రామయ్య ఎల్లమ్మ అనే దంపతులకు సంతానం లేదు. చాలా నోములు, వ్రతాలు చేశాక, డాక్టర్ల చుట్టూ తిరిగాక, చివరికి వాళ్ల కలలు ఫలించి కొడుకు పుట్టాడు. వాడికి 'రాజు' అని పేరుపెట్టారు. చాలా గారాబంగా పెంచారు.

రాజు పెద్దయ్యాక, వాడికి పెళ్ళి వయసు రాగానే, లలిత అనే ఓ చక్కని అమ్మాయిని ఇచ్చి పెళ్ళి చేసారు. కొడుకు-కోడలు సుఖంగా కాపురం చేస్తుంటే, తాము కాలు మీద కాలు వేసుకొని బ్రతకచ్చని ఆశ పడ్డారు రామయ్య-ఎల్లమ్మ.

అయితే 'ఏమీ లేని చోట సమస్యలు ఉంటాయి' అన్నట్లు, లలితకు ఎందుకనో అత్త మామలంటే సరిపోలేదు.

రాజు ఎప్పుడూ తల్లిదండ్రులమాటే పట్టించుకుంటాడని అలగటం మొదలు పెట్టింది. చివరికి రాజుని తన దిక్కుకు తిప్పుకున్నది. ఒకరోజున "ఈ ముసలి వాళ్ళు ఇక్కడ ఉంటే చాకిరీ చెయ్యటం కష్టం. ఇట్లాంటి వాళ్ల కోసమే 'వృధ్దాశ్రమం' అని అదేదో‌ పెట్టారట. అందులో వేద్దాం" అన్నది. ఆ సరికి భార్యకు పూర్తిగా లోబడిన రాజు సరేనన్నాడు. తల్లిదండ్రులను తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో వదిలిపెట్టాడు.

…. కొన్ని రోజులకు రాజు-లలితలకి ఒక కొడుకు పుట్టాడు. వాడి పేరు రవి. రవికి లేని చెడు అలవాట్లు లేవు. పెద్దలంటే గౌరవం లేదు; ఇతరులు బాగు పడితే చూడలేక-పోయేవాడు; నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పేవాడు. వాడిని పెంచి పెద్ద చేసేందుకు రాజు-లలిత చాలా కష్టపడాల్సి వచ్చింది. చివరికి ఎట్లాగో అట్లా తంటాలు పడి, 'రజిత' అనే చక్కని కోడల్ని చూసి, రవికి ఇచ్చి పెళ్ళి చేశారు.

రజిత చిన్న పిల్ల; చాలా కోప స్వభావి. "భర్త చెడు అలవాట్లకు కారణం వీళ్ళే" అని కూడా‌ ఆమెకు అత్తమామలంటే విపరీతమైన ద్వేషం ఉండేది.

కొన్నాళ్ళు గడవగానే "ఈ ముసలివాళ్లను ఇద్దరినీ తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో వేసి రండి" అని రవితో పోరటం మొదలుపెట్టింది. "వీళ్ళంటే నాకేమీ ప్రేమ లేదు. ఉంటే ఏదో, 'నీకు సాయం చేస్తారు కదా' అనుకున్నాను. నువ్వు వద్దంటే ఇప్పుడే తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో వదిలేస్తాను!" అన్నాడు రవి.

వృధ్దాశ్రమానికి తీసుకెళ్ళేటప్పుడు రాజు-లలిత ఇద్దరూ రవిని చాలా బ్రతిమిలాడారు: "మేం‌ ఊరికే ఇంట్లో పడి ఉంటాం, అస్సలు నోరు ఎత్తం, నిన్నుగానీ, రజితనుగానీ పల్లెత్తు మాట కూడా అనం. మమ్మల్ని మీతోనే ఉండనివ్వండి" అని ప్రాధేయపడ్డారు.

అయినా రవి వినలేదు. తల్లిదండ్రులను తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలోనే వదిలాడు. రాజు-లలిత ఇద్దరూ అక్కడ లెక్కలేనన్ని ఇబ్బందులు పడ్డారు...

…. అంతలో రాజుకి మెలుకువ వచ్చింది. చూస్తే తను ఇంకా యువకుడే.. లలిత కూడా ఏమంత పెద్దకి కాలేదు. ఇద్దరికీ పిల్లలు పుట్టలేదు ఇంకా. ఇంకా రామయ్య-ఎల్లమ్మ బ్రతికే‌ ఉన్నారు. నిన్ననే తను వాళ్లని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో వేసాడు.. తనకు వచ్చిందంతా పెద్ద కల!

అతను వెంటనే లలితకు తన కల సంగతి చెప్పాడు. "అమ్మానాన్నల్ని వృద్ధాశ్రమంలో ఉంచద్దు. వెనక్కి తెచ్చి మనతోబాటే ఉంచుకుందాం. మన బాధ్యతని మనం మర్చిపోరాదు" అన్నాడు. ఆ సరికి తన తప్పు అర్థమైన లలితకూడా సరేనన్నది. రామయ్య ఎల్లమ్మ మళ్ళీ ఇల్లు చేరుకున్నారు!