"ఆ చంద్రుడంతటివాడు ఆజ్ఞాపించాడంటే అది మనందరికీ శిరోధార్యమే. మారు పలుకక, ఆయన మాట వినండి. అలా ఆచరిస్తామని ముందుగా ఆయనకు విన్నవించుకోండి" అని ముగించింది విజయుడు.

పిడుగు పాటు లాంటి ఆ వాక్యాలు విని అంత పెద్ద ఏనుగుల రాజు గుండెలూ అవిసిపోయాయి. భయంతో ఏనుగుల శరీరాలు వణికాయి. వశం తప్పిన మనసును ఎట్టకేలకు సంబాళించుకొని, వణికే గొంతుతో ఆ ఏనుగుల రాజు అన్నది- "సాధారణ ప్రాణులం; మేం ఆ మహానుభావుడి కోపం ముందు నిలిచేంతవాళ్లమా?! పిల్లలు బుద్ధిలేక, ఏది మంచో- ఏది చెడో తెలీక, ఒకప్పుడు మాటమీరి ప్రవర్తిస్తే ప్రవర్తించవచ్చు గానీ, తండ్రి దాన్ని మనసులో‌ పెట్టుకుంటాడా? ఆ చంద్రుడికి బుధుడు ఎలా కుమారుడో, మేమూ అంతే! తెలీనితనం కొద్దీ మేం మిమ్మల్ని కష్టపెట్టాం తప్ప, కావాలని కాదు కదా! అందుకని

మా తప్పుల్ని మన్నించమని మా తరపున నువ్వే ఆ చంద్రుడిని వేడుకో, దయచేసి. ఇకపై ఎన్నడూ‌ ఈ సరస్సు దగ్గరికి రాము. ప్రాణ భయం కొద్దీ సమయానుకూలంగా మాట్లాడుతున్న మాట కాదు సుమా, ఇది! మీ రాజుకు మాపైన దయ కలిగేటట్లు ఎలా మాట్లాడతావో, నీదే భారం. మేం మళ్ళీ‌ ఇటు రాము; మాకు మాత్రం‌ నీ మాట సాయం అవసరం. మరువకు. పోయి వస్తాం!" అన్నది.

అప్పుడు కుందేలు దానితో "ఓ రాజా! మా ప్రభువైన చంద్రుడు సన్మార్గాన్ని ప్రేమిస్తాడు. దయానిధి కూడాను. మంచివారి తప్పుల్ని సులువుగా క్షమిస్తాడు. ఈ సరస్సుకు 'చంద్ర సరస్సు' అని పేరు వచ్చింది ఆయన వల్లనే! మేమందరం ఆయన అనుచరులం. ఆయన ఆజ్ఞ మేరకు ఇక్కడ కావలిగా ఉన్నాం. ఆయన మమ్మల్ని తన పిల్లల్లాగా ప్రేమిస్తాడు. ఈ సమయంలో ఆయన చాలా దూరంలో ఆకాశంలో సంచరిస్తూ ఉంటాడు.

మనం ఆయన్ని ఇప్పుడు అందుకోవటం అసాధ్యం. అప్పుడప్పుడు ఆయనే స్వయంగా ఈ సరస్సుకు వచ్చి చూసిపోతుంటాడు. ఇవాళ్ల రాత్రి ఇక్కడికి తప్పక విచ్చేస్తాడు. "సమ్ముఖంలో రాయబారం ఎందుకు?" ఆయన వచ్చినప్పుడు తమరు ఆయన్ని దర్శించుకొని, మీ మాటను మీరే ఆయనకు విన్నవించుకొని, ఆయన అనుగ్రహం పొందవచ్చు. అంతవరకూ ఇక్కడికి దగ్గర్లోనే ఎక్కడైనా విశ్రాంతి తీసుకొమ్మని నా అభ్యర్థన" అని చెప్పి దాన్ని ఒప్పించింది.

కొంత సేపటికి సాయంత్రమైంది. సంజ చీకట్లు తొంగి చూడటం‌ మొదలు పెట్టగానే శశకాల (కుందేళ్ల) ప్రభువైన శశాంకుడు (చంద్రుడు) ఆకాశంలోకి వచ్చాడు. అప్పుడప్పుడే ఉదయిస్తున్న ఆ చంద్రుడు ఎర్రటి కాంతులీనుతూ ప్రకాశిస్తున్నాడు. అతని ప్రతిబింబం నీళ్ళలో తళుకులీనుతున్నది. గాలికి కదలే నీటి కెరటాల నడుమన ఆ ప్రతిబింబం కూడా ప్రకంపిస్తున్నది.

కుందేలు ఏనుగుల రాజును ఆ సమయంలో అక్కడికి తోడుకొని పోయింది. దానిని అక్కడే ఒక చెట్టు చాటుగా నిలిపి, నీటిలో‌ చంద్రుని ప్రతిబింబాన్ని చూపిస్తూ "చూశారా, ఆ మహారాజు కోపంతో ఎలా ఎర్రబారి ఉన్నాడో!? ఎలా ఊగిపోతున్నాడో చూశారుగా?! మీరు ఆయనతో‌ మాట్లాడేందుకు ఇది తగిన సమయం కాదు. ఆయన కొంచెం శాంతించాక, సమయం చూసుకొని మీ తరపున నేనే ఆయనతో మాట్లాడతానులెండి! మీరన్న మాటలు ఆయనకు సమయానుకూలంగా వెల్లడించి, ఆయన మీపట్ల కరుణతో వ్యవహరించేట్లు చూస్తాను.

మీరు మటుకు ఎక్కువ శబ్దం చేయకుండా, వెంటనే మీ తావుకు వెళ్ళిపోండి. ఇక్కడినుండే ఆయనకు నమస్కరించుకొని పోండి. మిగతా సంగతులన్నీ‌ నాకు వదిలెయ్యండి- నేను చూసుకుంటాను" అన్నది. ఏనుగుల రాజు సంభ్రమాశ్చర్యాలు ముప్పిగిగొనగా అక్కడినుండే చంద్రుడికి మ్రొక్కి, శబ్దంచెయ్యకుండా వెనక్కి తిరిగి వెళ్ళి పోయింది.

విజయుడు ఆ విధంగా ఏనుగులన్నిటినీ‌ వెనక్కి పంపించి, తన జన్మ ధన్యమైందని సంతోషపడ్డది. వికసించిన ముఖంతో అది పోయి తమ రాజు శిలీముఖుడికి నమస్కరించగానే కుందేళ్లరాజు సంతోషంతో మనసు పట్టలేకపోయింది. అదింకా తను ఏం చేసిందో చెప్పకనే ఆ కుందేళ్లరాజు ఆశ్చర్యాన్ని ఒలికించే కళ్లలో కాంతులు మెరుస్తుండగా దానికేసి చూస్తూ "పోయిన పనిని అవలీలగా పూర్తి చేసుకొని వచ్చావని వెలిగిపోతున్న నీ ముఖమే చెప్తున్నది. కోరినదానినల్లా నెరవేర్చుకొనగలిగే సంకల్పశక్తి నీ సొత్తు కదా! నీ కోరిక వ్యర్థం‌ ఎట్లా అవుతుంది?! నీలాంటి వాడు మా మేలు కోరుతున్నాడు కాబట్టే గదా, మేమంతా మృత్యువు పాల బడకుండా బ్రతికి ఉన్నది! పదివేల జన్మలు ఎత్తినా నీ ఋణాన్ని తీర్చుకోలేం, మేము!" అని దాన్ని అనేక విధాలుగా మెచ్చుకున్నది.

అప్పుడా కుందేలు దానితో "మహాప్రభూ! నాపైన ప్రేమకొద్దీ తమరు అలా అంటున్నారు గానీ, నిజానికి నాలో తమరిని మెప్పించగలిగేంత తెలివి ఎక్కడ ఉన్నది? అనామకులం- మాకు, తమరి ప్రశంశకు ఎంతో దూరం! మాకు ఏ కొంచెం శక్తి కలిగినా, అది నిజంగా‌ తమరి చలవే. తమరు ఆజ్ఞాపించాక, ఇక దానికి భిన్నంగా‌ఎలా జరుగుతుంది? వెళ్ళిన పనిని నెరవేర్చుకొచ్చాను- అదంతా తమరి దయ!" అన్నది.

శిలీముఖుడు, ఇతర కుందేళ్ళు అది చెప్పిన సంగతులన్నీ సంతోషంగా విని, తనివితీరా నవ్వుకున్నాయి. విజయుడిని చాలా మెచ్చుకున్నాయి. శిలీముఖుడు దాన్ని తగిన విధంగా సత్కరించాడు. అటుపైన అవన్నీ చాలా సుఖంగా కాలం గడిపాయి" అన్నాయి పక్షులు.

అలా తన కధనాన్ని కొనసాగిస్తూ, కొంగ ఇలా అన్నది-

"ఆ మాటలు వింటున్నకొద్దీ నాకు లోలోపల హృదయం దహించుకు పోయింది. అయినా నేను ఆ అలజడిని బయటికి కనబడనివ్వక, ఆ పక్షులను నిరసిస్తూ అన్నాను- "సత్పురుషులందరికీ‌ మిత్రుడైన ఆ హంస- వరేణ్యుడు వీరాధివీరుడు; తన పరాక్రమం అనే చిరు దివ్వె తోటి 'శత్రు వీరులందరి గర్వం' అనే చీకటిని అవలీలగా పారద్రోలే శక్తివంతుడు. బలవంతులను ఎవ్వరినైనా ఆయన తర్వాతనే లెక్కించాలి. పిరికితనం అన్నది ఆయన ఉండే ఊళ్ళోనే ఉండదు. ఆయన కొంచెం ఇలా కాలు కదిపాడంటే చాలు- అన్ని లోకాలూ గడగడలాడతాయి. మీకు సమయం‌ గడవక, ఊరికెనే ఇంకా పుట్టని పిల్లలకు పేర్లు పెడుతూ గడుపుతుంటారేమోగాని, ఆయన గురించి అసలు మీకు ఏం‌ తెలుసు?

మీలాంటి పండితులే ఇట్లా కాని మాటలు మాట్లాడుతున్నారే, ఇక తెలియని అజ్ఞానుల గురించి ఏం చెప్పేట్లు ఉన్నది?! ఆయన పరాక్రమం ఎంతటిదంటే, ఆయన ఒక్క కర్పూర ద్వీపానికే ఏం‌ ఖర్మ, మూడు లోకాలకూ అధిపతి కాదగినవాడు. ఆయనను గురించి ఇంకా ఏమైనా కాని మాటలు అన్నారంటే అపచారమే. మీ తిట్లు మాని ఊరుకోండి" అని.

అది వినగానే ఆ పక్షులన్నీ‌ మండిపడ్డాయి. 'నన్ను చంపెయ్యాల్సిందే' అని నిశ్చయించుకున్నాయి. అయితే ఆ పనేదో 'తమ రాజు అనుమతి పొందాక చేయవచ్చు' అనుకొని, నామీదపడి, నా పెడ రెక్కలు విరిచికట్టి, విపరీతంగా కొట్టాయి. దాంతో నా ప్రాణాలు కడబట్టి, కోరలు పీకిన త్రాచుపాము మాదిరి రొప్పాను.

ఆపైన అవన్నీ నన్ను తిడుతూ, తన్నుతూ, ఎగతాళిచేస్తూ బలవంతంగా వాళ్ళ సభా స్థలానికి లాక్కుపోయాయి. ఆ సభ అంతా దుర్జనులతో నిండి, మహా దారుణంగా ఉంది. అక్కడ అవి నన్ను తమ రాజు ముందు నిలబెట్టి సభలోని వాళ్లంతా వింటుండగా "స్వామీ! మేమందరం తమరి అనుచరులం. తమరు చెప్పిన పనిని చేసేవాళ్లం. 'తెలిసిన సంగతులు చెప్పకుండా కప్పిపెట్టి, తమంతట తామే ఏదో ఒకటి చేయటం సేవకులకు తగదు'- అందుకని ఈ దుర్మార్గుడి కథంతా తమరికి నివేదించి, తమరు చెప్పినట్లుగా నడుద్దామని వచ్చాము. ఈ మొరటు కొంగకు పోగాలం దాపురించింది. 'ఏది మంచిది-ఏది తగనిది' అన్న జ్ఞానం పూర్తిగా నశించింది. అందుకనే ధర్మ స్వరూపులైన తమరిపైన అపనిందలు వేసేందుకు సాహసించాడు. "ఇతరులకు చెడు చేద్దామనుకున్నవాడు తన చెడులో తానే కాలిపోతాడు; చచ్చినవాడిని చంపటం ఎందుకు?" అనకండి.

ఒక్కోసారి దేవుడు కూడా మోసకారుల పక్షమే వహిస్తాడు. తెలివి లేని ఈ కొంగ మన సీమలోనే తిరుగుతూ, ఏ మాత్రం భయమన్నదే లేకుండా ఏకంగా తమరి పాదాలనే తప్పుపడుతూ, అనరాని మాటలన్నీ‌అన్నది. అందువల్లనే ఈ నీచపు కొంగ వధింపతగినది అయిపోయింది. గిల్లికజ్జాలు పెట్టుకునే ఈ కొంగను చంపెయ్యాలని మేం గట్టి నిశ్చయంతో ఉన్నాం. 'ముక్కుతో పొడవలేని ముంగోపం వల్ల ఏం లాభం?' వీడి పట్ల అణుమాత్రం కూడా దయ చూపవద్దు. తమరి ఆజ్ఞ అయ్యిందంటే తక్షణం వీడిని చంపేస్తాం" అని అన్నీ మూకుమ్మడిగా పలికాయి.

అది విని నా నమస్సు భయానికి పూర్తిగా అధీనం అయిపోయింది. నా శరీరం నిస్సత్తువతోటీ, భయంతోటీ గజ గజా వణకటం మొదలు పెట్టింది. అప్పుడా పక్షుల రాజు చిత్రవర్ణుడు నన్ను దయాపూర్ణమైన దృష్టితో చూస్తూ, నన్ను పొడిచి చంపేందుకు సిద్ధమౌతున్న తన అనుచరులను వారించి "ఇంతకీ వీడు ఎవ్వడు? ఏ దేశంనుండి వచ్చాడు? చెప్పండి" అన్నది.

అప్పుడా పక్షులు "వీడు హిరణ్య గర్భుడు అనే రాజు అనుచరుడట! కర్పూర ద్వీపం నుండి వచ్చాడట!" అన్నాయి. అది విని సభలోని వారంతా ఆలోచనలో మునిగారు. ఆ పరిసర ప్రదేశాలన్నీ తిరిగే గ్రద్ద ఒకటి ఆ రాజు వద్ద మంత్రిగా ఉన్నది- దాని పేరు దూరదర్శి- అది నన్ను చూసి "మీ ఆస్థానంలో ప్రధాన మంత్రి ఎవ్వరు?" అని అడిగింది. (-మిగతాకథ మళ్ళీ...)