లింగాపురంలో నివసించే వెంకన్న కూలిపని చేసేవాడు; మూటలు మోసేవాడు. అతని కొడుకు హరిధర్ చాలా మంచి పిల్లవాడు. చదువులో చాలా చురుకు; చేతి పనుల్లోనూ గట్టివాడే. కూలి పనిలో కూడా తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవాడు.

హరిధర్‌కు ఒక స్నేహితుడు ఉన్నాడు. అతని పేరు శశిధర్. శశిధర్ వాళ్ళ నాన్న లక్ష్మీపతిగారు బాగా డబ్బున్న వ్యాపారవేత్త. సమాజంలో బాగా పేరున్న వ్యక్తి.

అంతస్తుల్లో తేడాలున్నా, పిల్లల మధ్యకు ఏనాడూ రాలేదు అవి. చదువులో శశిధర్ ఓ మోస్తరుగా ఉండేవాడు; ఎంత చదివినా పాఠాలు సరిగా అర్థమయ్యేవి కావు అతనికి. అయినా శశిధర్‌కు ఏమీ బాధ లేదు- తనకు ఏది రాకపోయినా హరిధర్‌చేత మళ్ళీ మళ్ళీ చెప్పించుకునేవాడు. హరిధర్ కూడా 'నీకు ఎంత చెప్పినా ఎందుకు అర్థం కాదు?!' అని కోప్పడకుండా, శశిధర్‌కు రానివి అన్నీ చక్కగా తెలియజెప్పేవాడు.

ఒక రోజున లక్ష్మీపతి గారు మోటారుసైకిలు మీద పొరుగూరుకు వెళ్తూండగా అకస్మాత్తుగా దాని ముందు టైరు పంక్చరు అయింది. వాహనం అదుపు తప్పి రోడ్డు ప్రక్కన ఉన్న చెట్టుకొకదానికి గుద్దుకున్నది. లక్ష్మీపతిగారు వెంటనే స్పృహ తప్పారు.

సరిగ్గా ఆ ప్రక్క పొలంలోనే పని చేస్తున్నాడు వెంకన్న- ప్రమాదానికి గురైన లక్ష్మీపతిని చూసి గుర్తుపట్టాడు. గబగబా ఆయన్ని వైద్యశాలకు తీసుకెళ్ళాడు. "ఈయనకి రక్తం బాగా పోయింది. అర్జంటుగా రక్తం ఎక్కించాలి" అన్నారు డాక్టర్లు. వెంకన్న రక్తం గ్రూపు, ఆయన రక్తం గ్రూపు కూడా సరిపోయినై. ఏమాత్రం సంకోచించకుండా తన రక్తం ఇచ్చి ఆయన్ని కాపాడాడు వెంకన్న. కోలుకున్న లక్ష్మీపతిగారు "తనకు ప్రాణదానం చేసిన ఆ మంచి మనిషి వెంకన్న ఎవరు?" అని కొంచెం వెతికారుగానీ, ఆ సరికే వెంకన్న తన దారిన తాను వెళ్ళిపోయాడు. రెక్కాడితే కానీ డొక్కాడదు కద!

కొన్నాళ్ళకు శశిధర్ హరిధర్‌వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఇద్దరూ కలిసి దగ్గర్లోని గుట్టలకు అవతల తామర పూలకోసం వెతుక్కుంటూ పోయారు. చక్కగా విచ్చుకున్న తామర పూలు, బురద మధ్యలో ఉన్నై. వాటిని అందుకుందామని ముందుకు పోబోయాడు శశిధర్..

అయితే అవి ఉన్నది ఒక ఊబిలో! ఆ ఊబిలో కాలు పెట్టిన శశిధర్ ఇక అందులో కూరుకుపోయేవాడే! అయితే ప్రక్కనే ఉన్న హరిధర్ సమయస్ఫూర్తితో ఆ దగ్గర్లోని గడ్డితోటే గబగబా ఓ తాడును పేని, శశిధర్‌కు అందేట్లు వేసాడు. చివరికి ఇద్దరూ 'బ్రతుకు జీవుడా' అంటూ శశిధర్ వాళ్ల ఇల్లు చేరుకున్నారు. మిత్రుడికి తను వేసుకునే బట్టలు ఇచ్చి, భోజనానికి కూర్చోబెట్టాడు శశిధర్. అంతలోనే లక్ష్మీపతిగారు అక్కడికి వచ్చి హరిధర్‌ని చూసి ముఖం చిట్లించారు: "శశిధర్! ఎవరీ పిల్లాడు? వీడికి నీ బట్టలు ఎందుకు ఇచ్చావు? ఇంట్లో లోపల భోజనానికి ఎందుకు కూర్చోబెట్టావు? మనం తినే ప్లేట్లు పెట్టావేమి? వీళ్ళది ఏ కులం? వీళ్ల నాన్న ఏం పని చేస్తాడు?" అని ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు.

హరిధర్ చిన్నబోయాడు. "మేం ఇద్దరం ఒకే తరగతి సర్. ఇందాక వీడు, నేను ఏదో చిన్న ప్రమాదంలో చిక్కుకున్నాం. నా బట్టలకు బాగా మురికి అంటిందని వీడు తన బట్టలు ఇచ్చాడు. మా నాన్న వెంకన్న కూలి పని చేస్తాడు" అని చెప్పాడు భయం భయంగా.

"ప్రమాదమా?! ఏమైంది?" అని ఆదుర్దా పడిన లక్ష్మీపతిగారికి వీళ్ళు జరిగినదంతా చెప్పారు.

"అయినా పెద్దవాళ్ళు ఎవ్వరూ లేకుండా మీరు అట్లాంటి చోట్లకు వెళ్ళటం ఏమిటి?" అని అరిచిన లక్ష్మీపతిగారు "ఏంటో, మా రోజులు బాలేవు- మొన్నటికి మొన్న నాకు మోటారు సైకిలు యాక్సిడెంటు అయ్యింది. ఇవాళ్ళ వీడు ఇట్లా.." అన్నారు.

"అవునటండి- మా నాయన చెప్పాడు. ఆ రోజున మా నాయనేనట గదండి, మీకు రక్తం ఇచ్చింది?! ఇప్పుడు ఆరోగ్యం బాగున్నదాండి?" అడిగాడు హరిధర్ అమాయకంగా.

కంగారు, బాధ, కోపం అన్నీ కలిసిన ఆ క్షణాన లక్ష్మీపతిగారికి మానవత్వపు మొదటి పాఠాలు దొరికాయి: "కులాలు, మతాలు, గొప్ప-బీద తారతమ్యాలు ఇవన్నీ మనుషులు కల్పించుకున్నవి. ప్రకృతికి ఇవేవీ తెలియదు. అందరిలోనూ‌ ప్రవహించేది రక్తమే. అందరిలోనూ ఉండేది మనసే. ప్రశ్నల్లా 'మానవత్వం ఎవరిలో ఎంత పాలు ఉన్నది?' అనేది! ఆ పరీక్షలో తమకంటే ఈ పిల్లాడి కుటుంబానికి ఎక్కువ మార్కులు వస్తాయి. వీళ్ళకు సంపద లేకపోవచ్చు. కానీ ఆ సంపదల్ని మించిన మానవత్వం కొల్లలుగా ఉన్నది! వీలైతే తామూ అలాంటి మానవత్వాన్ని అలవరచుకోవాలి! మనసులో కట్టుకున్న అడ్డుగోడల్ని పగలగొట్టుకోవాలి!" అని.

"బాగున్నది బాబూ! ఇప్పుడు చాలా బాగున్నది. నీనుండి, మీ నాన్న నుండి నేను నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది. మీకు మేం ఏనాటికీ రుణపడి ఉన్నాం. అజ్ఞానం కొద్దీ నిన్ను ఏదేదో అన్నాను. నన్ను క్షమించు" అని ఏదేదో చెబుతూ కళ్ళనిండా నీళ్ళతో అక్కున చేర్చుకున్న లక్ష్మీపతిగారిని చూసి ఏమనాలో తెలీక అయోమయ పడ్డాడు హరిధర్.