అనగా అనగా ఒక గుడిలాంటి బడి. ఒకసారి ఆ బడికి ఆరు రోజులు సెలవు వచ్చాయి. తెలుగు ఉపాధ్యాయులవారు పిల్లలకు ఒక నియోజనం (అసైన్‌మెంట్) ఇచ్చారు. అదేమిటంటే, ఆ ఆరు రోజుల కాలంలోనూ తాము గ్రహించిన ఆరు మంచి విషయాలను గురించి విద్యార్థులు తమ సొంత మాటల్లో రాసుకుని రావాలి.

పిల్లలంతా సెలవల్లో తమ తమ ఊళ్ళకు వెళ్ళారు. అందరూ సెలవల్ని ఎంత హాయిగా గడిపారంటే, ఆ సంతోషంలో ఒక్కరికి కూడా తెలుగు నియోజనం సంగతి గుర్తుకు రాలేదు.

ఏడవ రోజున సెలవలు ముగిసేసరికి పాఠశాలకు చేరుకున్నారంతా. మొదటి పీరియడ్ లోనే తెలుగు.

తెలుగు మాస్టరు గారు తరగతిలోకి అడుగు పెట్టీ పెట్టగానే "నియోజనం చేసుకువచ్చారుగా, అందరూ?!" అని అడిగారు.

పిల్లలంతా నాలుకలు కొరుక్కున్నారు. తలలు దించుకున్నారు. "సెలవుల్లో పడి ఆ విషయమే మర్చిపోయామండి- ఆరు విషయాలు కాదు; ఒక్క విషయం కూడా రాసుకు రాలేదు" అని గొణిగారు.

"పోనీలే, పర్లేదు. ఒక్కొక్కరూ మీరు గమనించిన ఆరు సంగతులు చెప్పండి. దేని నుండి ఏమి నేర్చుకున్నారో చెబితే చాలు- ఇప్పుడింక ఏమీ రాయనక్కర్లేదు" అన్నారు తెలుగు ఉపాధ్యాయులవారు.

పిల్లలెవ్వరూ నోరెత్తలేదు. "ఆరు విషయాలంటే ఏంటి?" అని ఆలోచనలో పడ్డారు అందరూ.

ఉపాధ్యాయుడు విజయ్‌ వైపు చూసి "విజయ్‌! ఏదీ, ఈ సెలవల్లో నువ్వు గమనించి నేర్చుకున్న ఆరు సంగతులను వివరించు!" అన్నారు.

విజయ్‌ లేచి నిలబడి, "గురువు గారూ! నేను సెలవల్లో ఆ ఆరు విషయాలను గూర్చి ఏమీ ఆలోచించలేదండి. కాని నేను ఇవాళ్ళ బడికి వచ్చేటప్పుడు గమనించిన వాటిలో ఆరు సంగతులు చెప్తాను" అన్నాడు.

తెలుగు ఉపాధ్యాయులవారు చాలా సంతోషించారు: "ఏదీ?! వివరించు నాయనా!" అన్నాడు. "నేను ఇవాళ్ళ బడికి వస్తూంటే దారిలో కొన్ని చీమలు కనిపించాయి; కొన్ని చెట్లు కనిపించాయి; నేను భూమిని చూసాను; మరి ఇంకా చాలా పూలు కనిపించాయి; ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు; ఇంకా నేను 'కాలం' గురించి కూడా ఆలోచించానివాళ్ళ" చెప్పాడు విజయ్, వేళ్ళు మడిచి లెక్క పెట్టుకుంటూ.

"ఓహో! బాగుంది! అయితే ఆ ఆరింటి నుండీ నువ్వు ఏమేం సంగతులు గ్రహించావు?" అడిగారు తెలుగు మాస్టారు ఉత్సాహంగా.

"బడికి నడిచి వస్తుంటే నాకొక చీమల గుంపు కనిపించింది. అవన్నీ ఎంత క్రమశిక్షణతో ఒక దాని వెంట ఒకటి నడుచుకుంటూ పుట్టలోకి పోతున్నాయంటే, నేను వాటినే గమనిస్తూ కొంత సేపు నిల్చుండి పోయాను. "మనుషులకు కూడా ఈ చీమలకు ఉన్నంత క్రమశిక్షణ ఉంటే ఎంత బాగుంటుంది, ప్రతిదానికీ గుంపులు గుంపులుగా నెట్టుకొని తోసుకోకుండా?!" అనుకున్నాను.

తర్వాత నాకొక పండ్ల చెట్టు కనిపించింది ఒక ఇంట్లో. దానినిండా పుష్కలంగా పండ్లు ఉన్నై. ఆ పండ్ల బరువుకో, మరేమో- చెట్టు బాగా వంగిపోయి ఉన్నది. దాన్ని చూస్తే "ఎంత సంపదలున్నా, మనం కూడా ఈ చెట్టు మాదిరి వినయంగా వంగి నిలబడాలి" అనిపించింది.

అట్లా నడుస్తుంటే నాకు బీడుగా ఉన్న భూమి కనిపించింది, ఆ ప్రక్కనే పచ్చటి పొలం, అవతల ఒక అడవి, కొండలు కనిపించాయి.

దాన్నంతా చూస్తుంటే "ఈ భూమి ఎంత గొప్పదో కదా?! ఇంతింత బరువును, ప్రకృతిలోని ఇన్నిన్ని అంశాలను మోస్తూ కూడా ఏమాత్రం చలించట్లేదు! మనం కూడా ఈ భూమిలాగా ఎంత బరువునైనా మోసేంత సహనం అలవర్చుకోవాలి" అనిపించింది.

దారిలో నాకు వికసించి నవ్వుతూన్న పూలు చాలా కనిపించాయి. "అరే, ఈ పూలన్నీ కేవలం ఒక్క రోజు మాత్రమే కదా, బ్రతికేది? అయినా అవి ఎంత హాయిగా విరబూసి నవ్వుతూన్నాయో చూడు! మనం కూడా ఎన్నాళ్ళు బ్రతికినా ఒకరికొకరం సహాయం చేసుకుంటూ, నవ్వుతూ బ్రతకాలి" అనిపించింది వాటిని చూస్తే.

అంతలో అనుకోకుండా సూర్యుణ్ణి చూసాను. "సూర్యుడు వీటన్నిటికీ వెలుగులు పంచుతున్నాడు కదా, తనకు తాను ఏమి ఆశిస్తున్నాడు? మనం కూడా పదిమందికి సహాయం చేయాలి- తిరిగి ఏమీ ఆశించకూడదు" అనుకున్నానప్పుడు.

"కాలం గురించి చెప్పలేదు- " అన్నారు తెలుగు ఉపాధ్యాయులు, ముచ్చట పడుతూ.

"అదే సర్, కాలం అలుపు లేకుండా పరుగెత్తుతున్నది. అందువల్లనే కదా, సూర్యోదయం సూర్యాస్తమయం అన్నీ వస్తున్నాయి? మనిషి కూడా కాల‌ం మాదిరి అలుపెరగకుండా తన కర్తవ్యాన్ని నిర్వహించాలి" అన్నాడు విజయ్.

ఇదంతా విని గురువుగారు విజయ్‌ని దగ్గరకు తీసుకొని, "పిల్లలు తమ చుట్టూ ఉన్న విషయాల్లోంచి ఇన్నిన్ని గొప్ప సంగతులు నేర్చుకుంటుంటే ఇక పెద్దవాళ్ళకు అంతకంటే కావలసింది ఏముంటుంది? మన దేశానికే కాదు, ఈ ప్రపంచం మొత్తానికీ వన్నె తెచ్చే అద్భుతమైన వ్యక్తులు మీరు. భావి ప్రపంచ పౌరులు!" అన్నారు సంతోషంగా.