పట్టణానికి దూరంగా పార్కులో రకరకాల పూల మొక్కల్ని పెంచుతున్నారు. రంగురంగుల పూలు పూసి అవి అందరినీ ఎంతో ఆకర్షిస్తున్నాయి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం బాల-బాలికలు, స్త్రీ-పురుషులు అందరూ ఆ పూలతోటకు వచ్చి, పువ్వుల శోభను చూసి మురిసేవారు.

కొందరు అమ్మాయిలు గులాబి పూల అందాల్ని చూసి, వాటి పరిమళాన్ని మెచ్చుకుని, "అబ్బ! ఈ పూలను మించిన అందమైన పూలు ఎక్కడా లేవు!" అనేవాళ్ళు. ఇంకొందరు అమ్మాయిలు జాజిపూలను గుండుమల్లెలను ఇష్టపడేవాళ్ళు, "ఆహా! ఈ పూల అంద-చందాలు, వీటి సౌరభం చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది!" అనేవాళ్ళు.

ఇట్లా ప్రతిరోజూ కొందరు పారిజాతాలను, కొందరు ముద్దబంతులను, మరికొందరు కనకాంబరాలను, ఇంకొందరు చేమంతు-లను- ఇట్లా ఎవరి మనసుకు నచ్చిన పూలను వాళ్ళు మెచ్చుకునేవాళ్ళు. ఏ రోజున ఏజాతి పూలు మెప్పుకు గురి అవుతాయో, ఆ రోజున ఆ జాతి పూల మొక్కలు చాలా‌ ఆనందపడి, గర్వంగా‌ ఊగిసలాడేవి.

ఒకనాడు ఒక అమ్మాయి చేమంతులను మెచ్చుకుని, "ఇక్కడున్న ఈ పూల జాతులన్నీ ఈ చేమంతుల ముందు దిగదుడుపే! పూల జాతులన్నింటికీ ఇవే తల మానికాలు" అంది.

ఆ మాట వినగానే చేమంతులు ముసిముసి నవ్వులు నవ్వుతూ‌ గర్వంతో ఠీవిగా నిలిచాయి.

అది చూసి మిగిలిన పూల జాతులన్నీ "ఓ‌యబ్బో! ఈ అమ్మలక్కలకి చూసేకి కన్నులున్నాయా! సువాసన తెలిసేకి ముక్కులున్నాయా!"‌ అంటూ చిటపట-లాడుతూ వేళ్ళు విరిచి, ముఖం తిప్పుకున్నాయి.

వాటి మాటలు విని అన్నింటికీ దూరంగా, ఎత్తుగా ఉన్న మొగలిపొద "ఈ పిల్ల అమ్మాయిలకేం తెలుసు, నా బంగారు రేకుల పరిమళగంధాలు?! ఎందరెందరో గొప్పవాళ్ళు నా రేకుల్ని జడలకు అందంగా అమర్చుకుని, వాటిపైన మల్లెలు కూర్చి, అలాంటి పూలజడ అంతాన బంగారు బిళ్ళలు, ఊగిసలాడే జడ కుప్పెలు అమర్చుకుంటే, వారెవ్వ! ఆ సోయగాలకు అందరూ నోళ్ళు వెళ్ళబెట్టుకోవాల్సిందే గదా!" అని,

ఇంకా ఓపలేక "ఓయమ్మో! ఏ పూలమ్మలకైనా విష నాగులు చుట్టుకుం-టాయా! అసలు నాకున్నంత పరిమళం ఏ పూలకైనా ఉందా?" అని అక్కసుతో ఊగింది.

మొగలి మాటలు విని పూలమ్మలన్నీ కిలకిలా నవ్వాయి. ఇంత జరుగుతున్నా తనకేమీ పట్టనట్లు ఉండిపోయింది నాగజెముడు. పొదలాగా విస్తరించి, తన దళసరి ఆకుల నిండా చిన్న చిన్న సూదుల్లాంటి ముళ్ళతో, ఆకుల తలల్ని అంటుకొని పూచిన పసుపు పచ్చ పూలతో, తినమని ఆహ్వానించే ఎర్రెర్ర కాయలతో గంభీరంగా కదలక మెదలక స్థిరంగా ఉంది- ఎవ్వరితోటీ ఏమీ సంబంధం లేనట్లు.


కాల చక్రం తిరిగింది. ఋతువులు మారాయి. ఎండాకాలం వచ్చింది. నీళ్ళు తక్కువైనాయి; పూలమడులకు నీళ్ళు పెట్టడం తగ్గించాడు తోటమాలి. మొక్కలకు వేటికీ నీళ్ళు చాలడం లేదు.

మధ్యాహ్నానికల్లా అన్నీ అలసి, సొలసి, గుడ్లు తేలేసి, బిక్కుబిక్కు మంటూ‌ గుటకలు మ్రింగసాగాయి. ఆ సమయంలో బొటనవేలంత పరిమాణంలో‌ ఉన్న హనీబర్డ్ ఒకటి వేగంగా వచ్చింది ఆ తోటలోకి. దాని వెంట కూతురు కూడా ఉంది! తమ పొడవాటి ముక్కులను పువ్వుల్లోకి చొప్పించి, మకరందం కోసం వెతుక్కుంటూ పోతున్నాయి, అవి రెండూ. ఎన్ని పూలు వెతికినా వాటికి ఒక చుక్క మకరందం కూడా దొరకలేదు. చిన్న హనీబర్డ్ అలిసిపోయింది. అమ్మతో అన్నది-"అమ్మా! చాలా దాహంగా ఉంది. నాలుక తడారి పోతోంది. నేను ఇంక ఎగరలేను" అని.

తల్లి పక్షి బిడ్డను నాగజెముడు పొద దగ్గరికి తీసుకొచ్చి "ఇప్పుడింక నీకేం కాదు- వచ్చేసాంగా, నాగజెముడు దగ్గరికి!" అన్నది.

అంటూనే చటుక్కున అది నాగజెముడు దళసరి దళాన్ని ముక్కుతో‌ పొడిచింది. మరుక్షణం ఆ రంధ్రంలోంచి జటజటమని చిక్కటి ద్రవం ఉబికివచ్చింది. తల్లీ-బిడ్డ రెండూ ఆ జీవ జలాన్ని తనివి తీరా త్రాగాయి. చిన్న పిట్ట సంతోషం పట్టలేక ఆకాశానికి ఎగిరి కేరింతలు కొట్టింది. మళ్ళీ మళ్ళీ నాగజెముడు చుట్టూ తిరిగింది.

పూలమొక్కలన్నీ ఆ దృశ్యాన్ని కన్నార్ప-కుండా చూసాయి. పారిజాతం లిల్లీతో అంది‌ "చెల్లీ! ఆ‌ నాగజెముడుని చూశావా! నిండా ముళ్ళు వేసుకొని అది ఎంత వికారంగా ఉన్నా, చావు బతుకుల మధ్య ఉన్న ఆ చిన్ని పక్షి దాహం తీర్చి ప్రాణం పోసింది. మనమూ ఉన్నాము ఎందుకు?!" అంటూ వాపోయింది.

సంపంగి తల ఊపుతూ "నిజమే. ఇంతవరకూ మనం మన అందచందాలు, పరిమళాలు అంటూ మనకు మనమే విర్రవీగాం. నిజానికి మన పరిమళాల వల్ల ఎవరికీ ఏమీ ఒరిగేదీ లేదు. నిజమైన అందమంటే దీనిదే. నాగజెముడు జన్మ సార్థకం" అన్నది.

"అట్లా ఏమీ కాదు- ఎవరి ప్రత్యేకతలు వారివే. నిజంగా కూడా దేని అవసరం దానికి ఉంటుంది. గొప్పదైన ఈ సృష్టిలో విభిన్న ప్రత్యేకతలు ఉంటాయి. అన్నీ గొప్పవే!" అన్నాయి గులాబీలు, చేమంతులు.

నాగజెముడు మాత్రం వీళ్ళెవ్వరి మాటలూ వినట్లేదు- తనమీద వాలిన నల్లని గండు తుమ్మెదనే చూస్తూ ఉన్నదది. అటూ ఇటూ ఝుమ్మని తిరిగిన తుమ్మెద మెల్లగా తన పువ్వు మీద వాలి, మకరందాన్ని ఆస్వాదిస్తుంటే నిశ్చలంగా గమనిస్తూ, తనలో తనే సంతోషపడుతున్నది. మిగిలిన మొక్కలన్నీ కూడా దీన్ని చూస్తూ చూస్తూ మెల్లగా నిశ్శబ్దమైపోయాయి.

పొగడ్తలకు ఉబ్బిపోక, తెగడ్తలకు బాధపడక, తమ పనేదో తాము నిశ్చలమైన మనస్సుతో చేసుకుపోయే వారిలో ఆనందం, ఆత్మ సౌందర్యం ఉంటాయి.
బాహ్య సౌందర్యం కంటే అంతర సౌందర్యం గొప్పది.