ఈసారి నేను పరిచయం చేయబోతున్నది విలియం యువాన్ అనే పదిహేనేళ్ళ అబ్బాయిని. అతను అమెరికాలోని ఆరెగన్ రాష్ట్రంలో స్కూల్లో చదువుకుంటున్నాడు. చిన్నవాడే అయినా, ఇప్పటికే ఈ అబ్బాయి చేసిన పనులను చూస్తే ముచ్చటేస్తుంది.

అమెరికా దేశంలో "డేవిడ్సన్స్ ఆర్గనైజేషన్" అని ఒక సంస్థ ఉంది. ఈ సంస్థ ఏటా పద్ధెనిమిదేళ్ళ లోపు వయసున్న పిల్లల్లో అసాధారణ తెలివితేటలు ప్రదర్శించిన వారికి, వాళ్ళు చేయాలనుకుంటున్న పరిశోధనలను ప్రోత్సహిస్తూ, ఉపకార వేతనం ఇస్తుంది. అలా 2005వ సంవత్సరంలో మన యువాన్‌కి కూడా ఈ అవార్డు దక్కింది.

ఇంతకీ, ఈ అబ్బాయి ఏం చేశాడూ అంటే : ఒక కొత్తతరం 3D Solar cell తయారు చేసాడు. మీరు ఎప్పుడైనా సోలార్‌సెల్‌ని చూశారా? మెరిసే బిళ్ళల్లాంటివి, ఒక గాజు పలకలో పెట్టి ఉంటాయి. దాన్ని సూర్యుడి వెలుతురులో పెడితే వాటినుండి కరెంటు బయటికి వస్తుంది!

అయితే యువాన్ రూపొందించిన నమూనాలో బిళ్లలు పలచగా, నేలబారుకి ఉండవు. చిన్న చిన్న డబ్బాలలాగా ఉంటాయి. మామూలు సోలార్ పలకల్లో సిలికాన్ వగైరా మూలకాలను వాడితే, వీటిలో అతి సూక్ష్మమైన కర్బన పైపులు ఉంటాయట! వీటి వల్ల అవి మామూలు వెలుగునే కాదు; సూర్యరశ్మిలో కంటికి కనబడని అతి నీలలోహిత కిరణాలను సైతం సేకరించేస్తాయి. అలా అతను తయారు చేసిన సోలార్ సెల్ సౌరశక్తి ఉత్పత్తి మామూలు సోలార్ సెల్ తో పోలిస్తే ఐదు వందల రెట్లు పెరిగిందట! ఇంకా పూర్తిగా మార్కెట్లోకి రాని అత్యాధునిక త్రీడీ సోలార్ సెల్‌లతో పోలిస్తే ఇది తొమ్మిది రెట్లు నయమట!

అలాగే, సౌర ఇంధన సాధనకు ఉపయోగపడే "సోలార్ టవర్" కి ఒక కొత్త డిజైన్ ప్రతిపాదించాడు యువాన్. ఆ టవర్‌లోపల కూడా అతి సూక్ష్మంగా ఉండే పైపుల సాంకేతికత ఉన్నది. అతను రాసిన కంప్యూటర్ ప్రోగ్రాం ద్వారా ఆ టవర్ పని తీరును అధ్యయనం చేయవచ్చట కూడాను. మరి, ఇదంతా చేస్తున్నప్పుడు అతని వయసు ఎంత అనుకుంటున్నారు? పన్నెండేళ్ళు మాత్రమే!!

అతనికి పదేళ్ళ వయసు ఉన్నప్పుడు అతను అమెరికాలో పిల్లలకు సైన్సుపైన ఆసక్తి కలిగించేందుకు రూపొందించిన "ఫస్ట్ లెగో లీగ్" అన్న కార్యక్రమంలో చేరాడు. అక్కడే అతనికి పర్యావరణానికి హాని కలిగించని ఇంధన వనరుల గురించి, సూక్ష్మంగా ఉండే పైపులకు సంబంధించిన 'నానో టెక్నాలజీ' గురించి అవగాహన కలిగిందట. భావితరాలకి సౌరశక్తి వల్ల గల ఉపయోగాలు అర్థమై, ఈ దిశలో పరిశోధన మొదలుపెట్టాడట. స్కూలు పాఠాలు కాకుండా, ఈ పరిశోధనల కోసం విడిగా కూడా కొన్ని కోర్సులలోకూడా చదివాడట. వాళ్ళ నాన్న యూనివర్శిటీలో పనిచేయటం అతనికి కలిసి వచ్చింది కూడా.

ఇవన్నీ చేశాడంటే 'వాడు ఒట్టి పుస్తకాల పురుగు' అనుకోకండి. యువాన్‌కి తాయిక్వాందో అనే యుద్ధక్రీడలో బ్లాక్ బెల్ట్ కూడా ఉందట. పియానో వాయించడం, చెస్ ఆడడం కూడా తెలుసట. వీటిల్లో ఎన్నో బహుమతులు కూడా వచ్చాయి. ఇవన్నీ కాక, దగ్గరలో ఉన్న ఎలిమెంటరీ స్కూలులో అప్పుడప్పుడు పాఠాలు కూడా చెబుతాడట!

ఇంత చిన్న వయసులోనే ఇవన్నీ చేసాడంటే ఆశ్చర్యంగా లేదూ! 'అందరం విలియంలా అయిపోవాలి' అని లేదు కానీ, మన పాఠ్య పుస్తకాలకి అవతల కూడా మన తడాఖా చూపించుకోవాలి. ఇలాంటి ప్రోగ్రాములు, అవార్డులు మనదేశంలో ఉండొచ్చు; ఉండకపోవచ్చు. అయినా కూడా, మనకున్న పరిమితుల్లో స్కూలు హద్దులు దాటి ఎదగాలి. ఏమంటారు?