అనగనగా ఒక నగరం. ఆ నగరం పేరు 'లక్ష్మీకోటి'. అందులో ఇద్దరు ధనవంతులు నివసిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు చిన్నతనం నుండి స్నేహితులే. వాళ్ళ పేర్లు ' కోటయ్య, రఘురామ్'. వాళ్ళిద్దరికీ చెల్లెళ్లు ఉన్నారు. రఘురామ్ చెల్లి భానుని కోటయ్య పెళ్ళి చేసుకున్నాడు.

కోటయ్య చెల్లి సిరిని రఘురామ్ పెళ్ళి చేసుకున్నాడు. అట్లా మిత్రులిద్దరి కుటుంబాలకూ బంధుత్వం కూడా ఏర్పడింది.

కోటయ్యకు ఇద్దరు పిల్లలు- గిరిజ, రాము. రఘురామ్‌కూ ఇద్దరు పిల్లలే- పార్వతి, విష్ణు. మిత్రులిద్దరిలాగే వాళ్ళ కుటుంబాలూ చక్కగా కలసి మెలసి ఉండేవి. కాలం గడిచింది- పిల్లలంతా పెద్దయ్యారు.

రఘురామ్ తన కూతురు పార్వతిని 'శివ' అనే అబ్బాయికి ఇచ్చి ఘనంగా పెళ్ళి చేశాడు. పెళ్ళి ఎంత గొప్పగా చేయించాడంటే, నగరం మొత్తం మీద అంత గొప్పగా వివాహం జరిపించినవాళ్ళు ఎవ్వరూ లేరు! నగర జనాభాలో సగం మంది హాజరయ్యారు ఆ పెళ్ళికి! అందరూ ఆ విందు గురించి, అతిథి మర్యాదల గురించి, రఘురామ్‌ బిడ్డ పెళ్ళి గురించే మాట్లాడుకుంటున్నారు. పెళ్ళి తర్వాత రఘురామ్ ఎక్కడలేని సారెలూ పెట్టి బిడ్డను అత్తవారింటికి సాగనంపాడు. అటుపైన నగరంలో అందరూ ఆ సారె గురించే చెప్పుకోవటం మొదలుపెట్టారు. ఎక్కడ చూసినా కోటయ్యకు రఘురామ్‌ను గురించిన పొగడ్తలే వినబడ్డాయి.

కోటయ్య ఆ మాటలు వినీ వినీ విసిగిపోయాడు. 'ఎలాగైనా రఘురామ్ కంటే చాలా గొప్పగా మా బిడ్డ పెళ్ళి చేస్తాను, ఊర్లో వాడికంటే మంచి పేరు తెచ్చుకుంటాను' అనుకున్నాడు. ఒక నెల తిరిగేలోగా కోటయ్య కూతురు గిరిజకి 'ఆనంద్' అనే అబ్బాయితో వైభవంగా వివాహం జరిగింది. ఈ పెళ్ళికి నగర జనాభా మొత్తం విచ్చేసింది. అంతకు మునుపు రఘురామ్ జరిపిన పెళ్ళి కంటే ఇది ఘనంగా ఉందని అందరూ చెప్పుకున్నారు. వచ్చిన అతిధులని రఘురామ్ మామూలు గదులలో ఉంచితే, కోటయ్య ఏ.సి.గదులలో ఉంచి మరిన్ని సొకర్యాలు కల్పించాడు! ఇక ఆనాటినుండీ రఘురామ్‌ మరుగున పడ్డాడు. అందరూ కోటయ్యను పొగడటం మొదలు పెట్టారు.

ఇది విని రఘురామ్‌కి తిక్క రేగింది. "అందరూ నన్ను మర్చిపోవటమేమిటి? నాకేం తక్కువైంది? వాడికంటే నేనే గొప్పవాడిని ! ఇప్పుడు చూడు, మా అబ్బాయి పెళ్ళి ఎలా చేస్తానో!" అనుకొని తన కొడుకు పెళ్ళి ఇంకా ఘనంగా చేశాడు. బయటి ఊళ్ళనుంచి కూడా అతిథులను ఆహ్వానించాడు పెళ్లికి . అందరూ రఘురామ్‌ని పొగిడారు.

వెంటనే కోటయ్య కూడా, కొడుకు పెళ్ళిని- ఇంకా ఘనంగా చేశాడు!

ఇక వాళ్ళ మధ్య గొడవలు రచ్చకెక్కాయి. "నేనా-వాడా" అన్నారు ఇద్దరూ, ఎవరికి వాళ్ళు. రెండు కుటుంబాలూ విడిపోయాయి. అన్నేళ్ళ స్నేహమూ ఒక్క సంవత్సరంలో మాసిపోయింది. ఇప్పుడు ఊళ్ళోవాళ్ళందరికీ అదే చర్చనీయాంశం అయిపోయింది.

ఒక రోజున కోటయ్య ఒంటరిగా ఇంట్లో కూర్చొని ఉండగా కొడుకు వచ్చి "నాన్నా! ఒక సారి డబ్బుల పెట్టె తాళాలు ఇటివ్వండి- ఒక పదివేల రూపాయలు కావాలి. పెళ్ళి అయిన సందర్భంగా మా స్నేహితులకి పార్టీ ఇస్తాను" అన్నాడు. కోటయ్య "సరే నాయనా తీసుకో" అని తాళాలు చేతికివ్వగానే వాడు అదేపనిగా డబ్బుల పెట్టె మొత్తం ఖాళీ చేసేసుకొని పోయాడు. అదేరోజున రఘురాం కొడుకు కూడా "పదివేలు కావాలి" అని అడిగి, లాకర్ మొత్తం గుల్ల చేసేశాడు. విషయం తెలిశాక కోటయ్య, రఘురామ్‌ ఇద్దరూ గొల్లుమన్నారు. "ఏదిరా?" అని అడిగేందుకు కూడా కొడుకులు ఇంటికి రాలేదు మరి!

అంతులేని దు:ఖంతో మిత్రులిద్దరూ ఎవరికి వాళ్ళు ఒంటరిగా రెండు రోజులు గడిపారు. విషయం తెలిసిన ఊళ్ళో జనాలు "ఇప్పుడు ముసలోళ్ళిద్దరూ ఎట్లా బతుకుతారో చూడాలి. కొడుకులే దగా చేశారు, పాపం! " అని వంతుల వారీగా వెళ్ళి ఓదార్చి రావటం మొదలుపెట్టారు. పరువంతా గంగలో కలిసిందని బాధపడుతున్న ఇద్దరికీ అట్లా తెలిసింది- తాము ఒకే పడవలో ఉన్నామని.

ఇంకేముంది, దు:ఖం ఆపుకోలేని కోటయ్య రఘురామ్‌ తలుపుతట్టి పలకరించాడు. రఘురామ్‌ అతన్ని లోనికి పిలిచి, తన కష్టాలు చెప్పుకొని, కోటయ్య పట్ల సానుభూతి వ్యక్తం చేశాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ మళ్ళీ మంచి స్నేహితులుగా మారారు!

ఇది జరిగాక వారం రోజులకు కొడుకులిద్దరూ ఇళ్ళకు వచ్చారు. తీసుకున్న డబ్బులు వెనక్కి తెచ్చి ఇచ్చేశారు! అంతవరకూ వాళ్లని తిట్టుకుంటూ, ఏడ్చుకుంటూ ఉన్న మిత్రులిద్దరూ నోళ్ళు వెళ్ళబెట్టారు. "మిమ్మల్ని కలిపేందుకు మేం ఆడిన నాటకమే ఇదంతా" అని ముసిముసి నవ్వులు కురిపించారు కొడుకులు. ఊళ్ళో వాళ్లంతా "మీ కొడుకులకు ఉన్న తెలివి మీకు లేకపోయిందేమి?" అని నవ్వారు.

గొప్పలకు పోతే ఏం జరగచ్చో తెలుసుకున్న మిత్రులు ఇద్దరూ చాలా సిగ్గుపడ్డారు. కొడుకులు తెచ్చిచ్చిన డబ్బుల్ని అనాధాశ్రమానికి దానం చేసేశారు. చేతికి అంది వచ్చిన కొడుకుల ఇళ్ళలో ప్రశాంత జీవితాన్ని గడిపారు.

లక్మీకోటికి ఎవరైనా వెళ్తే ఇప్పటికీ‌ వాళ్ల స్నేహాన్ని గురించే చెబుతుంటారు అందరూ!