అనగనగా బెళుగుప్ప అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో చిన్న పుల్లయ్య, పెద్ద పుల్లయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు నివసిస్తూ ఉండేవారు. చిన్న పుల్లయ్యేమో తెలివైనవాడు; కాగా పెద్ద పుల్లయ్య మాత్రం తెలివి లేనివాడు. వారికి అడవి పక్కనే రెండెకరాల పొలం ఉండేది. అదే వారికి జీవనాధారం.

ఒక సారి అన్నదమ్ములిద్దరూ కలిసి వారి పొలంలో దోస పంటను వేశారు. కొన్నాళ్లకు దోసకాయలు కోతకొచ్చాయి. చిన్న పుల్లయ్యేమో, ఏరోజుకారోజు పండిన కాయలన్నింటినీ కోసి, వాటిని సంతకు తీసుకెళ్ళి, అమ్ముకొచ్చేవాడు; తోటకు కాపలాగా పెద్ద పుల్లయ్యను ఉంచేవాడు.

ఇదిలా నడుస్తుండగా ఒకనాడు చిన్న పుల్లయ్య పెద్ద పుల్లయ్యతో అన్నాడు "ఏంరా, అన్నయ్యా! ఈ మధ్య అన్నం సరిగ్గా తింటున్నావా, లేదా? అస్థిపంజరంలా ఇలా తయారవుతున్నావేమిటి? ఏదైనా సమస్య ఉంటే చెప్పు. ఎలాగో ఒకలా పరిష్కరిద్దాం" అని.

అప్పుడు పెద్ద పుల్లయ్యకు కళ్ళలో నీళ్లు తిరిగాయి. "ఏం చెప్పమంటావురా చిన్న పుల్లా! రోజూ కోసిన దోసకాయలన్నింటినీ నువ్వు సంతకు తీసుకెళుతున్నావా! నువ్వలా పోగానే పక్కనున్న అడవిలోనుండి జిత్తులమారి నక్క ఒకటి వస్తోందిరా,.." అని చెబుతున్నంతలోనే కలుగజేసుకొన్న చిన్నపుల్లయ్య అన్నాడు- "వస్తే వచ్చింది. అదొస్తే మనుషులు సన్నబడిపోవాలా ఏమిటి?" అని.

"అయ్యో ముందర నన్ను అంతా చెప్పనీరా చిన్న పుల్లా! అది వచ్చి, ’ఎవరు గుడిసెలో?’ అంటుంది. అప్పుడు నేను ’నేనే పెద్ద పుల్లయ్యను’ అని చెప్తాను.

’నువ్వు పుల్లయ్యవైతేనేమి? పులుసయ్యవైతేనేమి? ముందు బైటికి రా’ అంటుంది అది. అప్పుడు నేను బైటికి పోతాను.

అప్పుడు ’ఫో!, పోయి నా కోసం మంచి మంచి దోసకాయలను పీక్కురా!’ అంటుంది అది.

అపుడు నేను వెళ్ళి దోసకాయలు తెచ్చి, దానికిస్తాను.

అప్పుడది, ’రా! నా వెనక్కొచ్చి నా నడ్డి గోకుదువు, రా!’ అంటుంది.

అప్పుడు నేను నడ్డి గోకడానికిగాను దాని వెనక్కు వెళతాను.

అప్పుడది నేనిచ్చిన దోసకాయలను తింటూ, నన్ను బెదిరిస్తుంది. ’నేనిలా వస్తున్నట్లుగానీ, దోసకాయలు నువ్వు నాకిస్తున్నట్లుగానీ ఎవరికన్నా చెప్పావో, నీ అంతు చూస్తా’నంటుంది. పైగా అప్పుడే అది కంపును విడుస్తుందిరా, చిన్న పుల్లా, అబ్బా! ఆ కంపును భరించలేకనూ, అది నన్నేం చేస్తుందోనన్న భయంతోనూ నేనిలా సన్నబడిపోతున్నానురా చిన్న పుల్లా!" అని చెప్పుకొచ్చాడు పెద్ద పుల్లయ్య.

అంతా విన్న చిన్న పుల్లయ్య తన అన్నను ఓదార్చుతూ, "నువ్వేం భయపడకు. దాని గురించి నేను ఆలోచిస్తానుగాని" అని చెప్పాడు.

మరుసటి దినం సంతలో దోసకాయలను అమ్ముకురావడానికి తను పోకుండా, అన్నను పంపాడు చిన్న పుల్లయ్య. అన్నకు బదులుగా తోటలోని గుడిసెలో తను ఉండి, ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నాడు. అంతలోనే ప్రతి రోజూమాదిరే నక్క వచ్చి కూర్చున్నది: ’ఎవరు లోపల?’ అని అడుగుతూ.

ఆ తరువాత ‘నడ్డి గోకమనే వరకూ’ అంతా యధాప్రకారం జరిగింది. నడ్డి గోకుతూ, చిన్న పుల్లయ్య నక్కతో అన్నాడు, "దాహమవుతోంది లోపలికి వెళ్ళి నీళ్ళు తాగొస్తాను" అని.

"ఊ..ఊ.. వెళ్ళు. వెళ్ళు. వెళ్ళి త్వరగా రా" అన్నది నక్క.

"ఇదిగో ఇప్పుడే వస్తానండీ నక్కగారూ!" అని లోపలికి వెళ్ళాడు చిన్న పుల్లయ్య. చింతనిప్పుల్లో తాను ముందుగానే పెట్టిన ఇనుప కడ్డీని తీసుకెళ్ళి, ఒక్కసారిగా నక్క నడ్డి మీద గట్టి వాత పెట్టాడు. ఆ దెబ్బకు హడలిపోయిన నక్క, కుయ్యో మొర్రోమంటూ వెనక్కి చూడకుండా పరుగుతీసింది. ఆపైన ఇక దానికి మళ్లీ దోసతోట గుర్తుకురాలేదు!