దేవేంద్రపురంలో రిచా, భరత్ అనే దంపతులు నివసిస్తుండేవారు. భరత్ ప్రభుత్వ ఉద్యోగి. రీచా చదువుకున్నది, కానీ ఇంట్లోనే ఉండేది.

"ఆమె కూడా ఏదైనా ఉద్యోగం చేస్తే బాగుండును" అనుకునేవాడు భరత్. "ఇతనికి ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చే ఉద్యోగం వస్తే బాగుండును" అనుకునేది రిచా.

ఒకసారి వాళ్ళిద్దరూ‌ సినిమాకి వెళ్దామనుకున్నారు. "సాయంత్రం ఆఫీసు నుండి త్వరగా వచ్చేయి" అని చెప్పింది రిచా. "సరే" అని ఆఫీసుకెళ్ళాడు భరత్.

అన్నట్లుగానే సాయంత్రం ఆఫీసరునడిగి ఒక గంట ముందుగా బయలుదేరాడు ఇంటికి. అయితే దారిలో అతనికి ఎదురుగా వస్తున్న స్కూటర్ ఒకటి అదుపు తప్పింది. వంకరలు తిరుగుతూ పోయి ఓ చెట్టుకు గుద్దుకున్నది. దాన్ని నడుపుతూన్న మధ్యవయసు వ్యక్తి స్పృహ తప్పి నేలమీద పడిపోయాడు!

భరత్ వెంటనే అతని దగ్గరకు వెళ్ళి చూసి, అంబులెన్సుకు ఫోను చేసాడు. అది రాగానే తను కూడా వాళ్ళతో బాటు ఆసుపత్రికి వెళ్ళాడు; డాక్టర్లతోటీ, పోలీసులతోటీ మాట్లాడాడు; తనకు చేతనైనంత సాయం చేసాడు; రాత్రి బాగా చీకటి పడ్డాక ఇల్లు చేరుకున్నాడు.

ఇంటికి వచ్చేసరికి ఇంట్లో రిచా అలిగి కూర్చొని ఉన్నది. "సినిమా కోసం త్వరగా వస్తానన్నావు- ఎందుకు రాలేదు?!" అని పోట్లాట పెట్టుకున్నది. జరిగినదంతా చెప్పేందుకు ప్రయత్నించాడు భరత్. కానీ ఆమె వినలేదు- "నీకు నాకంటే ఊళ్ళోవాళ్ళే ఎక్కువయ్యారు!" అని ఏడ్చింది. భరత్ "అయ్యో! దేవుడా!" అని తలపట్టుకున్నాడు.

గొడవ చిలికి చిలికి గాలివాన అయ్యింది. రిచా రాత్రికి రాత్రి "నేను మా పుట్టినింటికి వెళ్ళిపోతాను. నేనంటే ఇష్టంలేని దగ్గర నేనెందుకుంటాను" అంటూ బట్టలు సర్దుకోవటం మొదలుపెట్టింది. భరత్ ఆమెను ఆపేందుకు కొంచెం ప్రయత్నించాడుగానీ, కొద్ది సేపటికి అతనూ సహనం కోల్పోయాడు- "పో! నువ్వెటు పోతావో నేనూ చూస్తాను!" అని అరిచాడు.

దాంతో రిచాకు కోపం ఇంకా పెరిగిపోయింది."నీతో నాకు పనే లేదు. నేను ఇంకెప్పటికీ రానే రాను" అని ఆవేశంగా అరిచి, ఇల్లువిడిచి బయలుదేరింది. బస్టాండుకు పోతూ పోతూ దారిలోంచే తన తల్లిదండ్రులకి ఫోను చేసింది. "నువ్వు ఇక్కడికి వచ్చి చాలా రోజులైందిగా, ముందు బయలుదేరి వచ్చేయి తల్లీ, గొడవ సంగతి మళ్ళీ చూద్దాం" అన్నారు వాళ్ళు.

ఫోనులోకి మాట్లాడుతూ పరాకుగా ఉన్న రిచా తన వెనకే వస్తున్న బస్సును గమనించలేదు. బస్సు డ్రైవరు కొట్టిన హారన్ ఆమెకు వినిపించలేదు. బస్సు వచ్చి తగిలేసరికి ఆమె క్రింద పడిపోయింది. చుట్టూ ఉన్నవాళ్ళు ఆమెను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. రిచాకు తెలివి వచ్చాక, భరత్‌కు ఫోను చేసింది. తనను ఆస్పత్రిలో చేర్చినవాళ్లందరికీ ధన్యవాదాలు చెప్పింది.

హడావిడిగా వచ్చాడు భరత్. ఫోను చేసి రిచా తల్లిదండ్రులతో మాట్లాడాడు. తెల్లవారేసరికి వాళ్ళు కూడా అక్కడికి చేరుకున్నారు.

"నన్ను క్షమించండి. సినిమా తప్పిపోయిందన్న కోపంతో ఏమేమో అన్నాను. ప్రాణాల్ని కాపాడటన్ని మించిన ధర్మం ఏదీ లేదని అర్థమైంది నాకిప్పుడు" అన్నది రిచా, తన ప్రవర్తనకు సిగ్గు పడుతూ.

"చూసావు కదా రిచా, మనం ఒకరికి సహాయం చేస్తే మనకు ఇంకొకరు సాయం చేస్తారు. సాయం చేసేటప్పుడు వేరే ఏదీ ఆలోచించలేము- అట్లా ఆలోచిస్తే సాయమూ చెయ్యలేము!" అన్నాడు భరత్.

"అసలు ఈ సినిమాల పిచ్చిని అనాలి- ఇదంతా జరిగింది ఆ సినిమా పిచ్చి వల్లనే!" అన్నారు రిచా నాన్నగారు తన మామూలు ధోరణిలో.