ఒకూర్లో ఒక పేదోడు, ఒక ధనవంతుడు వుండేవాళ్ళు, పేదోడు చానా మంచోడు అంతేగాక చానా తెలివైనోడు. ధనవంతుడు చానా చెడ్డోడు అంతేగాక పక్కనోళ్ళు హాయిగా వుంటే అస్సలు ఓర్చుకొనేటోడు కాదు. ఇద్దరివీ పక్కపక్క ఇండ్లే.

ధనవంతునికి పేదోడంటే చానా కోపం, ఎందుకంటే పేదోడు వున్నదాంట్లో తాను తింటా, నలుగురికీ పెడతా, ఎప్పుడూ అందరితో గలగలా మాట్లాడుతా, కిలకిలమని నవ్వుతా సంబరంగా వుండేటోడు. ధనవంతుడు అట్లా కాదు. ఎప్పుడు చూసినా ఎవన్ని ఎట్లా ముంచాల్నా...ఎట్లా మరింత సంపాదించాల్నా అని ఆలోచిస్తా చిరాకుగా వుండేటోడు. రాత్రి పండుకున్నా వానికి నిద్ర గూడా వచ్చేది కాదు. వాడు పక్కింట్లో వున్న పేదోన్ని చూసి "వీనికి తినడానికి పైసా గూడా లేకున్నా పట్టుపరుపుల మీద పన్నుకునే నాకన్నా సంతోషంగా వుంటాడే" అని కోపం వచ్చేది. ఎట్లాగైనా సరే వీన్ని బాధ పెట్టి కళ్ళలో నీళ్ళు సూడాలి ' అనుకునేటోడు.

పేదోని దగ్గర ఒక మంచి బరగొడ్డు వుంది. రోజూ దాని పాలు పిండుకోని కావలసినంత గాసి తోడు పెట్టుకునేటోడు. తినడానికి ఏమీ లేకపోతే ఆ పెరుగునే మజ్జిగ చేసుకోని, ఇంత వుప్పేసుకోని కడుపు నిండా కమ్మగా తాగి కళ్ళు మూసుకోని హాయిగా నిదురపోయేటోడు. ధనవంతుని కన్ను ఆ బరగొడ్డు మీద పడింది. ఒకరోజు ఎవరూ లేనిది చూసి మట్టసంగా ఆ బరగొడ్డును తీసుకోని పోయి చంపేసినాడు.

పేదోడు పొద్దున్నే లేసి చూస్తే ఇంకేముంది. బరగొడ్డు ఎక్కడా కనబళ్ళేదు. బైటికి ఎక్కడికయినా పోయిందేమోనని వీధి వీధి వెదికినాడు. ఎక్కడా కనబళ్ళేదు. ఆఖరికి ధనవంతుని ఇంటి వెనకాల దిబ్బలో దాని చర్మం కనబడింది. వాడు ఒక్కమాట కూడా అనకుండా ఆ చర్మాన్ని తీసుకోని ఇంటికి వచ్చినాడు.

దాన్ని శుభ్రంగా కడిగి పక్కవూరిలో ఎంతకో ఒకంతకు అమ్ముదామని తోళ్ళ వ్యాపారి దగ్గరికి బైలుదేరినాడు.

కానీ అప్పటికీ సాయంకాలమైంది. వూరు దాటి కొంచం దూరం పోయినాడో లేదో చీకటి పడింది. చీకట్లో పోవడానికి భయపడి ఎందుకయినా మంచిదని ఒక పెద్ద చెట్టు ఎక్కి పైన కొమ్మల మధ్య కనబడ కుండా కూర్చున్నాడు. కాసేపటికి కొంతమంది దొంగలు అక్కడికి వచ్చినారు. చెట్టు కింద కూచోని ఎక్కడెక్కడి నుంచో దోచుకొని వచ్చిన సొమ్మంతా ముందు కుప్పేసుకుని పంచుకోసాగినారు. ఇదంతా పై నుంచి చూస్తోన్న పేదోడు "ఓ" అని గట్టిగా అరుస్తా "రేయ్...ఎవర్రా నా చెట్టు కిందకే వచ్చినారు. మిమ్మల్ని నలుచుకోని తింటా" అంటూ చేతిలోని బరగొడ్డు చర్మం దఖీమని వాళ్ళ మధ్య పడేసినాడు. దాన్ని చూస్తానే వాళ్ళు అదిరిపడి "ఓరినాయనోయ్... పైన ఏ రాక్షసుడో కూర్చోనున్నట్లు న్నాడు. బరగొడ్డును తిని చర్మం పాడేసినాడు. కిందికి గనుక వచ్చినాడంటే మన పని అంతే" అని భయపడి ఎక్కడివక్కడ వదిలేసి తలా ఒక దిక్కు చించుకోని పారిపోయినారు. వాళ్ళట్లా ఉరకడం ఆలస్యం పేదోడు టకటకటక చెట్టు దిగి అక్కడున్న బంగారమంతా గబగబగబ మూట గట్టుకోని చక్కగా ఇంటికి చెక్కేసినాడు.

ధనవంతుడు పొద్దున్నే లేసి చూస్తే ఇంకేముంది.. పేదోడు ఇంతకు ముందు కన్నా సంబంరంగా ఇంటి ముందు కూర్చోని పంచభక్ష పరమాన్నాలు తింటా కనబన్నాడు. అది చూసి ధనవంతుడు "ఏమిరా...అంత సంబరంగా కులుకుతా వున్నావు ఏమైంది" అన్నాడు. దానికి వాడు కిలకిలకిలమని నవ్వుతా "ఏం లేదనా... ఈ మధ్యనే రోగాలొచ్చి చుట్టు పక్కల వూళ్ళలో పశువులన్నీ ఒక్కటి గూడా మిగలకుం‌డా చచ్చిపోయినాయంట.

దాంతో పట్నంలో పశువుల చర్మాలకు ఎక్కడ లేని గిరాకీ వచ్చింది. నాకు కావాలంటే నాకు కావాలంటూ ఎగబడి నా బరగొడ్డు చర్మాన్ని వేయి బంగారు వరహాలిచ్చి కొనుక్కు పోయినారు. అబ్బ... నాకు ఇంకొన్ని పశువులు గనుక వున్నింటే దెబ్బకు పెద్ద జమీందారుని అయిపోయేటోన్ని" అన్నాడు.

ఆ మాటలింటానే ధనవంతునికి ఎక్కడ లేని ఆశా పుట్టుకొచ్చింది. వాని దగ్గర వంద బరగొడ్లున్నాయి వెంటనే అన్నిటినీ చంపించి చర్మాలన్నీ బండి మీదేసుకోని సంబరంగా పట్నానికి పోయినాడు. పోయి చూస్తే ఇంగేముంది అక్కడ ఒక్కడు గూడా పలకరించేటోడు లేడు. వూకిస్తామన్నా తీసుకునేటోడు లేడు. దాంతో వానికి పేదోడు దెబ్బకు దెబ్బ తీసినాడని అర్థమైంది. కోపంగా బుసలు కొడతా ఇంటికి వచ్చినాడు.

ఒకరోజు ఇంట్లో ఎవరూ లేనిది చూసి పేదోని ఇంటిని మొత్తం తగల బెట్టినాడు. పేదోడు వచ్చి చూసే సరికి ఇంకేముంది మొత్తం‌ బూడిదయిపోయింది. అలా చేసింది ధనవంతుడే అని తెలిసినా వాడు ఒక్కమాటా అనలేదు. గమ్మున ఆ బూడిదనంతా సంచులకెత్తుకోని బండిలో వేసుకోని వూరి బైట ఎక్కడయినా పారేద్దామని బైలుదేరినాడు.

అట్లా పోతా వుంటే దారిలో ఒక వ్యాపారి బండి మీద మూటలేసుకోని ఎదురుగా వచ్చినాడు. వాడు పేదోన్ని చూసి "ఏమున్నాయి ఆ సంచుల్లో" అన్నాడు. పేదోడు నవ్వుతా "రత్నాలు, వజ్రాలు" అన్నాడు. దానికా వ్యాపారి "అలాగా నా మూటల్లో బంగారం వుంది. నువ్వు నాకు రత్నాలు, వజ్రాలు ఇస్తావా...నేను నీకు బంగారం ఇస్తా" అన్నాడు. పేదోడు సరే అన్నాడు. దాంతో ఆ వ్యాపారి "అయితే బండ్లు మార్చుకుందాం రా" అంటూ తన బండి పేదోనికిచ్చి, పేదోని బండి తాను తీసుకోని పోయినాడు.

తరువాత రోజు పొద్దున్నే ధనవంతుడు లేసి చూస్తే ఇంకేముంది..పేదోడు పట్టుబట్టలు కట్టుకోని వందమంది పనోళ్ళతో కొత్త ఇంటి కోసం పునాదులు తవ్విస్తా కనబన్నాడు. అది చూసి ఆశ్చర్య పడుతూ "ఇదేందిరా..ఇంత పెద్ద ఇంటి కోసం ఇంత మందితో పని చేయిస్తా వున్నావు. అంత డబ్బెక్కడిది" అన్నాడు.

దానికి వాడు కిలకిల నవ్వుతా "ఏం లేదనా...పక్కూర్లో ఒక వ్యాపారికి బూడిదతో చానా పని బడిందంట.

దాంతో సంచి సంచి బూడిదకు సంచి సంచి బంగారం ఇస్తానని బంగారం మూటలు బండి మీదేసుకోని తిరుగుతూ వున్నాడు" అన్నాడు.

అలాగా అని ఆ ధనవంతుడు వాని బంగళా మొత్తం తగులబెట్టుకొని బూడిదను ఏడు బండ్లకు ఎత్తుకోని పక్కూరికి బైలుదేరినాడు. అడవిలో వ్యాపారస్తుడు బంగారు మూటల్తో పోతా వున్నాడు. వాన్ని చూసి ధనవంతుడు "ఏం వ్యాపారీ...నీ బంగారు మూటల్తో నా బూడిద మూటలు మార్చుకుందామా" అన్నాడు నవ్వుతా... దాంతో వాడు ఇంతకుముందు మోసం చేసింది వీడేననుకోని "దొంగబడవా!

సారిసారికి మోసపోవడానికి నేనేమన్నా వెర్రోన్ని అనుకుంటున్నావా" అంటూ పట్టుకోని తన్నినచోట తన్నకుండా మెత్తగా తన్ని పంపించినాడు.

ధనవంతునికి కోపం పెరిగిపోయింది. ఈ సారి వీని సంగతి అటో ఇటో తేల్చి పారేయాలనుకున్నాడు. ఆ రోజు రాత్రి బాగా చీకటి పన్నాక, అందరూ పండుకున్నాక చప్పుడు కాకుండా‌ అడుగులో అడుగు వేసుకుంటా పోయి, వాని ముక్కుకు మత్తుమందు చూపి, కాళ్ళూ చేతులూ కట్టేసి, వూరవతల వున్న ఒక పెద్ద బావిలో పాడేసినాడు. కానీ పేదోని అదృష్టం కొద్దీ అందులో నీళ్ళు లేవు. మెత్తని గడ్డి మీద పన్నాడు. మత్తు తగ్గగానే పేదోడు లేచి నోటితో తాళ్ళు ఇప్పుకొన్నాడు. పైకి లేస్తుంటే కాళ్ళకు ఏవో తట్టుకున్నాయి. ఏమబ్బా అని చూస్తే‌ ఇంకేముంది... ఎప్పుడో ఎవరో దాచిపెట్టిన లంకె బిందెలు కనబన్నాయి. అవన్నీ మూటగట్టుకొని కాపాడండి కాపాడండి... అంటూ గట్టిగా కేకలు పెట్టసాగినాడు. దారిలో పోతా వున్న కొందరు ఆ అరుపులు విని లోపలికి తాడేసి వాన్ని కాపాడినారు.

ధనవంతుడు తరువాత రోజు పొద్దున్నే లేసి చూస్తే ఇంకేముంది... పేదోడు ఇంటి ముందు కూచోని లంకెబిందెల్లోని వరహాలు లెక్కబెడుతా కనబన్నాడు. అది చూసి ఆశ్చర్యపోయిన ధనవంతుడు "ఈ వరహాలు ఎక్కడివిరా" అన్నాడు. దానికి వాడు కిలకిలమని నవ్వుతా "నిన్న ఎవరో నన్ను ఎత్తుకోని పోయి వూరి బైటి బావిలో పాడేసినారు. ఆ బావి అట్లాంటిట్లాంటి మామూలు బావి కాదు. స్వర్గానికి దారి వున్న బావి. నేను లోపల పడగానే చనిపోయిన మా తాత ముత్తాతలంతా వచ్చి స్వర్గానికి తీసుకపోయినారు.

పొద్దున తిరిగి వచ్చే ముందు ఇదిగో ఈ లంకెబిందెలు ఇచ్చినారు" అన్నాడు సంబరంగా.

దాంతో ఆ ధనవంతునికి ఆశ పుట్టింది. ఆ రోజు రాత్రి ఎవరికీ చెప్పకుండా పది గోనె సంచులు తీసుకోని పోయి ఎగిరి బావిలో దుంకినాడు. కానీ పాపం...వాని దురదృష్టం కొద్దీ పోయి ఒక పెద్ద బండ మీద పన్నాడు.

అంతే...తల పగిలి అక్కడికక్కడే చచ్చిపోయినాడు.