'నేను తప్పిపోయానా...? నా వాళ్ళు ఎక్కడ..? నేను ఎక్కడున్నాను, ఇప్పుడు..? ఇప్పుడు నేను ఏం చేయాలి..?' విహారయాత్రలో భాగంగా ఈ అడవికి వచ్చాను నేను..దారి తప్పినట్లున్నాను! చూడగా ఇక్కడి అడవంతా ఎత్తైన చెట్లతో, గుబురు పొదలతో నిండి ఉన్నది- దారీ తెన్నూ‌ కనబడటం లేదు.

చుట్టూ కలయచూసాను.. ఎవ్వరూ లేరు! నాలో ఒక విధమైన వణుకు మొదలవుతున్నది- ఈ ప్రదేశం అంతా నాకు కొత్త- 'మరిప్పుడు నేను ఏం చేయాలి? నా వాళ్ళని నేను ఎలాగ, చేరుకునేది?'

సూర్యుడు నడినెత్తికి వచ్చినట్లున్నాడు. 'నేను ఊరికే భయపడుతున్నానా?..' నన్ను నేను మానసికంగా గట్టి పరచుకొనేందుకు సిద్ధపడ్డాను.. నా మెదడు స్తంభించిపోయి ఉన్నది- 'ఒక వేళ నేను ఈ అడవిలోనే ఇరుక్కుపోతే..? రాత్రైనా ఇక్కడే ఉండి పోవాల్సి వస్తే ..?'

నాకు భయం మొదలైపోయింది..ఆత్మ రక్షణకే అయినా సరే- నా దగ్గర ఏలాంటి అస్త్రాలు, శస్త్రాలు, ఆధునిక పరికరాలు- ఏవీ లేవు..

'అసలు నేనెందుకు, భయపడుతున్నాను?' అని ఒక్కసారిగా ఆలోచన మొదలైంది. 'నేను భయపడాల్సిన అవసరం ఏముంది, అసలు? నేను కొంచెం ప్రయత్నం చేస్తే చాలు- ఇక్కడ నుంచి బయట పడగలను' అని గట్టిగా అనిపించింది.

ప్రపంచంలో కెల్లా అత్యంత బలమైన వస్తువులు మూడు ఉన్నాయి నా దగ్గర - 'ఆత్మవిశ్వాసం', 'పట్టుదల', 'కృషి'-నేను మనస్ఫూర్తిగా నమ్మిన అస్త్రాలు, ఈ మూడూ. ఇవి నాకు ఈ ఆపత్సమయంలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయి..

వెంటనే నాకు ఒక సత్యం గుర్తుకువచ్చింది: "పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు-" మా టీచరుగారు ఎప్పుడూ చెబుతుండే ఈ వాక్యం ఎంత నిజం! ఈ ఆలోచన నాకిప్పుడు ఎంతో ధైర్యాన్నిస్తోంది.. "నేను ఇక్కడకు ఎలా వచ్చానో , ఏ దారిన వచ్చానో గుర్తించేందుకు ప్రయత్నం మొదలుపెట్టాను. నా మనసును అలుముకొని ఉన్న భయాల ప్రపంచాన్ని తాత్కాలికంగా మర్చిపోయాను.

నా ముందున్న మార్గం పైననే కేంద్రీకరించి ఉంది నా మనసంతా..ఇప్పుడు నాలో వణుకు తగ్గసాగింది..నేను వచ్చిన దారిని గుర్తుచేసుకుంటూ ముందుకు సాగాను. ఏ వైపు వెళ్తే ఎటు చేరతానో తెలీదు నాకు; కానీ 'నేను ఇక్కడినుండి బయట పడతాను' అని మాత్రం నాకు తెలుసు. నా ఈ ఆత్మవిశ్వాసమే నన్ను ముందుకు నడిపించింది.

ఒకసారి ఇలా నా మనసుకు నెమ్మది కుదిరాక, అప్పుడు చుట్టూ ఉన్న ప్రకృతి అందం నన్ను తట్టిలేపింది..మైమరపించింది. అపురూపంగా కనిపిస్తున్న ఆ దృశ్యాన్ని చూస్తున్నకొద్దీ నా మనసు సంతోషంతోటీ, ఉత్సాహంతోటీ నిండిపోయింది.

నేను అలా నడుస్తూనే వున్నాను..చాలా సేపటి వరకు నడుస్తూనే వున్నాను..కొంతసేపటికి నాకు ఏవో మోటారు కార్ల శబ్దాలు వినిపించడం మొదలైంది. నాకు అర్థమైపోయింది..ఇక నా ప్రయాస అంతం కానున్నది. నేను ఆ శబ్దం వస్తున్న వైపుగా అడుగులు వేశాను.

త్వరలోనే నేను ఒక రోడ్డు మీదకు వచ్చాను. రోడ్డును చూడగానే నాకు కొంత సాంత్వన కలిగింది. నాకు బాగా‌ గుర్తు, ఈ రోడ్డు మీది నుంచే మేము బయల్దేరింది..ఇక ఆ మార్గాన్ని అనుసరించి నడవటం ప్రారంభించాను నేను.

కొంచెం సేపు అట్లా‌ నడిచాక దూరంగా ఎవరో మనుషులు కనిపించారు- ఎవరో కాదు..మా వాళ్ళే! నాకోసమే వెతుక్కుంటున్నట్లున్నారు! నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి కలుసుకున్నాను వాళ్ళని. నేను సాధించాను!

ఆత్మవిశ్వాసం, పట్టుదల, కృషి- ఈ‌ ఆయుధాలు మన దగ్గర ఉన్నంతకాలం మనం సాధించలేనిదంటూ ఏదీ ఉండదు.