తాత కోతి శివరాత్రి ఉదయం 4 గం|| లకే నిద్ర లేచి అందరిని లేపాడు అందరూ తొందరగా కాలకృత్యాలు తీర్చుకొని కోనేరులో స్నానం చేసారు. అందరికీ ఇది బాగానే ఉంది కాని, పిల్ల కోతికి కొంచెం ఇబ్బందిగా ఉంది. గుడిలో కెళ్లి దేవునికి దణ్నం పెట్టుకొని; ముఖానికి వీభూది పట్టించుకొని గుడికి కొంచెం దూరంలో ఒక బండ మీద గుండ్రంగా కూర్చున్నాయి. తాత అందరిని "ఓం నమఃశివాయ" పలకమన్నాడు. పిల్లకోతి, అమ్మ కోతి, నాన్నకోతి, అవ్వ, తాతకోతి అందరూ "ఓం నమః శివాయ, ఓం నమః శివాయ" అంటూ చాలా భక్తిగా పలకడం మొదలు పెట్టారు.
తనవాళ్ళు మనుషుల కంటే చాలా భక్తితో శివ నామ జపం చేస్తున్నారని తాత చాలా గర్వపడ్డాడు. మళ్ళీ అందరితో చెప్పాడు. "మనం ఇలాగే దేవుని మీద మనసు పెట్టి సాయంత్రం సూర్యుడు అస్తమించే వరకు భజన చేయాలి. పిల్ల కోతి కూడా బాగా భజన చేస్తున్నది వెరీగుడ్." అని.
పిల్ల కోతి , అమ్మ కోతి , నాన్న కోతి, అవ్వకోతి , తాత కోతి, బాగా భజన చేస్తున్నారు. ఐదు - పది నిమిషాలు గడిచింది . అందరికీ బాగానే ఉంది . కానీ
పిల్లకోతికి ఒక చోట కూర్చుని భజన చేయడం చాలా ఇబ్బందిగా ఉంది . నిదానంగా తెల్లారుతోంది. ఉన్నట్టుండి పిల్లకోతి అమ్మకోతితో , నాన్న కోతితో , అవ్వ కోతితో , తాత కోతితో "నాకొక ఐడియా వచ్చింది చూడండి- సూర్యోదయం సమయంలో ప్రకృతి ఎంత బాగా ఉందో ! మనం ఈ సమయంలో ఈ బండ మీద కూర్చుని భజన చేయడం కన్నా అలా ప్రకృతిలో విహరిస్తూ దేవుని మీద మనసు పెట్టి భజన చేస్తే బాగుంటుందని నాకని పిస్తున్నది" అంది. తాత కోతికి ఈ ఆలోచన నచ్చింది.
ఇప్పుడు కోతులన్నీ అడవిలో చెట్లమధ్యన తిరుగుతూ చాలా భక్తిగా ’ఓం నమ: శివాయ’ చెబుతున్నాయి. అలానడుచుకొంటూ పోతూ వుంటే పిల్లకోతికి కొంచెం బాగా వుంది. ఇలా ఐదారు నిమిషాలుగడిచే సరికి దానికిమళ్ళీ ఏదో ఇబ్బంది మొదలయ్యింది. దేవునిమీద మనసు పెట్టలేకపోతోంది. ఇంతలోనే కోతులన్నీ అడవికి ఆనుకొని ఉన్న గంగులన్న తోట దగ్గరికి చేరుకొన్నాయి. ఆ తోటను చూసిన వెంటనే పిల్ల కోతికి ఒక ఐడియా వచ్చింది. "అమ్మ కోతీ , నాన్నకోతీ, అవ్వకోతీ, తాతకోతీ -మనం ఇలా, ఈ చెట్ల మధ్యన తిరిగే బదులు గంగులన్న తోటలో నడుద్దాము . చూడండి, తోట ఎంతబాగున్నదో దేవుని మీద మనసు పెట్టడానికి అది చక్కని వాతావరణము. అందరమూ ఈ అందమైన తోటలో తిరుగుతూ ఈరోజు సూర్యాస్తమయం వరకూ భజన చేద్దాం."అని పిల్లకోతి చెప్పిన మాటకు తాత కోతి సంతోషపడి అందర్నీ తోటలోనికి వెళ్లి భజన చేయమన్నాడు. ఎవరూ అరటిపళ్ల జోలికి మాత్రం వెళ్లకూడదని హెచ్చరించాడు.
పచ్చని అరటి తోటలో, పొద్దునే వస్తున్న సూర్యుని కాంతిలో శివుని భక్తిలో మునిగిపోతూ కోతులన్నీ శివనామ జపం చేస్తున్నాయి. భక్తి ప్రభావం వల్ల విరగ కాస్తున్న అరటి పళ్లను తినాలని బుద్ధి పుట్టలేదు. ఐతే ఐదు నిమిషాల పాటు తట్టుకున్న పిల్లకోతి ఇక ఊరుకుండ లేక పోయింది. కానీ ’సాయంత్రం చీకటి పడేంతవరకు ఏమీ తిననని తాతకు మాట ఇచ్చింది కదా, ఇప్పుడు ఎలా?’అది చాలా తెలివైనది కదా. దానికి మళ్ళీ ఒక ఉపాయం వచ్చింది. "అమ్మకోతీ, నాన్నకోతీ, అవ్వకోతీ, తాతకోతీ, మనం ఊరికే ఇలా తోటలో కుర్చొని భజన చేసేకన్నా ఏదైనా పని చేస్తూ భజన చేయవచ్చు కదా! ’ఉపవాసం ఉండాలి, దేవుని మీద మనసు పెట్టి శివనామ జపం చేయాలి. అంతే గాని ఇది చేస్తూ ఏ పనీ చేయకూడదని స్వామి చెప్పలేదు కదా! కాబట్టి మన మంతా తోటలోనే మంచి మంచి అరటి పళ్లను కోసుకొచ్చి ఒక కుప్ప చేద్దాం. ఆ కుప్ప చుట్టూ కూర్చొని సూర్యాస్తమయం వరకు భజన చేస్తూ గడుపుదాం. సూర్యాస్తమయం అయిన వెంటనే మన దైవప్రసాదంలాంటి ఈ తోటలోని అరటి పళ్లను తినడానికి ఆలస్యం కాదు" అని పిల్లకోతి చెబితే దాని అద్భుతమైన ఆలోచనకు తాత ఎంతగానో ముచ్చటపడ్డాడు. అందుకు అనుగుణంగా అందరూ ఏమేం చేయాలో ఆదేశించాడు. అయితే అందరూ శివభజన చేయడం మరువరాదని గుర్తు చేశాడు. ఎవరూ అరటి పళ్లు తినరాదని కఠినంగా చెప్పాడు.
కోతులన్నింటికి పనిచేస్తూ భజన చేయడం బాగున్నట్టుంది. తోట దద్దరిల్లేట్లు " ఓం నమ:శివాయ, ఓం నమ:శివాయ" అని అవన్నీ ఒకే గొంతుతో అరుస్తున్నాయి. సైనికుల్లాగా ఒక క్రమ పద్ధతిలో చాలా అరటి పళ్ళు కోసి ఒక పెద్దకుప్ప చేసాయి. పదిరోజులు తిన్నా మిగిలిపోయేన్ని కోసి కుప్ప చేసాయి. పిల్లకోతికి అరటి పళ్ళకుప్పను చూస్తూంటే అదే స్వర్గంలా అనిపించింది. అది కూడా చాలా ఉత్సాహంగా అందరి భజనతో తనగొంతు బాగా కలిపి పని చేస్తోంది. తాత ఇక చాలని చెప్పిన తరువాత అన్నీ కుప్ప చుట్టూ కూర్చొని దేవుని మీద మనసు పెట్టి ఏకాగ్రతతో భజన చేయడం మొదలెట్టాయి. పిల్లకోతి కూడా కొంతసేపు బాగా భజన చేసింది. కాని దానికి గమ్మున కుర్చోని భజన చేయడం చాలా కష్టంగా ఉంది. అందులోనూ ఎదురుగా ఉన్న తియ్యని అరటి పళ్లకుప్ప తనని భజనమీద మనసు పెట్టించలేక పోతున్నది. నోరూరుతోంది. కానీ తాత చెప్పిన మాటలు కూడా చాలా బలంగా గుర్తున్నాయి.
ఒక అయిదు నిమిషాలు సతమతమయింది. ఇప్పుడు దానికి ఠపీమని మరొక అద్భుతమైన ఐడియా వచ్చింది. "అమ్మకోతీ, నాన్నకోతీ, అవ్వకోతీ, తాతకోతీ మన మెందుకు ఇలా గమ్మునే కూర్చొని భజన చేయాలి? ఇంతకు ముందే అనుకున్నాం కదా, మనం పనిచేసుకుంటూ భజన చేయవచ్చునని? మనం ఇంతకు ముందు చేసి చూశాం కూడా. మనం పని చేసుకుంటూ ఎంత భక్తితో పని చేసామో! అని పిల్ల కోతి చెబుతోంటే తాతకోతి " మరి మనం ఇప్పుడు ఏం చేద్దాం " అని అడిగాడు. దానికి పిల్లకోతి " మనం చీకటి పడ్డాక తినడానికి దేవుని ప్రసాదం లాంటి ఈ అరటిపళ్లను రెడీగా ఉంచుకుందాం! వీటి తొక్కలన్ని తీసి పళ్ళను మాత్రం కుప్పగా ఉంచుకుంటే మనం చీకటి పడ్డాక తినడానికి వీలుగా ఉంటుంది. " అని తన ఆలోచన చెప్పింది. ఈ ఆలోచన కూడా కోతులన్నింటికీ నచ్చింది. తమ పిల్లకోతి ఎంత తెలివైనదోనని అన్ని మురిసి పోయాయి. ’వీడు నామనవడ’ని తాత మీసం కూడా తిప్పుకున్నాడు.
అరటి పళ్ల చుట్టూ కూర్చొని కోతులన్నీ చాలా భక్తి శ్రద్ధలతో శివ నామం పలుకుతూ పని చేయడం మొదలు పెట్టాయి. చాలా హుషారుగా పని చేస్తున్నాయి అన్నీ. తొందరలోనే అన్ని అరటి పళ్లకూ తొక్కలు తీసేశాయి. లోపలి పండు భాగాలన్నీ ఒక కుప్పగా చేశాయి. తొక్కలన్నిటినీ దూరంగా పడేశాయి. ఏ ఒక్కటీ చిన్న అరటి ముక్కను కూడా తినలేదు. శివుని మీద ఉన్న భక్తి వల్ల ఎవరికీ అసలు తినాలనిపించలేదు. పిల్లకోతికి మాత్రం మనసు కొంచెం అటు వెళ్లింది. అయినా చాలా బాగా ఓర్చుకున్నది. కోతులన్నీ ఇప్పుడు తొక్కలు తీసిన అరటి పళ్ళ కుప్ప చుట్టూ కూర్చొని భజన చేస్తున్నాయి. పిల్ల కోతి కూడా ప్రయత్నం చేసి భజన చేస్తోంది. భజన చేస్తుంటే నోట్లో నుంచి జొల్లు కారుతోంది. ఒక వైపున తియ్యటి అరటిపళ్లు , మరొక వైపున ఉపవాసం గురించి తాత చెప్పిన మాటలు తనను బలంగా గుంజుతున్నాయి. ఏం చేయాలో తోచక పిచ్చి పట్టినట్లు అవుతూ ఉండగా దానికి ఒక బ్రహ్మాండమైన ఆలోచన తట్టింది.
ఈ సారి అందరికీ తన ఆలోచను ఇలా చెప్పింది: "అవ్వకోతీ ,తాత కోతీ,అమ్మకోతీ, నాన్నకోతీ - ఇలా గమ్మునే కూర్చుని భజన చేయటం బాగా లేదు. అసలు మనం ఏదైనా పని చేస్తూ భజన చేసినపుడే మన భజన బాగా నడుస్తుంది. అందువల్ల ఇప్పుడు మనం ఒక పని చేయవచ్చు. మనముందున్న తొక్కల్లేని అరటి పళ్ళను ఎవరికి వాళ్లు వీలైనన్ని నోట్లో పెట్టుకోవాలి . ఐతే సూర్యాస్తమయం వరకు ఎవరూ మింగకూడదు. దేవుని మీదనుండి మనసు మళ్లించకుండా శివభక్తితో నామస్మరణ చేస్తూ కూర్చుందాం . ఉపవాస సమయం అయీపోతునే మనం ఆలస్యం కాకుండా దేవుని ప్రసాదం తినేయవచ్చు. సరేనా?" అని పిల్లకోతి అందరినీ అడిగింది. అప్పటికే కోతులన్నీ పిల్లకోతి తెలివి తేటలకు చాలా ముగ్దులై ఉన్నాయి. తాతకోతి కూడ మరొక ఆలోచన లేకుండా సరే అన్నది.
కోతులన్నీ వీలైనన్నిపళ్ళను నోటీలో దోపుకున్నాయి. గొంతులోకి ఏదీ వెళ్ళకుండా జాగ్రత్తపడుతున్నాయి. నోట్లో ఎంగిలి ఊరినా అది గొంతులోకి పోకుండా చూసుకుంటున్నాయి. పిల్లకోతి కూడా వీలైనంత జాగ్రత్త పడుతున్నది. అయితే అందరికంటే దానికి చాలా ఇబ్బందిగా వుంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న కోతులు శివనామ జపం ఆపలేదు. అయితే ఇప్పుడు అందరినుండి శబ్దాలు కొంచెము పిచ్చి పిచ్చి గా వస్తున్నాయి. బుగ్గలనిండా కూరుకున్నఅరటి పళ్లు " ఓం నమ:శివాయ" అని పలకడానికి అడ్డము వస్తున్నాయి. అయినా వాటి మనసుల్లో శివుని మీద ధ్యాస స్పష్టంగా ఉంది.
ఇంతలో "తాతా ! పండు గొంతులోకి వెళ్లి పోయింది" అని పిల్ల కోతి గట్టిగా అరిచింది. "అవునా" అనేసరికి తాత గొంతులోదీ వెళ్లిపోయింది. "నా పండూ వెళ్లి పోయింది" అని తాత అనే సరికి అవ్వ "అయ్యో" అన్నది . దాంతో అవ్వ గొంతులోకి ఒక అరటి పండు జారి పోయింది . ఇలా అమ్మ కోతి , నాన్న కోతి కూడా అరటి పళ్లు మింగేశాయి. ఇక చేసేది లేక "శివా, శివా ! శివాశివా !" అని నిట్టూర్చుతూ అందరూ తమ బుగ్గల్లో యిరికించుకుని వున్న అరటి పళ్ళను అన్నీ తినేశాయి.
ఇంకా సమయం ఉదయం 6 గం|| కూడా కాలేదు అప్పటికే తమ ఉపవాసం భంగం జరిగిపోయింది శివరాత్రి పుణ్య ఫలాన్ని దక్కించుకొనే భాగ్యం కలగలేదని తాత కోతి ,అవ్వకోతి, అర్ధ గంట సేపు ఏడ్చారు. అమ్మ కోతి ,నాన్న కోతి కూడ పెద్దోళ్ల భాధను చూసి ఏడ్చారు. దీని కంతటికి తననే బాధ్యుణ్ని చేస్తారని భయంతో పిల్ల కోతి ఇంకా బిగ్గరగా ఏడ్చింది.
పొద్దున్నే కోతుల ఏడుపులు విని గంగులన్న ఒక దుడ్డుకర్ర తీసుకుని కోతుల దగ్గరకు వచ్చాడు. కొన్ని వందల అరటి పళ్ళు కోసుకుని , వాటి తొక్కలు తీసేసి, తొక్కల్లేని పళ్లను ఒక పెద్ద కుప్ప చేసి, దాని చుట్టూ ఏడుస్తూ కూర్చున్న కోతుల్ని చూసేసరికి గంగులన్నకి పట్టరాని కోపం వచ్చింది. దుడ్డుకర్ర తీసుకొని వాటికి నాలుగు అంటించాడు . అవి "కుర్రో మొర్రో" అని అరుచుకుంటూ అడవిలోకి పారిపోయాయి .
వచ్చే సారి శివరాత్రికి పిల్ల కోతి తెలివి తేటలు మీద ఆధార పడకూడదని తాత కోతి, అవ్వ కోతి అనుకున్నాయి . ఈ సారి శివరాత్రి ఉపవాసం ఎలాగూ పాడైపోయింది కదా , ఇక కడుపు నిండా తిని హాయిగా ఉందామని కోతులన్నీ ఎర్రప్ప మామిడి తోటకి వెళ్ళాయి.