పూర్వం ఒక నగరంలో ఒక రాజు ఉండేవాడు. రాజుకు ముగ్గురు కొడుకులు ఉండేవాళ్ళు. ఆ రాజు తన రాజ్యాన్ని, ప్రజల్ని చాలా బాగా పాలిస్తుండేవాడు.

ప్రజల సమస్యల్ని తెలుసుకునేందుకు, వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు-గాను రాజు తన కుమారులు ముగ్గురికీ ఊరి చివర మూడూ గుడిసెలు వేయించాడు- వాళ్ళు రాత్రిపూట అక్కడే ఉండి, ప్రజలకు సాయం చేయాలి.

ఒకనాటి రాత్రి పెద్ద కుమారుడు రాజ్యం అంతటా తిరిగి చూశాడు- అంతా ప్రశాంతంగా ఉన్నది. మొదటి జాము ముగిసిన తర్వాత అతను వచ్చి పడుకున్నాడు. కొద్ది సేపటికి రెండవ వాడు లేచి, రాజ్యంలో తిరిగి చూశాడు. అందరూ నిద్రలో ఉన్నారు. రెండవ జాము ముగిసిన తరువాత అతను వచ్చి పడుకున్నాడు; మూడవవాడు రాజ్యంలో తిరిగి చూశాడు.

ఆ సమయంలో రాజ్యం నుండి ఒక అందమైన స్త్రీ బయటకు వెళ్ళడం చూశాడు అతను. వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళి "ఎవరు నువ్వు? ఈ సమయంలో ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావు?" అని అడిగాడు. ఆమె వెంటనే "నేను ఈ రాజ్యాన్ని కాపాడే దేవతను. ఇప్పుడు ఇక బయటకు వెళ్ళి పోతున్నాను. ఏమంటే, ఇంకొంచెం సేపట్లో ఈ రాజ్యాన్నేలే మహా రాజు చనిపోబోతున్నాడు" అన్నది.

ఆ మాట వినగానే ఆ మూడవ కుమారుడు రాజ భవనంలోకి పరుగుతీసి, రాజుగారి అంత:పురంలోనికి ప్రవేశించాడు. అక్కడ, రాజుగారి మంచాన్ని చుట్టుకొని ఉన్నది- ఒక పెద్ద పాము! అది రాజుగారిని మింగేయడానికి చూస్తున్నది! రాజకుమారుడు వెంటనే కత్తి తీసి దానితో పోరాడి, దాన్ని చంపేశాడు. ఆ పామును నూరు ముక్కలుగా చేసి, ఒక బంగారు పళ్ళెంలో ఉంచాడు. అలా అతను పామును చంపేసేటప్పుడు, ఒక రక్తపు చుక్క అక్కడే పడుకొని ఉన్న అతని పినతల్లి చేతిమీద పడింది. అతను వంగి దాన్ని తుడుస్తుండగా పినతల్లి మేల్కొని, గట్టిగా అరిచి రాజును, కాపలాదారులను నిద్ర లేపింది.

"నువ్వు ఇంత అర్ధరాత్రి వేళ నా గదిలోకి ఎందుకు వచ్చావు? నీ పినతల్లిని, నన్ను చంపడానికి వచ్చావు కదూ?" అని, రాజుగారు భటులను పిలిచి యువరాజును బంధించమన్నారు. ఆ క్షణమే అతనికి ఆయన శిరచ్ఛేద శిక్ష విధించి, వెంటనే అమలు జరపమన్నారు.

భటులు రాజాజ్ఞను అమలు జరపక తప్పదు. వాళ్ళు యువరాజును తీసుకొనిపోయి శిరచ్ఛేదానికి అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసారు. చివరగా వాళ్ళు యువరాజును "నీ చివరికోరిక ఏమిటో‌ తెలిపితే, తీరుస్తాం" అన్నారు. "మా నాన్నగారు, పినతల్లి గారు నేను చెప్పబోయే మూడు కథలూ వినాలి- అదే నా చివరి కోరిక" అన్నాడు రాజకుమారుడు.

రాజుగారికి అది ఏమాత్రం ఇష్టం లేదు- తనను హత్య చేయబోయిన కొడుకు ముఖం చూడటానికి కూడా ఆయనకు ఇష్టం కాలేదు- కానీ ఏంచేయాలి? ఎవరిదైనా సరే, చివరికోరికను తీర్చవలసిందే- అందుకని రాజుగారు తన భార్యలతో‌ సహా బయలుదేరి వచ్చారు. అప్పుడు రాజకుమారుడు మూడు కథలు చెప్పాడు:

"ఒకటో కథ:

అనగనగా ఒక రాజ్యం ఉండేది. ఆ రాజు వేటకోసం‌ అడవికి వెళ్ళాడు. రాజ్యం నుండి చాలా దూరంగా- గుర్రం మీద పోతూ, దారి మధ్యలో ఒక చెట్టు కింద కూర్చున్నాడు. బాగా దప్పిక వేసింది. తను తెచ్చుకున్న కుండలోని నీటిని తాగుదామని బయటకు తీసాడు. దాన్ని తీసీ తీయగానే అతని గుర్రం సకిలించింది- కట్టు త్రాళ్ళను తెంచుకొని పరుగెత్తి వచ్చింది. ఆ కుండను తన్నింది. కుండ క్రిందపడి పగిలిపోయింది. నీళ్లలో చాలా భాగం నేలపాలయ్యాయి. దప్పిక గొని ఉన్న రాజుకు చాలా కోపం వచ్చింది.

తక్షణం కత్తి తీసి గుర్రాన్ని చంపేశాడు. అంతలో అక్కడ తిరుగాడుతున్న కుక్క ఒకటి వచ్చిందక్కడికి. పగిలిన కుండలో మిగిలిన కొన్ని నీళ్లనూ అది తాగేసింది. త్రాగీ త్రాగగానే ఆ కుక్క నురగలు కక్కుకుంటూ చనిపోయింది!

అప్పుడు అర్థం అయ్యింది రాజుకు: తన శత్రువులెవరో తను తీసుకొచ్చిన కూజాలో విషం కలిపారు. ఆ సంగతి తెలుసుకున్న గుర్రం తనను కాపాడబోయింది! అని. అయినా అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది. విశ్వాస పాత్రమైన గుర్రం చనిపోయింది. ఏ పనినీ అనాలోచితంగా చేయకూడదు.

రెండో కథ:

అనగనగా రాజవర్మ అనే రాజు దగ్గర ఒక చిలక ఉండేది. రాజుకు ఆ చిలక అంటే చాలా‌ ఇష్టం. ఒకసారి చిలక తన తల్లిదండ్రులను చూసేందుకని, రాజుగారిని పది రోజులు శలవడిగి, ఇంటికి వెళ్ళింది. పది రోజులూ గడిచిన తర్వాత, తిరిగి వచ్చేటప్పుడు అది ఎంతో కష్టపడి, అడవుల నుంచి ఒక దివ్యమైన ఫలాన్ని తీసుకు వచ్చింది. ఆ పండుకు కొన్ని గాట్లు, గీతలు పడి ఉన్నై, కొంచెం దెబ్బ తిన్నట్లుగా కూడా ఉంది, అది. రాజు మీద ప్రేమ గల చిలుక ఆ సంగతిని అస్సలు పట్టించు-కోలేదు. ఆ పండును తీసుకెళ్ళి, అది నేరుగా రాజుగారికి ఇచ్చింది. "ఈ చిలుక నా మీద ఎంతో ప్రేమతో ఈ పండును తెచ్చింది" అని సంబరపడి, రాజు ఆ పండును తినబోతున్నాడు-

అంతలో మంత్రి వచ్చి ఆపాడు ఆయనను- "రాజా! "ఈ పండును ఏదో జంతువు కొరికినట్లున్నది చూడండి- ఈ ప్రక్కన గాట్లు పడి ఉన్నాయి. ఎక్కడో, ఏ జంతువో కొరికి క్రింద పడేసిన పండును తీసుకువచ్చి, మీకు ఎంతో ప్రేమతో అపురూపంగా ఇచ్చినట్లు ఇస్తున్నది ఈ చిలుక. ఇది విషపూరితమని నాకు అనిపిస్తున్నది" అని.

ఈమాట వినగానే రాజు కు విపరీతమైన కోపం వచ్చింది. ఖడ్గమెత్తి, తనను హత్య చేయబూనిన ఆ చిలుకను ఒక్క వ్రేటున చంపేశాడు. అది తెచ్చిన ఆ పండును కోట అవతలికి విసిరేశాడు. బయట పోతున్న ఒక కుష్టు రోగికి దొరికింది, ఆ దివ్య ఫలం. అతను ఆ పండును తిన్న వెంటనే అతని రోగం మాయమవ్వటమే కాక, అతను అత్యంత సౌందర్య వంతుడయ్యాడు. మరునాడు అతను వచ్చి, ధన్యవాదాలు చెప్పుకున్నప్పుడు-గానీ రాజుకు తను చేసిన తప్పిదం తెలిసి రాలేదు. అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది- చిలుక చనిపోయింది. కోపం కొద్దీ ప్రవర్తించేముందు, అవతలివాళ్ళు చెప్పేది పూర్తిగా వినాలి.

మూడో కథ:

ఒక రోజున ఒక రైతుకు అడవిలో ఒక చిన్నారి ముంగిస దొరికింది. అతనికి దాన్ని చూస్తే జాలి వేసింది. దాన్ని పెంచుకొని, ఉన్నన్ని రోజులు సాకుదామనుకున్నాడు. ఆ ముంగిస పిల్లను ఇంటికి తీసుకొని వచ్చాడు.

ఇంట్లో రైతుకొక చంటిబిడ్డ ఉన్నాడు. ఆ చంటిబిడ్డ ముంగిస పిల్లను చూసి చాలా సంతోషించాడు. ముచ్చట పడ్డాడు. కాని వాళ్ళ అమ్మ మాత్రం సంతోషించలేదు. ఆ ముంగిస తన బిడ్డను ఎక్కడ కరుస్తుందోనని ఆమె భయపడింది. రోజులు గడిచి పోయాయి- ముంగిస పెరిగి పెద్దదయింది. పిల్లవాడితో ఆడుకోవడం దానికి చాలా సరదాగా ఉండేది. పిల్లవాడికీ దానితో ఆడుకోవటం చాలా ఇష్టంగా ఉండేది.

ఒకనాడు రైతు భార్య అంగడికి వెళ్ళవలసి వచ్చింది. ఆమె పిల్లవాడిని ఊయలలో పడుకోబెట్టి, జాగ్రత్తగా చూస్తుండమని భర్తతో చెప్పి, వెళ్లింది. ఊయల ప్రక్కనే కూర్చొని ఊపసాగాడు రైతు. త్వరలోనే పిల్లవాడు నిద్రలోకి జారుకున్నాడు. ఊయల దగ్గరే నేల మీద కూర్చొని ఉంది, ముంగిస. పిల్లవాడు నిద్రపోయాడని గమనించిన రైతు తోటకు వెళ్ళిపోయాడు.

కొంతసేపటికి రైతు భార్య ఇంటికి తిరిగి వచ్చింది- గంప నిండా కూరగాయలు మోసుకొని. ఇంటి వాకిట్లోనే ముంగిస ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నది: దాని ముఖం నిండా రక్తపు మరకలు ఉన్నాయి!

రైతు భార్యకు గుండె పగిలినట్లైంది. ఆమె ఏనాడూ ఈ ముంగిసను నమ్మలేదు. అది తన పిల్లవాడిని చంపి తిన్నదనిపించింది ఆమెకు. తిన్నదే కాక, తనకు ఆ సంగతిని చెప్పటం కోసం‌ ఇంటి వాకిట నిల్చున్న ముంగిసను ఆమె క్షమించలేకపోయింది. చేతనున్న బరువైన గంపను ఎత్తి, బలంగా ముంగిస పైకి విసిరింది. ఆ దెబ్బకు నలిగి చచ్చిపోయింది ముంగిస. ఆ వెంటనే ఆమె ఇంటి లోనికి పరిగెత్తింది. లోపల పిల్లవాడు కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నాడు. తనను ఎత్తుకొమ్మని తల్లివైపు చేతులు చాస్తున్నాడు. ఉయ్యాలకు దగ్గర్లో పాము ఒకటి చచ్చి పడి ఉన్నది. పిల్లవాడిని రక్షించటం కోసం ముంగిస చంపింది, ఆ పామును! విషయం తెలుసుకున్న రైతుభార్యకు ముంగిస పట్ల కృతజ్ఞతతో కళ్ళు చెమర్చాయి. కానీ అప్పటికే జరగ వలసిన నష్టం జరిగిపోయింది- ప్రేమించిన ముంగిస చనిపోయింది. శిక్ష విధించే ముందు, ఏం జరిగిందో తప్పక తెలుసుకోవాలి."

మూడు కథలూ విన్న రాజుకు తన తొందరపాటు అర్థమైంది. అసలు జరిగిన సంగతి ఏంటో చెప్పమని అడిగాడు కొడుకును. జరిగిన విషయాన్ని, ఆధారాలతో సహా తెలుసుకున్నాక, ఆయనకు నిజంగా కనువిప్పైంది. తన తప్పిదానికి ఎంతో సిగ్గు పడ్డాడు రాజు.

ఆ నాటినుండి ఆ రాజ్యంలో 'మరణ శిక్ష' అన్నదే పూర్తిగా రద్దైంది. 'ఎవరికైనా, తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు పూర్తి అవకాశం ఉండాలి' అని కొత్త శాసనం తయారైంది.