స్వతంత్ర భారతదేశానికి మొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన డా. భీమ్‌రావ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా మనందరికీ సుపరిచితుడు. చెప్పులుకుట్టే "మెహర్" కులానికి చెందినవాడు అంబేద్కర్. అంటరానితనం కారణంగా ఎనలేని కష్టాలకు అవమానాలకు గురైన భీంరావు, తర్వాతి కాలంలో పీడిత జాతులకు తమవైన హక్కుల్ని అందించిన మానవతామూర్తిగా ఎదుగుతాడని, మన వ్యవస్థకు పునాది అయిన రాజ్యాంగాన్ని తన చేతుల మీదుగా అందించి చిరస్మరణీయుడౌతాడని, అప్పట్లో ఎవ్వరూ ఊహించి ఉండరు.

రామ్‌జీ-భీమాబాయి దంపతుల పధ్నాలుగో సంతానమైన భీమ్‌రావ్ అర్ధరాత్రి పన్నెండు గంటలకు పుట్టాడట. అతను పుట్టేసరికి నక్షత్రాలు, గ్రహాలు ఏమాత్రం సరిగ్గా లేవు. తల్లి భీమాబాయి ఈ పిల్లవాడి కారణంగా చనిపోతుందని ఎవరో జ్యోతిష్కులు చెప్పటం, తండ్రి, సోదరులు అందరూ అతన్ని వేరేగా చూడటం.. అట్లా మొదలయ్యాయి అంబేద్కర్ కష్టాలు.

ఆయన తండ్రి రామ్‌జీ బ్రిటీషు సైన్యంలో సుబేదారుగా పనిచేసేవాడు. అయితే భీమ్‌రావ్‌కి ఐదేళ్ళు వచ్చేవరకూ బ్రతికింది భీమాబాయి. ఆవిడ పోయేసరికి వాళ్లకున్న పధ్నాలుగు మంది పిల్లల్లోను ఐదుగురు మాత్రమే బ్రతికారు. ఈ ఐదుగురు పిల్లలూ వాళ్ల మేనత్త దగ్గరే పెరిగారు- ఏమంటే తండ్రి మళ్లీ పెళ్లి చేసుకున్నాడు.

భీంరావు చిన్నప్పుడు కూడా చాలా శ్రద్ధగా చదువుకునేవాడు. బలే తెలివిగా ఉండేవాడు. అయినా కులం కారణంగా అనేక అవమానాలకు గురైనాడు. తరగతిలో మిగతా పిల్లలకు దూరంగా, మూలగా కూర్చోవలసి వచ్చింది; నేలమీద పరుచుకునేందుకు తన జంపకానా తానే‌ తెచ్చుకోవలసి వచ్చింది; పిల్లలందరూ నీళ్లు తాగే కొళాయిని అతను ముట్టుకోరాదు: బడిలో పనిచేసే ఉద్యోగి ఒకడు అతని కోసం కుళాయి తిప్పేవాడు. ఏనాడైనా ఆ ఉద్యోగి గనక రాకపోతే, ఇక ఆ రోజంతా భీమ్‌రావ్ మంచినీళ్లు తాగేకి వీల్లేదు! భీమ్‌రావ్‌కి, కాని వాళ్ల ఇంట్లో వాళ్లకి కాని, మంగలి వాళ్లు ఎవరూ క్షవరం చేసేవాళ్లు కాదు! భీమ్‌రావ్ జుట్టును వాళ్ల అక్కే కత్తిరించేది.

అంబేద్కర్‌కి తొమ్మిది ఏళ్లున్నప్పుడు, వాళ్ల అన్నతోటీ, మేనల్లుళ్ళతో కలసి మొదటిసారిగా రైలు ప్రయాణం చేసాడట. కొత్త ఇంగ్లీషు బట్టలు, మెరిసే టోపీలు, కొత్త చెప్పులు, జరీ ధోతీలు వేసుకొని, మెరిసిపోతున్న పిల్లల్ని చూసి అందరూ 'ఉన్నత కులం వాళ్ళు' అనుకున్నారట. అయితే వాళ్లు రైలు దిగగానే అక్కడి రైల్వే స్టేషన్ మాస్టరు వాళ్ల కులం అడిగి తెలుసుకున్నాడు.

అంతే- ఇక ఎవ్వరూ వాళ్లతో మాట్లాడేందుకు ఇష్టపడలేదు! అక్కడ ఉన్న ఎద్దుల బండ్ల వాళ్లు ఎవరూ వీళ్లని బళ్ళలో ఎక్కించుకోలేదు! అతి కష్టం మీద, అక్కడ పనిలేకుండా ఉన్న ఒక బండివాడు ఒకడు ఎక్కువ డబ్బులకు ఒప్పుకున్నాడు.

కానీ బండిని మటుకు వీళ్లే నడుపుకోవాలి- ఆ బండిని తను ఎక్కడు- తను ఆ బండి ప్రక్కనే నడుస్తూ వస్తాడట! అట్లా ఒక రోజంతా ప్రయాణించిన తర్వాత వాళ్ల నాన్న పని చేసే 'గోరేగాం' చేరుకున్నారు వాళ్ళు: ఆ ప్రయాణం మొత్తం మీద ఎవ్వరూ వాళ్లకు ఒక్క చుక్క మంచి నీళ్లు కూడా ఇచ్చేందుకు ఇష్టపడలేదు!

ఈ కష్టాలన్నీ భరించలేక, ఇల్లు వదిలి పారిపోయి బొంబాయిలో బట్టల మిల్లులో పనిచేద్దామనుకున్నాడట భీంరావు.

అందుకుగాను అత్త పర్సులో డబ్బులు దొరుకుతాయోమోనని వెతికాడట కూడా! అయితే అదృష్టం కొద్దీ అందులో ఎక్కువ డబ్బులు లేవు. "అదే క్షణంలో నాకు అవమానం, సిగ్గు అనుభవానికి వచ్చినాయి. నేను పారిపోయే ఆలోచనను విరమించుకున్నాను" అని రాసుకున్నాడాయన. ఈ సంఘటనతో ఆయనకు చదువుల పట్ల శ్రద్ధ కుదిరింది.

ఆ తర్వాత కొన్నేళ్ళకు, హైస్కూల్ చదువుల కోసమని ఆయన బొంబాయి చేరాడు. అప్పుడు కూడా అంటరాని తనం ఆయన్ని వెంబడిస్తూనే ఉండింది. సంస్కృత పండితులు ఎవ్వరూ అతనికి పాఠాలు చెప్పేందుకు ఇష్టపడలేదు! అయితే దాని వల్ల కూడా ఆయనకు మేలే జరిగింది: పర్షియన్ నేర్చుకునే అవకాశం చిక్కింది!!

మన దేశంలో సనాతనంగా వస్తున్న కులవ్యవస్థ బరువుకు అణగిపోయిన కులంలో పుట్టి, అన్ని రంగాలలోనూ వివక్ష ఎదుర్కొన్నా కూడా, మొక్కవోని ధైర్యంతో తమ వారి హక్కులకోసం నిలబడి, ఏ రకంగా చూసినా అంటరానితనానికి ఎలాంటి సమంజసత్వమూ లేదని నిరూపించిన మానవతా వాది అంబేద్కర్. అంటరానితనం నిర్మూలనే ప్రాతిపదికగా అనేక చట్టాలను రూపొందించి, ఆ క్రమంలో వివిధ దేశాల న్యాయ విధానాల్ని, సంస్కృతుల్ని, చరిత్రని అధ్యయనం చేసి, 'తెలివి ఏ ఒక్కరి సొత్తూ కాదు' అని నిరూపించి, మన దేశానికి మార్గ దర్శనం చేసిన మేధావి, భారతరత్న- బాబాసాహెబ్ డాక్టర్ భీమ్‌రావ్‌ అంబేద్కర్‌ చిరస్మరణీయుడు.

అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలతో, కొత్తపల్లి బృందం.