అనగనగా ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని నరసింహనాయుడు అనే రాజు పాలించేవాడు. నరసింహనాయుడికి శృతి, కృతి అని ఇద్దరు కూతుళ్లు ఉండేవారు. రాజుగారికి మగ బిడ్డలు లేరు. అందుకని రాజుగారు వాళ్లిద్దర్నీ మగబిడ్డల మాదిరే పెంచారు. అన్ని విద్యలూ నేర్పారు. దాంతో కొడుకులు లేరన్న లోటు రాజుకి ఏమాత్రం లేకుండా పోయింది.

ఒకసారి వారి రాజ్యానికి ఒక గొప్ప ఋషి వచ్ఛాడు. శృతి- కృతి ఆయనకు స్వయంగా సపరిచర్యలు చేశారు. వారి ఆతిథ్యానికి ఋషి ప్రసన్నుడైనాడు. అక్కడినుండి వెళుతూ, ఆయన వారికి ఒక మాయామయూరాన్ని బహుమానంగా ఇచ్చి వెళ్ళాడు. ఆ మాయానెమలి ఎప్పుడూ వారివెంటే ఉంటుంది- కానీ ఎవ్వరికీ కనబడదు. వారెక్కడికైనా దాన్ని ఎక్కి వెళ్ళొచ్చు.

కొంతకాలానికి రాకుమార్తెలు ఇద్దరూ పెరిగి పెద్దవారయ్యారు. యుక్తవయసుకి వచ్చారు. వాళ్ల అందచందాలు, ధైర్య సాహసాలను గురించి ప్రజలు కథలు కధలుగా చెప్పుకునేవారు.

ఒకసారి రాక్షసుడు ఒకడు వారి నగరంమీద పడి అందమైన అమ్మాయిలను ఎత్తుకుపోవటం మొదలుపెట్టాడు. నగరమంతటా దాంతో విషాదం అలముకున్నది. ప్రజలందరూ భయభ్రాంతులయ్యారు. రాజుకు ఏం చెయ్యాలో తోచలేదు ఆ సమయంలో. అమ్మాయిలంతా ఇళ్లనుండి బయటకు రావడానికి కూడా భయపడసాగారు.

ఆ సమయంలో, ఒకనాడు శృతి, కృతి ఇద్దరూ తమ భవనంలో నిద్రిస్తూండగా తీవ్రమైన ఆర్తనాదాలు వినవచ్చాయి. మేల్కొని చూస్తే ఏముంది? రాక్షసుడు, కొంతమంది అమ్మాయిలను బలవంతంగా ఎత్తుకు పోతున్నాడు! ఎలాగైనాసరే ఆ రాక్షసుడిని అంతం చేసి, తమరాజ్యానికి వాడి పీడ వదిలించాలనుకున్నారు శృతి, కృతి. కానీ ఎలా? వాణ్ణి చంపడానికి వెళతామంటే తమ తల్లిదండ్రులు ఒప్పుకోరు! అందుకని వాళ్లు దేశాటన చేసి వస్తామని చెప్పి తల్లిదండ్రులిద్దర్నీ ఒప్పించి, రాక్షసుడి వేటకు బయలు దేరారు.

శృతి ఒక యువరాజులా వేషం ధరించింది. కృతేమో రాకుమార్తెలానే ఉండింది. వాళ్లిద్దరూ అనుమానిత ప్రాంతమైన ఒక అడవిని చేరుకొని, ఆరాత్రికి అక్కడే పడుకున్నట్లు నటించారు. ఆ అడవిలోనే ఉంటున్నాడు రాక్షసుడు. వాడు ఆ రాత్రికే వచ్చి, పురుష వేషంలో ఉన్న శృతిని వదిలి, కృతిని మాత్రం ఎత్తుకుపోయాడు. అందుకోసమే వేచిచూసిన శృతి ఇక తన పనిని మొదలుపెట్టింది. మాయానెమలిని ఎక్కి ఆమె రాక్షసుడిని వెంబడించింది. వాడు ఒక గుహలోకి ప్రవేశించాడు. ఆ గుహలోని ఒక అందమైన భవనంలోకి కృతిని తీసుకెళ్ళి, తనను పెళ్ళిచేసుకోమన్నాడు రాక్షసుడు.

"పెళ్లే కదా! చేసుకుంటాను గానీ, ముందు ఈ గుహలోని మాయ- మంత్రాలనూ, విశేషాలనూ నువ్వు నాకు చూపాలి మరి" అని అడిగింది కృతి ప్రేమ నటిస్తూ. రాక్షసుడు చాలా సంతోష పడ్డాడు. నాటి వరకూ తను అడగ్గానే చేసుకుంటానని ఎవ్వరూ అనలేదు మరి! అందుకని వాడు ఏ అనుమానమూ లేకుండా అన్ని రహస్యాలనూ చెప్పేశాడు కృతికి. చివరికి తన ప్రాణాలను దాచిఉంచిన చిలుక సంగతిని కూడా చెప్పేశాడు!

రహస్యాలన్నీ తెలుసుకొన్న కృతి "నాకుఆకలిగా ఉన్నది- అడవిలోకి వెళ్ళి నాకోసం ఒక మంచి వేటను తీసుకర"మ్మంది రాక్షసుడిని. వాడు నిజమే అనుకొని అడవిలోకి పరుగుతీశాడు ఆత్రంగా.

వెంటనే రంగంలోకి దిగింది శృతి. శృతి-కృతి ఇద్దరూ మాయా మయూరాన్నెక్కి మరుక్షణంలో రాక్షసుడి ప్రాణాలుదాచిన చిలుక ఉండే రహస్య ప్రదేశాన్ని చేరుకొన్నారు. అక్కడున్న కాపలా దెయ్యాలన్నింటితో పోరాడి, వాటన్నింటినీ చితకబాదారు. చివరికి చిలకను పట్టుకొని యజ్ఞగుండంలో వేసేసరికి, రాక్షసుని పీడ కాస్తా విరగడై పోయింది.

శృతి- కృతి ఇద్దరూ వెంటనే తిరిగి వచ్చి, రాక్షసుడు బందీలుగా ఉంచిన అమ్మాయిలనందరినీ విడిపించారు. ఆ వెంటనే అందరూ రాజ్యానికి చేరుకున్నారు. నరసింహనాయుని కూతుళ్ళ సాహసం గురించి దేశదేశాలవారూ చెప్పుకున్నారు. వారి గొప్పదన్నాన్ని విన్న రామలక్షణులంతటి యువరాజులిద్దరు వారిని పెళ్ళిచేసుకుంటామని ముందుకురాగా సంతోషంగా వారికి తన కూతుళ్లను ఇచ్చి ఘనంగా పెళ్ళి జరిపించాడు నరసింహనాయుడు.

కథ కంచికి, మనం ఇంటికి!