తాతమ్మకి నిద్ర వస్తున్నట్టు ఉంది, అయినా కబుర్లు వినాలన్న ఆశతో, ‘ఓ కప్పు కాఫీ ఇవ్వవే మణీ’ అంటూ కోడల్ని పురమాయించింది. ఢిల్లీలో చూడదగ్గ ప్రదేశాల గురించి బిట్టు అనర్గళంగా చెబుతూంటే నోళ్ళు తెరిచి వింటూ ఉండి పోయారు పిల్లలు. తాతమ్మకి కాఫీ, దాంతో పాటు పిల్లలకి కాసిని జంతికలు, రవ్వలడ్లు తెచ్చిపెట్టింది అమ్మమ్మ. బిట్టు ఉత్సాహంగా తన ఊరి విశేషాలు చెబుతున్నాడు. వాడి మాటలు వింటూ "వీడు వచ్చినప్పుడు తెలుగు రానట్లు ఎట్లా ఉన్నాడు, ఈ కొద్ది రోజుల్లోనే ఎంత మారిపోయాడు?! మాతృభాషకు నిజంగానే మనసు లోపల గట్టి ముద్ర ఉంటుందేమో, కాలం ప్రభావం వల్ల ఎంత మరుగు పడ్డా, తగిన సమయం రాగానే అది చకాలున బయటికి వచ్చేస్తుందేమో" అని ఆలోచనలో పడింది అమ్మమ్మ.

ఆలోగా బిట్టు 'ఇందిరా గాంధీ మ్యూజియం' గురించి చెప్పసాగాడు: ప్రియదర్శిని చిన్నప్పటి కథల దగ్గరినుండి, ఆవిడ పెద్దయి, హత్యకి గురైన రోజు వరకు అనేక సంగతులు చెప్పాడు వాడు. "ఆవిడ హత్య చేయబడినప్పుడు వేసుకున్న చీరను అలాగే రక్తపు మరకలతో మ్యూజియంలో ఉంచారు తెలుసా?" అని వాడు అడిగితే చిట్టి, దావీదు ఆశ్చర్యంతో నోళ్ళు తెరిచారు. "ఆవిడ చనిపోయిన స్థలంలో ఒక గాజు పలకని కూడా అమర్చారు" అని బిట్టు చెబితే, "నువ్వు చూసావా? భయం వెయ్యలేదా?" అని అడిగింది చిట్టి.

"భయం ఎందుకు? అక్కడ అంతా ఉంటారు కదా" అని హుందాగా జవాబిచ్చాడు బిట్టు.

ఇందిరాగాంధీ వాళ్ల నాన్న జవహర్ లాల్ నెహ్రూ చిన్నప్పటి సంగతులు కూడా బిట్టూకు బాగా తెలుసు. "ఆ చిట్టి మెదడులో‌ ఎన్నెన్ని సంగతులు పెట్టుకున్నాడు?" అని అమ్మమ్మ ఆశ్చర్యపడ్డది. వాడు ఆయన జీవిత విశేషాలు ఒక్కటొక్కటిగా చెబుతుంటే, "వీడికి చరిత్ర అంటే ఉన్న ఆసక్తే వీటన్నింటినీ గుర్తుంచుకునేలా చేసి ఉండాలి. ఆ మ్యూజియంలు అన్నీ‌ చూడటం వల్ల, అక్కడ ప్రదర్శించిన వస్తువుల నేపథ్యాన్ని వాళ్లెవరో సరిగ్గా చెప్పటం వల్ల, ఆ వివరాలన్నీ‌ వాడి మెదడులోకి బాగా ఎక్కాయి" అనుకున్నది. "అబ్బ! వీడికి ఎన్నెన్ని సంగతులు తెలుసు!" అని చిట్టి, దావీదు ఆశ్చర్యంగా విన్నారు- వాడు ఏం చెబితే అది.

"మొదటి ప్రపంచ యుద్ధం అని, అన్ని దేశాలూ యుద్ధం చేసుకున్నాయి ఒకసారి. దానిలో చనిపోయిన ఏడువేల మంది సైనికులను స్మరించుకుంటూ వాళ్లకు గుర్తుగా కట్టారు ‘ఇండియాగేట్’. అది బలే ఉంటుంది. దాని గోడల మీద వాళ్ళందరి పేర్లనూ రాసిపెట్టారు.

ఎప్పుడూ వెలుగుతూ ఉండే టార్చి ఉంటుందక్కడ" చెప్పాడు బిట్టూ. "ఎప్పుడూ, ఎట్లా వెలుగుతుంది? నూనె ఎవరు పోస్తారు? మన ఊరి గుళ్ళో‌ పూజారిలాగా అక్కడ ఎవరైనా ఉంటారా?" అడిగింది చిట్టి. "అది నూనె దీపం కాదు" అన్నాడు బిట్టు. "కరెంటు బల్బు అయి ఉంటుంది" అన్నాడు దావీదు. "కాదు, అది గ్యాస్ దీపం. ఢిల్లీలో చాలా ఇళ్లకి గ్యాస్ సిలిండర్లలో కాక, పైపుల ద్వారా సప్లై అవుతుంది" అని చెబితే "గ్యాస్ దీపమా!" అని పిల్లలిద్దరూ తెగ ఆశ్చర్య పోయారు.

ప్రపంచంలోకెల్లా అతి పెద్ద గుడి- ‘స్వామి నారాయణ మందిరం, అక్షరథామ్’ అని ఒకటి ఉంది ఢిల్లీలో. ప్రపంచంలో ఎక్కడెక్కడినుండో గ్రానైటు రాయి, పాలరాయి తెచ్చి కట్టారు ఆ గుడిని. అక్కడ కూడా ఓ పెద్ద మ్యూజియం ఉంది. అక్కడ ఒక పెద్ద కొలనుంది; ఆ కొలనులో పడవలు తిరుగుతుంటాయి. వెళ్ళినవాళ్ళు ఆ పడవల్లో ఎక్కి సొంతగా నడుపుకుంటూ తిరగచ్చు!" ఉత్సాహంగా చెప్పాడు బిట్టు.

"ఓహ్.. నాకు పడవ ప్రయాణం అంటే చాలా ఇష్టం" అన్నాడు దావీద్. "నాకు కూడా. నాకు ఈత కూడా వచ్చు" అన్నది చిట్టి.

"స్వామి నారాయణ్ మందిర్లో ఒక క్యాంటీన్ ఉంటుంది- దానిలో ఎన్నెన్ని రకాల తిండి పదార్థాలు దొరుకుతాయో! నాకైతే ‘స్వామి నారాయణ్ పొంగల్’ చాలా నచ్చింది" చెప్పాడు బిట్టు.

"అన్నన్ని ప్రసాదాలు పెడతారా?" అడిగింది చిట్టి.

"కొన్ని పెడతారు, కొన్ని కొనుక్కోవాలి. అక్కడంతా కొనుక్కునేవే ఎక్కువ" చెప్పింది అమ్మమ్మ.

"మేం ఒకరోజు ప్రొద్దునే లోఢి గార్డెన్స్ కి వెళ్ళాం. చాలా పెద్ద తోట అది. తొంభై ఎకరాలు ఉంటుంది. అంతా ఉదయాన్నే అక్కడ తోట చుట్టూ ఎంతంటే అంత పరుగెత్తుతూ ఉంటారు" చెప్పాడు బిట్టూ. "ఎందుకు?" అడిగింది చిట్టి.

"ఆరోగ్యం కోసం! ఇక్కడిలాగా పట్నాల్లో వాళ్లకు శ్రమచేసే అవకాశం ఉండదు- అందుకని ప్రత్యేకంగా పరుగెత్తాలి అలాగ!" చెప్పింది అమ్మమ్మ "అవును కదా! పల్లెల్లో వాళ్లతో పోలిస్తే పట్నాల వాళ్లకు ఎన్ని కష్టాలు!" అనుకుంటూ.

"ఢిల్లీలో ఎర్రకోట ఉంటుంది కదా? నువ్వు చూసావా?" అడిగాడు దావీద్. "ఓఁ! చూసా!" చెప్పాడు బిట్టు. "మొఘల్ చక్రవర్తుల పాలన మొదలైనప్పుడు కట్టారు దాన్ని, ఎర్రటి రాయితో. ఇప్పుడు కూడా జాతీయ పండుగలప్పుడు మన జెండాను అక్కడే ఎగుర వేస్తారు. సాయంత్రం పూట కోటను చూసేందుకు వెళ్తే "సౌండ్ అండ్ లైట్ షో" అని ఒకటి చేస్తారక్కడ. మొత్తం అంతా చీకటిగా ఉన్నప్పుడు, కోటలో ఒక్కోవైపుకూ లేజర్ కిరణాలు వేసి, దాని గురించి కథలాగా చెబుతారు" చెప్పాడు బిట్టు.

"అవన్నీ అర్థం అవుతాయా, నీకు?" అడిగింది అమ్మమ్మ బిట్టూని. "సొంతగా అర్థం కావు అమ్మమ్మా! అమ్మా వాళ్ళు ఉండి చెబుతుంటే తెలుస్తుంది అంతే" అన్నాడు వాడు. "అవునవును. ఇట్లాంటి చోట్లకి పిల్లల్ని తీసుకెళ్ళేముందు పెద్దవాళ్ళు సొంతగా బాగా తెలుసుకోవాలి" అన్నది అమ్మమ్మ.

"తాజ్ మహల్ చూసావా మరి?" అడిగింది చిట్టి.

"తాజ్ మహల్ దిల్లీలో ఉండదు కదా, ఆగ్రాలో ఉంటుంది" అన్నాడు బిట్టు. "..అయితే దిల్లీలో తాజ్‌మహల్ లాగానే ఉండే ’హుమయూన్ టూంబ్’ ఉంటుంది. ఇది తాజ్‌మహల్ కంటే ఇంకా పాతది. దీన్ని చూసేందుకు కూడా అందరూ సాయంత్రాలలో వెళ్తారు.

"కుతుబ్ మినార్ గురించి చెప్పలేదు" గుర్తుచేసింది అమ్మమ్మ.

"‘మినార్’ అంటే పెద్ద స్తంభం అన్నమాట. హైదరాబాదులో చార్మినార్ ఉన్నట్లే. అయితే ఇది ఒక్కటే స్తంభం, చాలా ఎత్తుగా ఉంటుంది. మొఘలు చక్రవర్తులు సాధించిన విజయాలకి గుర్తుగా 'కుతుబుద్దీన్ ఐబక్' అనే చక్రవర్తి కట్టించాడు దీన్ని. ఈ స్తంభంలో 5 అంతస్థులు ఉంటాయి. వీటిని కూడా ఎర్రటి రాయినీ, పాలరాయినీ‌ కలిపి కట్టారు.

"అమ్మో!‌ఢిల్లీలో చాలానే ఉన్నాయే, చూసేందుకు?" అన్నది చిట్టి.

"ఇంకా చాలానే ఉన్నై. 'బహాయి టెంపుల్’ అని ఒకటి ఉంది, అది మొత్తం తామర పువ్వు ఆకారంలో ఉంటుంది. ఏమంటే దీన్ని పూర్తిగా తెల్లటి పాలరాయితో కట్టారు. దీని చుట్టూ 9 నీటి మడుగులు ఉంటాయి. అన్ని మతాలవాళ్ళూ ఇక్కడ ప్రేయర్, మెడిటేషన్ చేసుకుంటారు. ఇంకా జంతర్ మంతర్ అని, పాతకాలంవాళ్ళు గ్రహాల్నీ, నక్షత్రాల్నీ‌ గమనించేందుకు కట్టినది ఒకటి ఉంటుంది.. ఇంకా చాలా ఉన్నై. మీరు ఎప్పుడైనా వస్తే చూపిస్తాను" అన్నాడు బిట్టూ.

‘అబ్బ, ఇవన్నీ చూసావా, నువ్వు?!’ అడిగారు చిట్టి, దావీదు. వాళ్ల గొంతుల్లో ఆశ్చర్యం, కొంచెం అసూయ వినిపించాయి.

‘ఓఁ! అన్నీ చూసాను. అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్లు వచ్చినప్పుడు, ఇంకా ఎవరైనా చుట్టాలొచ్చినప్పుడు వాళ్లని తీసుకొని వెళ్తాం మేము!‘

‘వీటిలో నీకు ఏది ఎక్కువ ఇష్టం’ అంది చిట్టి.

‘ఎర్ర కోట, ఇండియాగేట్ నాకు చాలా ఇష్టం. చలికాలంలో స్వెట్టర్లు తొడుక్కుని, రాత్రి పూట ఇండియా గేట్ దగ్గర కూర్చుని, అక్కడి లైట్లు చూస్తూ, వేడి వేడి మొక్క జొన్నలు, చల్లటి ఐస్ క్రీమ్ తింటుంటే భలే ఉంటుంది తెలుసా?!’ అంటూ వాళ్లిద్దర్నీ ఊరించాడు బిట్టూ.

అంతలో అకస్మాత్తుగా బిట్టు తాతమ్మని గమనించాడు, ఆవిడ ఎప్పుడో నిద్రలోకి జారుకుంది. "దిల్లీ కబుర్లు చెప్పమని అడిగింది తనే, మళ్ళీ ముందుగా నిద్రపోయింది కూడా తనే!" అనుకున్నాడు వాడు. వాడి మనసు అర్థం అయినట్టే అమ్మమ్మచెప్పింది- ‘పెద్దవాళ్లు పసిపిల్లలతో సమానంరా బిట్టూ. వాళ్లు ప్రత్యేకమైన వాళ్లు’ అని.

వీరబాబు వచ్చి పిల్లల్ని తీసుకెళ్లబోయేంతలో తాతయ్య కూడా వచ్చారు.

‘ఇంకా మీకబుర్లు అవలేదూ’ అన్న తాతయ్యతో, దావీదు ఉత్సాహంగా చెప్పాడు, "ఇవాళ్ళ బిట్టు మమ్మల్ని ఢిల్లీ అంతా తిప్పి చూపించాడండి" అని.

‘నిజంగా కూడా తిప్పి చూపిస్తాడు. మనం అందరం కలిసి వచ్చే వేసవి సెలవులకి ఢిల్లీ వెళ్దాం, సరేనా?’ అన్నారు తాతయ్య. చిట్టి, దావీదుల ముఖాలు ఆశ్చర్యంతోటీ, సంతోషంతోటీ వెలిగిపోయాయి!

ఆరోజు పడుకోబోయే ముందు బిట్టు తాతమ్మ గురించి ఒక కవిత రాసుకున్నాడు, "అయితే పెద్దవాళ్లు ప్రత్యేకమైనవాళ్లన్నమాట! అమ్మమ్మ చెప్పింది" అనుకుంటూ- "తాతమ్మ, తాతయ్యకి అమ్మ-
అయినా అమ్మమ్మ-తాతయ్యలే, తాతమ్మకి అమ్మా-నాన్నా!
ఒక్కపన్నూ లేని తాతమ్మ-
ఎప్పుడూ ఏదో తింటున్నట్టే ఉంటుంది తమాషాగా!
ఏమి చెప్పినా వినపడదంటుంది-
‘పైగా అంత చిన్నగా మాటలాడతావేమిరా’ అంటుంది-
తాతమ్మ ప్రపంచంలోనే గొప్ప క్రియేషన్ నిజంగా!"