ఊరి చివరన కొలను ఒకటి ఉండేది. కొలనులో బాతు, కొంగ స్నేహంగా ఉండేవి. కొలనులో నీళ్ళు త్రాగేందుకు ఒక సింహం అక్కడికి వచ్చేది, రోజూ. దానికి బాతుని, కొంగని చూస్తే చాలా సంతోషం వేసేది.

"ఎట్లాగైనా వీటితో స్నేహం చేయాలి" అనుకునేది.
చివరికి ఒక రోజున సింహం వాటి దగ్గరికి వెళ్ళి అడిగింది- "మీతో స్నేహం చేద్దామని ఉంది నాకు" అని. బాతు వెంటనే "మేం నీళ్లలో జీవిస్తాము; నువ్వేమో నీళ్ళ బయట ఉంటావు; ఇక మనకి స్నేహం ఎట్లా కుదురుతుంది?" అనేసింది.

సింహం నిరాశతో వెనక్కి తిరిగింది. ఆలోచిస్తూ మెల్లగా వెళ్తోంది...

అంతలో చెరువు దగ్గరికి ఓ వేటగాడు వచ్చాడు. బాతు పైకి వల విసిరాడు. వలలో చిక్కుకున్న బాతు గట్టిగా అరిచింది. కొంగ ఏమి చేస్తుంది పాపం?! ఏమీ చేయలేక బాధ పడింది.

అయితే, బాతు అరుపులు విన్న సింహం గిరుక్కున వెనక్కి తిరిగి, కొలను వైపుకు దూకింది.

సింహాన్ని చూడగానే వేటగాడు భయంతో వణికిపోయాడు. వలని, బాతుని వదిలి పరుగు తీసాడు.

బాతు సంతోషించింది. ప్రమాదం నుంచి కాపాడిన సింహానికి బాతు, కొంగ కృతజ్ఞతలు తెలుపుకున్నాయి.

"మంచి మనసు ఉంటే చాలు" అని తెలుసుకుని, అవి రెండూ సింహానికి స్నేహితులైపోయాయి. అటుపైన స్నేహితులు మూడూ సంతోషంగా కాలం గడిపాయి!