమేష్‌కి ఇవన్నీ తన బైకు వల్లనే అని తెలియలేదు. అయితే కొంత కాలం పాటు డాక్టర్ల చుట్టూ తిరిగాక, వాళ్ళు అతనికి చెప్పారు- 'ఇవన్నీ జీవనశైలి వల్ల వచ్చే సమస్యలు' అని.

రమేష్‌కి ఏం చెయ్యాలో తోచలేదు. అయితే ఆ సమయంలో వాళ్ల నాన్న ముందుకొచ్చి, తనకు ఒక సైకిలును కొనిపెట్టారు- "రమేష్, సైకిలే కదా అని చిన్నచూపు చూడకు. సైకిలుకు పెట్రోలు అవసరం ఉండదు. సైకిలు త్రొక్కటం వల్ల వ్యాయామం జరుగుతుంది, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. బైకును అమ్మెయ్యి; దీన్ని వాడి చూడు- అన్నీ సర్దుకుంటాయి" అన్నారు.

మొదట రమేష్‌ వాళ్ల నాన్న మాట వినలేదు. అయితే రానురాను పెట్రోల్ ధరలు మరింత పెరిగాయి. రమేష్‌ కాలేజీ ఫీజులు చెల్లించటానికి కూడా ఇబ్బందిగా ఉండింది. చివరికి అతను తన బైకును అమ్మేశాడు. ఆ వచ్చిన డబ్బులో అధిక భాగాన్ని పొదుపు చేశాడు. అయిష్టంగానే సైకిలును వాడటం మొదలు పెట్టాడు.

ఆశ్చర్యం! ఖర్చులు తగ్గాయి. డబ్బులు చేతిలో మిగిలాయి. రమేష్ ఆరోగ్యం కూడా బాగైంది. తనకి చదువుమీద ధ్యాస కుదిరింది. అన్నీ సర్దుకున్నాక,ఇప్పుడు రమేషే అందరికీ చెబుతున్నాడు- 'బైక్ కన్నా సైకిల్ మేలు కదా' అని!