అనగనగా నరేందర్, కిషోర్ అనే డాక్టర్లు ఇద్దరు ఉండేవాళ్ళు. ఇద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి ఒకే ఊళ్లో ఆసుపత్రి పెడితే చేతినిండా పని ఉండదు కదా, అందుకని ఇద్దరూ ప్రక్క ప్రక్క ఊళ్ళలో ఆసుపత్రులు పెట్టుకున్నారు.

కొంతకాలం గడిచేసరికి, నరేందర్‌కు వాళ్ళ ఊరిలో‌ మంచి డాక్టర్ గా పేరు వచ్చింది. రోజూ చాలా మంది రోగులతో తీరికలేకుండా ఉండేవాడు అతను.

అయితే ప్రక్క ఊళ్ళో కిషోర్ మాత్రం ఎప్పుడు చూసినా ఖాళీగా ఉండేవాడు. ఆ ఊరి ప్రజలు కూడా తమ జబ్బుల్ని నయం చెయ్యమని నరేందర్ దగ్గరికే వచ్చేవాళ్ళు. ఊళ్ళో జనాలు తనదగ్గరికి రాకుండా అంత దూరం నడిచి ప్రక్క గ్రామానికి ఎందుకు వెళ్తున్నారో ఎంత ఆలోచించినా అర్ధంకాలేదు కిషోర్ కి .

ఒక రోజున నరేందర్ కిషోర్ దగ్గరికి వచ్చాడు . అతని ఆస్పత్రి ఖాళీగా ఉన్నది. అక్కడ కూర్చొని స్నేహితులిద్దరూ ఆ సంగతీ, ఈ సంగతీ చాలా సేపు మాట్లాడుకున్నారు. అప్పుడు కిషోర్ -‌"చూడు, ఇక్కడ ఆసుపత్రి పెడితే, ప్రజలు ఉపయోగించుకోవటం లేదు. ఊళ్ళోనే ఉన్న నేను వాళ్ళకి పనికిరాలేదు. ఈ ఊరు వదిలేసి హాయిగా పట్నం వెళ్ళి ఆసుపత్రి పెట్టుకుంటే నయమనిపిస్తున్నది. నీ ప్రాక్టీసు బాగానే ఉన్నట్లుంది? ఏంటి నీ రహస్యం?" అని అడిగాడు.

"పల్లెలో‌ నా ప్రాక్టీసు బాగానే ఉంటున్నదే, మరి కిషోర్ దగ్గరికి ఎందుకు రావట్లేదు, రోగులు?" అని ఆశ్చర్యపోయాడు నరేందర్ . ఇంతలో ఎవరో ఒకతను ఎనిమిది సంవత్సరాల వయసున్న తన కొడుకుని తీసుకొని ఆందోళన పడుతూ ఆసుపత్రికి వచ్చాడు. "నా కొడుకు నిన్న మామిడి-కాయల కోసమని మంచి ఎండలో బయటకు వెళ్లాడు. రోజంతా బయట తిరగటం వలన కాబోలు, ఒళ్లు కాలిపోతోంది! రాత్రంతా నిద్రలేదు! బిడ్డపరిస్ధితి ఆందోళనకరంగా ఉంది. మీరే కాపాడాలి" అంటూ ప్రాధేయపడ్డాడు.

కిషోర్ ఆ అబ్బాయిని పరీక్షిస్తూ "వేసవికాలంలో మధ్యాహ్నపుటెండలో పిల్లల్ని బయటకు పంపకూడదని తెలియదా, నీకు? ఆ మాత్రం సంగతి నీకు ఎవరూ చెప్పలేదా? ఇట్లా ఎండలో తిరిగితే జ్వరం రాక మరేం వస్తుంది?" అంటూ తిట్ల దండకం మొదలుపెట్టాడు. ముందు కొంచెం సేపు ఊరుకున్నాడు ఆ అబ్బాయి తండ్రి. అయినా కిషోర్ తిట్లు కొనసాగుతూనే పోయాయి. దాంతో చిర్రెత్తిందో ఏమో, అతను వెంటనే బాబుని తీసుకొని వేరే ఆసుపత్రికి వెళ్లిపోయాడు.

ఇది చూశాక నరేందర్‌కి అర్థమైంది- కిషోర్ వద్దకు రోగులు ఎందుకు రావడం లేదో.

అతని దగ్గర కూర్చొని 'డాక్టరన్నవాడు తన దగ్గరికి వచ్చిన రోగికి వైద్యం చేయాలి - హితబోధలు కాదు. డాక్టర్ నుంచి రోగులు మంచి మందుల్ని, ఉపశమనం కలిగించే వాక్యాల్ని ఆశిస్తారు. అలాంటప్పుడు ఎత్తిపొడుపు మాటలు రోగికి మేలు చెయ్యక పోగా, కటువుగా అనిపించి వెగటు కలిగిస్తాయి. నువ్వు రోగులకు చక్కని మందులు రాసివ్వు. వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపకు; వీలైతే వాళ్లకు ధైర్యం కలిగేలా మాట్లాడు- లేకపోతే అసలు ఏమీ మాట్లాడకు. నా మాట మన్నించి నీ పద్ధతిని కొంచెం మార్చుకొని చూడు, నీ ప్రాక్టీసు తప్పక మెరుగవుతుంది. నా ప్రాక్టీసులో రహస్యం ఇదేననుకుంటాను" అన్నాడు నరేందర్.

మిత్రుడి మాటల విలువను గ్రహించిన కిషోర్ ఆనాటి నుంచి రోగుల్ని చక్కగా పలకరించడం ప్రారంభించాడు. కొంత కాలానికి అతనికీ మంచి వైద్యుడిగా పేరు వచ్చింది!