ఒక ఊరిలో ఒక కుంటికోతి, ఒక మంచికోతి ఉండేవి. మంచికోతేమో మానెక్కింది, కుంటికోతేమో కిందే ఉంది. అది ’మంచికోతీ, మంచికోతీ నాకో పండు విసిరెయ్యవా’ అని అడిగింది. అయితే మంచికోతి ఓ పుచ్చి పోయిన పండును విసిరితే ఆ పండు పోయి కాలవలో పడింది. ’అయ్యో, ఇంకో కాయ విసిరెయ్యవా’ అని అడిగితే, ఈసారి మంచికోతి విసిరిన కుళ్లిపోయిన పండు దిబ్బలో పడింది. ’అయ్యో’ అని బాధపడి కుంటికోతి పోతూ పోతూ పోతుంటే, దానికి ఒక చిన్న రాయి కనబడింది. ఆ చిన్నరాయి కింద చిన్న రూపాయి కనబడింది. ఆ తరువాత ఒక పెద్ద రాయి కనబడింది. పెద్దరాయి కింద పెద్ద రూపాయి కనబడింది. ఇంకా ముందుకు పోగా పోగా ఒక బండి కనబడింది., తరువాత రెండెద్దులు దొరికాయి దానికి. వాటితో సంతోషంగా బండి కట్టుకొని, వెనక్కి వస్తూ పెద్దరాయి కిందినుండి పెద్దరూపాయిని, చిన్నరాయి కిందినుండి చిన్నరూపాయిని తీసుకొని వెనక్కి వచ్చింది కుంటి కోతి.

అది సంతోషంగా ఉండటం చూసిన మంచికోతికి అసూయ పుట్టింది. అది ’కుంటికోతీ కుంటికోతీ ఇవన్నీ నీకెక్కడివి’ అని అడిగితే కుంటికోతి అన్నీ చెప్పేసింది. అప్పుడు దురాశకొద్దీ మంచికోతి బయలుదేరి పోతూ పోతూ చిన్నరాయికింద వేలు పెట్టింది, చిన్నతేలు కుట్టింది. ఇంకా ముందుకుపోయి పెద్ద రాయికింద వేలు పెడితే పెద్ద తేలు కుట్టింది. బండి ముందుకు పోతే అది కదిలి మీద పడింది, ఎద్దుల్ని ముట్టితే అవి మీదపడి కుమ్మాయి. తన దురాశకు తగిన శాస్తి జరిగిందని మంచికోతికి అర్థం అయ్యింది.