కళింగ రాజ్యాన్ని విజయేంద్రవర్మ అనే రాజు పరిపాలించేవాడు . ఆ రాజుకు చాలా బలంగల తెల్ల ఏనుగు ఒకటి ఉండేది. మొదట్లో అది ప్రజలతో మర్యాదగా మెలిగేది. అయితే రానురాను దానికి మదం హెచ్చింది. ప్రమాదకరంగా తయారయింది. సంగతిని గ్రహించిన విజయేంద్ర వర్మ రాజ్యానికి ఉత్తరాన ఉన్న ఒక తోటలో ఒక ఇంటిని నిర్మించి, తెల్ల ఏనుగును ఆ యింట్లో కడ్డీలతో బంధించి పెట్టాడు. దాని అవసరాలు చూడటం కోసం ఇద్దరు భటులను నియమించాడు. తనను బంధించినందుకు ఇప్పుడు తెల్లఏనుగుకు మరింత కోపం వచ్చింది.

రాజుగారి కుమార్తె హరిప్రియ చాలా అందమైనది. రాజుకి ఆమె అంటే ప్రాణం. తెల్లఏనుగును గురించి తెలిసిన రాజు, తన కుమార్తెతో "తల్లీ, ఉత్తరం వైపున ఉన్న తోటలోకి మాత్రం వెళ్ళకు" అని చెప్పాడు. అయితే, ఆయన అలా చెప్పిన మరుసటి రోజు ఉదయమే హరిప్రియకు ఉత్తరం వైపున ఏముందో చూడాలని కుతూహలం కలిగింది. వెంటనే ఆమె తన ఇద్దరు చెలికత్తెలనూ వెంటబెట్టుకొని, ఉత్తరం వైపుకు బయలుదేరింది.

సగం దూరం వెళ్ళాక, చెలికత్తెలు "మనం ఎక్కడికి వెళ్తున్నాం, యువరాణీ?" అని అడిగారు. "ఉత్తరం వైపున ఉన్న తోటలోకి" అన్నది హరిప్రియ.

"మహారాజుగారు వెళ్ళొద్దని చెప్పారుగా యువరాణిగారు, మాకు భయంగా ఉంది" అని ఒక చెలికత్తె భయంతో పరుగు తీసింది. అయినా హరిప్రియ ఆగకుండా రెండవ చెలికత్తెతో కలిసి తోటలోకి ప్రవేశించింది. తోట అందంగా, మెరిసిపోతున్నది. చూస్తూ నడుస్తున్న హరిప్రియ మురిసిపోతున్నది. అలా పోయి పోయి , తెల్లఏనుగును బంధించిన ఇంటి దగ్గరికి చేరుకున్నది హరిప్రియ.

అంతలో‌ లోపల ఉన్న భటుడు బయటకు వచ్చి "లోపలికి రాకూడదు" అని ఆమెను అక్కడినుండి పంపించే ప్రయత్నం చేశాడు. కానీ యువరాణి వినకుండా "నేను లోపలికి వె ళ్లి తీరాలి" అని మొండిగా వాదించ సాగింది. లోపల ఉన్న తెల్ల ఏనుగు యువరాణి మాటలను విని సంగతిని గ్రహించింది. అమిత బలశాలి అయిన ఆ ఏనుగుకు తనను బంధించిన కడ్డీలు ఒక లెక్కలోనివి కావు. అది క్షణంలో కడ్డీలను త్రెంచుకొని, అడ్డు వచ్చిన భటుడిని త్రొక్కేసి, తలుపులు పగులగొట్టుకొని, బయటకు వచ్చి యువరాణి హరిప్రియను ఒక్క ఉదుటున ఎత్తుకుని అడవిలోకి పారిపోయింది.

ఈ వార్త తెలిసిన మహారాజు హతాశుడై, కుప్పకూలిపోయాడు. ఇప్పుడు ఇక రాజ్యభారం వహించవలసినది మంత్రులే. విజయేంద్రవర్మ తరువాత రాజ పీఠాన్ని అధిష్ఠించవలసిన హరిప్రియను తెల్లఏనుగు ఎత్తుకుపోయిందనే వార్తతో రాజ్యం అంతా అల్లకల్లోలమైంది. విజయేంద్రవర్మను పరీక్షించిన రాజవైద్యులు పెదవి విరిచారు- హరిప్రియ వస్తే తప్ప ఆయన ఆరోగ్యం బాగుపడదన్నారు. సాహస వీరులు అనేకమంది తెల్ల ఏనుగును వెతుక్కుంటూ‌ తిరిగారు, గానీ అది ఎవ్వరికంటా పడలేదు. వీరయోధులందరూ ఉత్తి చేతులతో‌వెనక్కి వచ్చారు.

ఆ రాజ్యంలోనే ఒక ఊరి తోటలో పని చేసే సతీష్ చాలా తెలివైనవాడు, ధైర్యవంతుడు కూడాను. రాజుగారికి , యువరాణికి వచ్చిన ఆపదను తెలుసుకున్నప్పటి నుండి వాడు 'వాళ్ళకు ఎలా సహాయపడాలి?' అని అనుకుంటూనే ఉన్నాడు- "వీరయోధు-లందరూ ప్రయత్నించారు- కానీ తెల్ల ఏనుగు ఎవ్వరికీ కానరాలేదు " అని తెలిసిన తరువాత వాడు "నేనూ వెతుకుతాను తెల్ల ఏనుగును" అని బయలు దేరాడు.

అలా బయలుదేరిన సతీష్ సముద్ర తీరాన ఉన్న ఒక అడవిని చేరుకున్నాడు. మిట్ట మధ్యాహ్నం వేళ ఆ అడవి మధ్యలో ఒక చెట్టు కింద ఋషి ఒకాయన తపస్సు చేస్తూ కనిపించాడు. ఆయనను అడిగితే తన పని నెరవేరుతుందని అనిపించింది సతీష్ కి. మెల్లగా ఆయన ముందు నిలబడి, నమస్కరించి, తన మనసులో మాట చెప్పి, సహాయం చేయమని కోరాడు. అయితే ధ్యానంలో ఉన్న ఋషి ఉలకలేదు; పలకలేదు.

అయినా సహనం కోల్పోని సతీష్ అక్కడే ఉండి, ఋషి స్వయంగా కళ్ళు తెరిచేంత వరకూ అక్కడే నిలబడి ఉండాలని నిర్ణయించుకున్నాడు.

ఋషి ఏకబిగిన మూడు రోజులపాటు కళ్ళు తెరువలేదు. సతీష్ స్థిర నిశ్చయంతో మూడు రోజులపాటు అలాగే నిలబడి ఉండిపోయాడు. అప్పుడు కళ్ళు తెరిచిన ఋషి సతీష్ పట్టుదలను చూసి సంతోషించి, "చూడు నాయనా! నేను నీకు రెండు రాళ్ళను ఇస్తాను. ఒకటి తెల్లరాయి, మరొకటి నల్లరాయి- వాటిని తీసుకొని వెళ్ళు, తెల్లరాయిని విసిరితే నీకు యువరాణి ఉన్న చోటు వరకు దారి వస్తుంది.

దారిమధ్యలో కౄర మృగాలు తిరుగు తుంటాయి. నువ్వు వాటిని ఏమీ అనవద్దు. నల్లరాయి వల్ల నీకు అమితమైన బలం వస్తుంది. అయితే నల్లరాయి నీకు ఒక్కసారికి మాత్రమే పనిచేస్తుంది- జాగ్రత్తగా వాడుకొని విజయం‌ సాధించు" అని, ఋషి రెండు రాళ్ళను సతీష్ కి ఇచ్చి ఆశీర్వ దించి పంపాడు.

సంతోషించిన సతీష్ వాటిని తీసుకొని సముద్ర తీరానికి వెళ్లి, తెల్లరాయిని విసరగానే తెల్ల ఏనుగు యువరాణిని దాచి ఉంచిన తోట వరకూ దారి ఏర్పడింది. దారి మధ్యలో కౄర మృ గాలు తిరుగుతున్నాయి. సతీష్ వాటిని పట్టించు కోకుండా యువరాణి వద్దకు చేరుకున్నాడు.

ఆ సమయానికి తెల్ల ఏనుగుకు మరింత మదమెక్కి, యువరాణిని త్రొక్కి వేసేందుకు ముందుకు దూకుతున్నది. సతీష్ గబుక్కున ఆ ఏనుగు ముందుకు దూకి, దానికి నమస్కరించి- "తెల్ల ఏనుగూ, నిన్ను జాగ్రత్తగా సంరక్షించిన విజయేంద్రవర్మ నువ్వు చేసిన పని కారణంగా అనారోగ్యం‌ పాలై ఉన్నాడు. రాజ్యం అల్లకల్లోలంగా ఉన్నది. దయచేసి యువరాణిని ఏమీ చేయకు. ఆమెను నాకు అప్పగించు" అన్నాడు.

తెల్లఏనుగు కోపంగా సతీష్ ను తొండం-తో ఎత్తి దూరంగా విసిరేసింది. అప్పుడు ఇక సతీష్ ఋషిని తలచుకొని నల్లరాయిని విసిరాడు . దాంతో సతీష్ కు ఏనుగుతో యుద్ధం చేయటానికి అవసరమై-నంత బలం చేకూరింది. అలా వచ్చిన బలంతో సతీష్ ఏనుగుతో పోరాడి, దాన్ని లొంగదీసుకున్నాడు. ఆ తరువాత, అతను "ఓ తెల్లఏనుగూ! కేవలం ఋషి సాయం వల్ల నిన్ను లొంగదీసుకొనగలిగాను తప్ప, నిజానికి నేను నీకంటే బలమైన వాడిని కాను.

కోపం కొద్దీ నువ్వు చేసిన పని ఏమంత మంచిది కాదు- విజయేంద్రవర్మ లాంటి మంచిరాజును కోల్పోయి దేశం అల్లాడుతున్నది. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకొని, యువరాణిని వదిలిపెట్టు. కావాలంటే నువ్వు ఇప్పుడు నన్ను పిప్పి పిప్పి చేసెయ్యచ్చు- ఋషి నాకిచ్చిన బలం అయిపోయింది. అయినా నువ్వు స్వతహాగా మంచిదానివని నా నమ్మకం. అందుకని నేను నీకు మనస్ఫూర్తిగా స్వేచ్ఛను ప్రసాదిస్తూ, యువరాణిని వదిలిపెట్టమని అభ్యర్ధిస్తున్నాను." అన్నాడు.

తెల్లఏనుగు కొద్దిసేపు కదలకుండా నిలబడింది. ఆపైన అది సతీష్ ను తొండమెత్తి ఆశీర్వదించి, వెనక్కి తిరిగి అడవిలోకి వెళ్ళి పోయింది.

యువరాణి హరిప్రియను ప్రాణాలతో‌ చూడగానే విజయేంద్రవర్మ మహారాజు ఆరోగ్యం‌ కుదుట పడింది. రాజ్యం మళ్ళీ సుఖ శాంతులతో కళకళలాడింది.