నేలమీద నా శరీరం నిస్సహాయంగా పడి ఉంది. ఇసుక యొక్క ఆ వెచ్చని స్పర్శ నా నిస్సహాయతను మర్చిపోయేలా చేస్తున్నది. లావుపాటి తాళ్ళతో‌బంధించబడిన నా శరీరం స్వాతంత్ర్యం కోసం ఉవ్విళ్ళూరుతున్నది. సగం తెరవబడిన నా కళ్ళు చుట్టూ ఉన్న ఇసుకను, ఎదురుగుండా ఉన్న సముద్రాన్ని నిస్సారంగా చూస్తున్నాయి..

అప్పుడో వ్యక్తి వచ్చాడక్కడికి. నన్ను బంధించి ఉన్న త్రాళ్ళన్నిటినీ కోసివేసి, 'నా వెంట రా!' అని ఆదేశించాడు. నేను మారు మాట్లాడ కుండా అతని వెంట వెళ్ళి అతను ఎక్కిన ఓ పడవలోకి ఎక్కాను. అన్నం తిని ఎన్నిరోజులైందో మరి, పడవలో ఒక మూలన చతికిల పడేంతవరకూ నాకు ఊపిరి ఆడినట్లే లేదు! ఆకాశపు వెలుతురును తట్టుకోలేనట్లు నా కళ్ళు వాటంతట అవే మూతలు పడ్డాయి.

మళ్ళీ తెలివి వచ్చేసరికి, నేనెక్కిన పడవ కదులుతున్నట్లు నాకు తెలుస్తున్నది. పడవలో నాతో కలిపి మొత్తం ముగ్గురం ఉన్నాం. వాళ్లలో ఒక మధ్య వయస్కుడు నాకు ఒక కవర్ అందించాడు- అందులో కొంచెం ఆహారం ఉంది!

వాళ్ళిద్దరూ నావైపు ఆసక్తి లేని మొహాలతో చూశారు. నేను వాళ్లిచ్చిన అన్నం తినేందుకు ఒకసారి తటపటాయించాను; కానీ చివరికి ఆకలే గెలిచింది. నా దృష్టిని వాళ్ల మొహాలమీది నుంచి మరలించి, తినే అన్నంపైన పెట్టటం మొదలెట్టాను..

మళ్ళీ నిద్రలేచాక అడిగాడు వాళ్లలో ఒకడు- "కొంచెం శక్తి వచ్చినట్లుంది.. మాట్లాడ గలవా, ఇప్పుడు?" అని.

నాగురించి చెప్పటం మొదలెట్టాను.

"నేనొక సైనికుడిని. యుద్ధసమయంలో శత్రువులు నన్ను బందీని చేశారు. ప్రయాణిస్తూ ఆ దీవిలో ఆగారు వాళ్ళు. వాళ్ల దగ్గరున్న ఆహారం అయిపోవచ్చింది. నా వల్ల వాళ్లకు ఒరిగేదేమీ లేదని తెలియవచ్చింది-ఇక నామీద ఆహారాన్ని, నీళ్లను వెచ్చించటం వృధా. దయగలవాళ్ళు కనుక, నన్ను సముద్రంలో విసిరెయ్యకుండా ఆ దీవిలో వదిలి పెట్టి వెళ్ళిపోయారు" అని వివరించా.

"మా ఊరు ఇక్కడికి 50మైళ్ళ దూరంలో ఉంది. ముందు నిన్ను అక్కడికి తీసుకెళ్తాం. ఆ తర్వాత నిన్ను మీ ఊరికి ఎలా చేర్చాలో ఆలోచిస్తాం" అన్నారు వాళ్ళు.

శత్రువుల దెబ్బలతో ఒళ్ళు హూనమైన నాకు, ఆ సుదీర్ఘ ప్రయాణంలో ఎప్పుడు నిద్రపట్టిందో తెలీదు. మళ్ళీ ప్రొద్దున కళ్ళు తెరిచేటప్పటికి మా చుట్టూ అనంతమైన సముద్రం. వాళ్ల మొహాలు చూడగా నాకు అర్థమైన విషయం ఏంటంటే- రాత్రి వచ్చిన తుఫానులో మేం దారి తప్పాం!

అయితే వాళ్ళిద్దరూ అనుభవం ఉన్న నావికులు. తప్పిపోయామన్న బాధ అణుమాత్రం కూడా కనబడలేదు వాళ్లలో. ఎటువైపు పోవాలో లెక్కలు వేసుకొని, అటువైపుకు వేగంగా పడవను నడపటం మొదలెట్టారు ఇద్దరూ. సగం రోజు గడిచింది.. చుట్టూ నీలిరంగు సముద్రం తప్ప మరేమీ కనబడటం లేదు.

వాళ్ళిద్దరూ వంతుల వారీగా పడవను నడిపే బాధ్యత తీసుకుంటున్నారు. ఊరికే కూర్చుంటున్నందుకు నాకు సిగ్గుగా ఉంది- కానీ ఏం చేసేది, శరీరంలో ఏమాత్రం శక్తి లేదు. మెల్లగా ఒకరోజు గడిచింది. పడవలో త్రాగే నీళ్ళు ఎక్కువ ఉన్నట్లు లేవు. సముద్రంలో నీళ్ళు ఉప్పగా ఉంటై- త్రాగేందుకు పనికి రావు.

నేను మెల్లగా శక్తిని కూడగట్టుకొని కూర్చున్నాను. "నీళ్ళు కావాలంటే త్రాగు. ఆహారం కూడా నీకే. కొంచెం పొదుపుగా ఉండు. నేల ఎప్పటికి తగుల్తుందో చెప్పలేం" అన్నాడు వాళ్ళలో ఒకడు.

నేను వాళ్లకేసి అదోలా చూశాను. కొన్ని నీళ్ళు త్రాగి, కొంచెం అన్నం తిన్నాను. మెల్లగా వాళ్లిద్దరితోబాటు నేనూ ఒకవంతు పడవ నడిపించటం మొదలు పెట్టాను. ఇప్పుడు ముగ్గురం పడవ నడుపుతున్నాం. చాలా శ్రమతో కూడిన పని అది. ఇలా మూడు రోజులు గడిచాయి. పడవలో నీళ్ళు, ఆహారం దాదాపు అయిపోయాయి. వాళ్ళిద్దరూ నీళ్ళు త్రాగటం మానేశారు: అన్నం అయితే రెండురోజులుగా అసలు తిననేలేదు.

ఇప్పుడు ఒక గంట పడవ నడిపితే ఒక గంట ఏమీ చెయ్యకుండా విశ్రాంతిగా కూర్చుంటున్నాం; ముగ్గురం చాలా నీరసించిపోయాం. అందరి ముఖాలలోనూ అసహనం స్పష్టంగా కనబడుతూంది. రానురాను పడవ నడిపే శక్తి మాలో పూర్తిగా హరించుకుపోయింది. ముగ్గురం ఏమీ పట్టనట్టు కూర్చున్నాం పడవలో.

రాత్రి అయ్యింది మళ్ళీ. వాతావరణం చల్లగా మారింది. మాకు అన్ని వాతావరణాలూ ఒకటే అన్నట్లున్నాయి. చుట్టూ సముద్రం నిశ్చలంగా ఉంది. పైన నక్షత్రాలు మెరుస్తున్నై. వాటిని చూస్తుంటే నాలో విచిత్రమైన అలజడి.. "వీళ్లిద్దరికీ నేను బరువౌతున్నానా? నీళ్లని, ఆహారాన్ని పొదుపు చేసుకోవటంకోసం ఈ రాత్రికి వీళ్ళు నన్ను సముద్రంలోకి విసిరేస్తారేమో...?"

ఆలోచనలతోటే తెల్లవారింది.

వాళ్లలో ఒకడు కదిలాడు- తన జేబులో ఉన్న స్టీలు వాచీని తీసి చూసుకున్నాడు. దాన్ని తన ముంజేతికి కట్టుకున్నాడు. దాన్నే తడుముకుంటూ మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. ఎవరో గుర్తుగా ఇచ్చిన వాచీ అయి ఉంటుందది. ఎవరిచ్చారో‌ మరి..

ముగ్గురం స్పృహ తప్పినట్లు పడిపోయాం..మధ్యాహం తర్వాత ఏదో పెద్ద శబ్దం వినవచ్చి కళ్ళు తెరిచి చూశాను. సందేహం లేదు. హెలికాప్టర్ శబ్దం! మమ్మల్ని కాపాడేందుకు వచ్చినట్లుందది! నేను సంతోషంతో అరవాలని ప్రయత్నించాను. గొంతులోంచి అరుపు రాలేదు. నా ఆనందాన్ని పంచుకునేందుకని వాళ్ళిద్దర్నీ లేపేందుకు ప్రయత్నించాను- కానీ వాళ్ళు లేవనే లేదు.

హెలికాప్టర్‌లోని వాళ్ళు నన్నూ, వాళ్ళిద్దరి శవాలనూ పైకి ఎక్కించారు. నాలో ఒక తెలియని ఉద్వేగం..సంతోషించాలో, దు:ఖించాలో తెలియని స్థితి.

"వాళ్ళిద్దరూ ఎవ్వరో తెలీదు నాకు. కానీ నా కోసం తమ ప్రాణాల్ని అవలీలగా త్యాగం చేశారు..ఎందుకు? ఆకలికీ, దాహానికీ తట్టుకోలేక చనిపోయారు- అయినా పడవలో నాకోసం ఉంచిన నీళ్ళను మాత్రం ముట్టుకోలేదే, ఇద్దరూ..?"

హెలికాప్టర్‌లో ఉన్నవాళ్ళ మాటలు వినబడుతున్నాయి, లీలగా.."చనిపోయిన ఆ ఇద్దరిలో ఒకడి చేతికి స్టీలు వాచీ ఉంది చూశావా? సూర్య కిరణాలు ఆ వాచీ మీదపడి, ఆకాశంలోకి పరావర్తనం చెందాయి. హెలికాప్టర్‌లో ఉన్న మన దృష్టిని అవే, ఇటు మరల్చాయి. లేకపోతే ఇతను కూడా‌ బ్రతికేవాడు కాదు.." అని.

పేరు తెలీని వాళ్ళే కాదు; వాళ్లకి దగ్గరి వాళ్ళు కూడా‌ నాకు ప్రాణ భిక్ష పెట్టారన్నమాట! అంత స్తబ్దతలోనూ నా కళ్ళు చెమర్చటం నాకు తెలిసింది.