విజయనగర రాజ్యంలో వరహాలయ్య అనే వ్యాపారి ఉండేవాడు. ప్రజలు తమ అవసరాల కోసం అతని దగ్గర ఎక్కువ వడ్డీకి అప్పు తీసుకునేవారు. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించడంలో కాస్త ఆలస్యమైతేచాలు- బలవంతంగా మరిన్ని ఎక్కువ డబ్బులు వసూలు చేసేవాడతను. అయినా ప్రజలకి మరో ఆధారం లేక, ఎంత ఇబ్బందిగా ఉన్నా అతన్నే ఆశ్రయిస్తూండేవాళ్ళు. పెళ్ళిళ్ళకు, పెద్ద వంటలకు అవసరమైన పాత్రల్ని కూడా అద్దెకు ఇచ్చేవాడు వరహాలయ్య. వాటిని తిరిగి ఇవ్వటంలో కాసింత ఆలస్యం అయినా, ఆ పాత్రలు పాతబడినా అతను చేసే గొడవకు అంతు ఉండేదికాదు. ఈ విషయం రాయలవారి ఆస్థానంలో ఉన్న తెనాలి రామకృష్ణుడికి తెలిసింది. ఎలాగైనా వరహాలయ్యకు బుద్ధి చెప్పాలనుకున్నాడు.

ఒక రోజున వరహాలయ్య దగ్గరికి వెళ్లి "మా ఇంట్లో రేపు విందు జరగనున్నది- అన్నం వండడానికి ఒక పెద్ద గిన్నె కావాలి" అని అడిగాడు రామకృష్ణుడు.

వరహాలయ్యకు రామకృష్ణుడు పరిచయమే. అయినా " గిన్నెకు బాడుగగా పది బంగారు నాణేలు ఇవ్వండి.

నాణాలు ముందుగా ఇస్తేనే గిన్నె అరువు ఇచ్చేది" అన్నాడు వరహాలయ్య.

"ఓహో! అట్లానా! పది బంగారు నాణాలు బాడుగ ఇవ్వాలా? అవునవునులెండి! మీ పద్ధతులు మీవి" అంటూ ముందుగా పది బంగారు నాణేలు చెల్లించి గిన్నెను తీసుకువెళ్ళాడు రామకృష్ణుడు.

రెండు రోజుల తరువాత వరహాలయ్య దగ్గరికి రెండు గిన్నెలు పట్టుకెళ్ళాడు రామకృష్ణుడు. తను తీసుకెళ్ళిన గిన్నెతో పాటు మరో గిన్నెను కూడా వరహాలయ్యకు ఇస్తూ చెప్పాడు సంతోషంగా: "మీరు నాకు ఇచ్చారా, ఒక గిన్నె? అది చాలా బరువుగా ఉంటే, 'ఎందుకా' అనుకున్నాను. నిన్న రాత్రి దానికి ఈ గిన్నె పుట్టింది !" అని.

"రామకృష్ణుడు ఇంత అమాయకుడా?" అని వరహాలయ్య సంబరపడిపోయాడు. "అవునవును. అది గర్భంతో‌ ఉండింది నీకు అద్దెకు ఇచ్చేటప్పటికి. 'నువ్వు తల్లిని, పిల్లని సరిగా వెనక్కి తెచ్చిస్తావా, లేదా' అని అనుమానించాను. మంచివాడివేలే!" అన్నాడు పైకి. "వీడు అసాధ్యుడు అని అందరూ చెబుతుంటారు, కానీ నాకు మాత్రం భలే లాభం కలిగించాడు"అని మనసులో అనుకుంటూ.

వారం రోజుల తర్వాత రామకృష్ణుడు వరహాలయ్య దగ్గరికి వెళ్ళాడు మళ్ళీ- "రేపు మా అమ్మగారి పేరు మీద అన్నదానం చేయాలనుకుంటున్నాను. నాకు కొన్ని గిన్నెలు కావాలి. ఇదివరకటిలాగే అద్దె చెల్లిస్తానులెండి" అన్నాడు.

రామకృష్ణుడిని చూడగానే వరహాలయ్య ముఖం వికసించింది. "కొన్ని కాదు; నా దగ్గర ఉన్న అన్ని గిన్నెలూ ఇస్తాను- తీసుకెళ్ళండి" అని తన ఇంట్లో ఉన్న గిన్నెలన్నిటినీ బండి మీద వేసి రామకృష్ణుడి ఇంటికి పంపించాడు సంతోషంగా- "ఈసారి తనకు ఎంత లాభం కలుగుతుందో" అని ఆశగా ఎదురూ చూస్తూ .

పది రోజులు గడిచిపోయాయి, కానీ‌ రామకృష్ణుడు గిన్నెల్ని తిరిగి ఇవ్వనే లేదు! చివరికి వరహాలయ్యే అతని ఇంటికి వెళ్ళి గిన్నెల గురించి అడిగాడు.

"అయ్యో! ఏం చెప్పేది! నువ్వు ఇచ్చిన గిన్నెలు రాత్రికి రాత్రే పారిపోయాయి. దాంతో మా ఇంట్లో కార్యం కూడా జరగకుండా అయ్యింది. నీ మీద రాజుగారికి ఫిర్యాదు చేద్దామనుకున్నానుగానీ, పోనిమ్మని ఊరుకున్నాను అంతే" చెప్పాడు రామకృష్ణుడు.

"గిన్నెలు పారిపోవడం ఏమిటి? అంతా మోసం!" అరిచాడు వరహాలయ్య. కానీ రామకృష్ణుడు తను చెప్పిందే చెబుతూ వచ్చాడు. ఇంక చేసేదేమీ లేక, రాయలవారి దగ్గర రామకృష్ణుడి మీద ఫిర్యాదు చేశాడు వరహాలయ్య.

రాయలవారు వరహాలయ్య గురించి ఆరా తీశారు. రామకృష్ణుణ్ణి పిలిపించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

సంగతంతా అర్థమయ్యాక, చిరునవ్వు నవ్వారు.

"నీ గిన్నెకు మరో గిన్నె పుట్టడం నిజమయినప్పుడు, ఆ గిన్నెలు పారిపోవడం నిజం ఎందుకు కాకూడదు?!" అని వరహాలయ్య ఫిర్యాదును కొట్టేశారు.

వరహాలయ్య సిగ్గుతో తల దించుకున్నాడు. తనకు బుద్ధి చెప్పడానికే రామకృష్ణుడు ఇలా చేశాడని అర్థం చేసుకున్నాడు. అప్పటి నుండి నీతిగా జీవించాడు.