తల షేవింగ్
సేకరణ: బి. చంద్ర, 9 వ తరగతి, ప్రకృతి బడి.

పవన్ ఒకసారి మంగళ షాప్ కు వెళతాడు. పవన్ చాలా పిసినారి. మంగళాయనతో కటింగ్ చేస్తే ఎంత తీసుకుంటావు అని అడుగుతాడు. అతను పది రూపాయలు అంటాడు.షేవింగ్ చేస్తే ఎంత? అని అడుగుతాడు.ఐదు రూపాయలు అని అంటాడు. అప్పుడు పవన్ నా తలకు షేవింగ్ చేయి అని చెప్పాడు.

శివ ధనుస్సు

సేకరణ: టి. ఆది నారాయణ, సి.ఆర్.సి. చెన్నేకొత్తపల్లి.
బడికి తనిఖీ చేసేందుకు అధికారిగారు వచ్చారు.
అధికారి: బాబూ, నువ్వు చెప్పు! "శివధనుస్సును ఎవరు విరిచారు" అని అడిగాడు.
శివ(ఏడుస్తూ): సార్, "నిజంగా ఎవరు విరిచారో నాకు తెలియదు సార్ అని చెప్పి ఏడ్వటం మొదలుపెట్టాడు".
అధికారి: ఓరి! సరే నువ్వు చెప్పు బాబూ "శివధనుస్సును ఎవరు విరిచారు".
గణేష్(భయంభయంగా): "సార్, నేను మాత్రం విరచలేదు సార్. ఆ రోజు నేను బడికే రాలేదు. మా నాన్న నన్ను పనిమీద తోటకు పంపించాడు ."
అధికారి(టీచరు వైపుకు తిరిగి): ఏంటి సార్ శివధనుస్సును ఎవరు విరిచారు అని అడుగుతుంటే ఒక్కరు కూడా సరైన సమాధానం చెప్పలేదు. కనీసం నువ్వైనా చెప్పు.
టీచరు: "నేను రెండు రోజుల నుండి బడికి సెలవు పెట్టాను, నాకు తెలియదు సార్!"
అధికారి కోపంగా ఇలా కాదు. నీ మీద చర్య తీసుకోవాలి. ప్రధానోపాధ్యాయుల్ని పిలవండి. (ప్రధానోపాధ్యాయులు వచ్చారు.)
అధికారి: ఏంటి సార్ ఇది శివధనుస్సును ఎవరు విరిచారు అని అడుగుతుంటే ఒక్కరు కూడా సరైన సమాధానం చెప్పలేదు.చివరికి క్లాసు టీచరు కూడా.
ప్రధానోపాధ్యాయులు: ఇంత కష్టం ప్రశ్న అడిగి సమాధానం చెప్పాలని ఇంత పట్టుపట్టడం ఏమీ బాగలేదు సార్. "ఎంత అవుతుందో చెప్పండి సార్! స్కూల్ ఫండ్ నుంచి తీసి ఇచ్చేస్తాం ."
అధికారి: ఆ..ఆ..ఆ.!

మెదడు పని

సేకరణ:డి..అనిష్ , 5వతరగతి, విజ్డం స్కూల్.
ఒక ఇంట్లో భార్య,భర్త ఉంటారు. భార్య పేరు మెదడు, భర్త పేరు ఏంటి. వీళ్లింటికి ఒక రోజున బంధువులు వస్తారు.
బంధువులు: నీ పేరు ఏంటి?
భర్త: నా పేరు ఏంటి.
బంధు వులు (ఇంకొకసారి): నీ పేరు ఏంటి?
భర్త(నిజాయితీగా ): నా పేరు ఏంటి .
బంధువులు(కోపంగా): నీకేమైంది? మెదడు పనిచేయడంలేదా?
భర్త: మెదడు లోపల వంట చేస్తున్నది. పిలవమంటారా?
బంధువులు: ఆ...?!

నాయకుల గోల

సేకరణ: టి.యస్.కిషోర్, ఆరవ తరగతి, విజ్డం స్కూల్.
ముగ్గురు నాయకులు కార్లో పోతూ ఇలా మాట్లాడుకుంటూ వెళుతున్నారు.
మొదటి నాయకుడు: నేను చిటికేస్తే , నా ముందర వెయ్యి మంది వచ్చి పడతారు.
రెండవ నాయకుడు: నేను చిటికేస్తే , నా ముందర రెండు వేల మంది వచ్చి పడతారు.
మూడవ నాయకుడు: ఓస్ మీకంతే కదా! నేను చిటికేస్తే నాముందర పదివేల మంది పడతారు.
కారు డ్రైవరు: ఒకవేళ నేను ఒక బ్రేకు వేస్తే , నా ముందు మీ ముగ్గురూ వచ్చి పడతారు.

కొత్త నాన్న

(ఒకసారి రైల్లో అమ్మ , నాన్న, కొడుకు ప్రయాణం చేస్తున్నారు.కొడుకు కిటికీ దగ్గర కూర్చుని పుస్తకం చదువుతుండగా పుస్తకం కింద పడిపోతుంది.)
కొడుకు:అమ్మా, అమ్మా పుస్తకం కింద పడిపోయింది .
అమ్మ: పోతే పోనీలేరా! దిగిన తర్వాత కొత్త పుస్తకం కొనుక్కుందాము.
(కొద్దిసేపటి తర్వాత)
అమ్మ(గాభరాగా): ఒరేయ్ బాబూ! మీ నాన్న కింద పడి పోయాడురా!
కొడుకు(తాపీగా): పరవాలేదులేమ్మా ! దిగినతర్వాత కొత్త నాన్నను కొనుక్కుందాం గానీ!

మనందరిది

సేకరణ: లోహిత్, రెండవ తరగతి, విజ్డం స్కూల్.
(బోర్డు మీద సార్ రాస్తూ వుంటాడు. అపుడు చాక్ పీస్ పడిపోతుంది.)
పిల్లవాడు: సార్! మీ చాక్ పీస్ పడిపోయింది.
సార్: నాది కాదురా మనందరిది.
(కొంతసేపటికి డస్టర్ పడి పోతుంది.)
పిల్లవాడు: సార్! మీ డస్ట ర్ పడిపోయింది.
సార్: నాది కాదురా మనందరిది.
(కొంత సేపటికి సార్ భార్య భోజనం పట్టుకొని వస్తుంది. )
పిల్లవాడు: సార్! మన భార్య భోజనం తెచ్చింది.
సార్: ఆ...ఆ...