ధర్మవరంలో సీత-రాముడు అనే భార్యాభర్తలు ఉండేవాళ్ళు. కొన్ని తరాల పాటు కూర్చొని తిన్నా తరగనంత ఆస్తి ఉంది వాళ్ళకు. అయితే వాళ్ళు చాలా మంచి వాళ్ళు. ఎవరికి ఏ కష్టం వచ్చినా భరించలేరు. సంగతేంటో తెలుసుకొని వాళ్ళకు సహాయం చేసేవాళ్ళు.

అంత మంచి వాళ్లకు ఒకటే లోటు. పెళ్లై పది సంవత్సరాలు అయినా వాళ్లకు పిల్లలు పుట్టలేదు. పిల్లలకోసం వాళ్ళు తిరగని గుళ్ళు లేవు, చుట్టని గోపురాలు లేవు, వాడని మందులు లేవు, మ్రింగని మాత్రలు లేవు.

అట్లా తిరిగి తిరిగి వేసారాక, వాళ్ళు ఒకసారి తీరికగా ఆలోచించి, "పిల్లల కోసం మనం ఇంత తపించవలసిన అవసరం లేదు. వేరే వాళ్ల పిల్లల్ని పెంచుకోవచ్చు, వాళ్ళని మన పిల్లల్లాగే బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దచ్చు కదా, దానిదేముంది?" అనుకున్నారు.

సరిగ్గా వాళ్ళు అట్లా అనుకునే సమయానికి, వాళ్ళు ప్రయాణిస్తున్న కారు కింద పడ్డాడు, ఒక పిల్లాడు. ఆ ప్రమాదంలో వాడికి బాగా దెబ్బలు తగిలాయి. సీత-రాముడు ఇద్దరూ వాడిని గబగబా ఆస్పత్రికి తీసుకెళ్ళారు. "గాయాలు చిన్నవే, ఏమీ పర్లేదు.

ఒకటి రెండు రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది" అన్నారు డాక్టరుగారు. దాంతో దంపతులు ఇద్దరూ వాడిని తమ ఇంటికి తీసుకెళ్ళారు.

కొంచెం తేరుకున్నాక, వాడి గురించి అడిగి తెలుసున్నారు- వాడికి ఎనిమిదేళ్ళు. పేరు రంగడు. వాడిది అక్కడికి దగ్గర్లోనే, అడవిలో ఉన్న ఊరు. వాడి అమ్మ నాన్నలు ఇద్దరూ అడవిలోనే ఉన్నారు. వాళ్ళిద్దరూ అడవిలోనే కూరగాయలు, పూలు పండించి, వాటిని దగ్గరి పల్లెల్లో తిరిగి అమ్ముతారు.

పది రోజుల క్రితం రంగడి తల్లి వాడిని మొక్కలకు నీళ్ళు పెట్టమన్నది. రంగడు. ఆ పని చెయ్యక, ఊరికే ఇంట్లోకి పరుగు పెట్టబోయాడు. అంతలోకే కాలు జారటం, వాడు కాస్తా పూల మొక్కల మీద పడి పోవటం, ఆ మొక్కలన్నీ విరిగి పోవటం- చక చలా జరిగిపోయాయి.

రంగడికి వాళ్ళ అమ్మ అంటే చాలా భయం. మొక్కలు విరగ్గొడితే వాళ్ళ అమ్మ ఊరుకోదు! అందుకని ఆమె చూడకముందే విరిగిపోయిన ఆ మొక్కల్ని తీసి బయట పడేయాలని బయలు దేరాడు వాడు.

అయితే అమ్మ వాడి అల్లరి పనిని చూడనే చూసింది; కోపంతో నాలుగు దెబ్బలు కూడా వేసింది. దాంతో రంగడికి కోపం వచ్చింది; బాధ వేసింది. వెంటనే అలిగి, ఇల్లు విడిచిపెట్టేసి అడవిలోకి బయలు దేరాడు వాడు. అయితే వాడి దురదృష్టం కొద్దీ, అడవిలో కుక్క ఒకటి వాడి వెంట పడ్డది.

దాంతో వాడు తోచిన దిక్కుకల్లా పరుగు తీసి, చివరికి ఈ ఊరు చేరుకున్నాడు. వెనక్కి తిరిగి చూసుకుంటూ నడిచాడు; చివరికి వీళ్ళ కారు క్రింద పడ్డాడు'- అదీ సంగతి.

అయితే ఇప్పుడు వాడిని వాళ్ల ఇంటికి తీసుకెళ్ళి దిగబెట్టేందుకు సీత-రాములకు మనసు రాలేదు. "మనం ఎవరినైనా పెంచుకుందామనుకున్నాం కదా, అందుకని దేవుడు మనకోసమే వీడిని పంపిన-ట్లున్నాడు" అనుకున్నారు వాళ్ళు.

"నువ్వు మాతోటే ఉంటావా? నిన్ను బాగా చూసుకుంటాం" అని చెబితే, వాడు ఉంటానన్నాడు. దాంతో భార్యాభర్తలిద్దరూ సంతోషపడి, వాడు ఉండేందుకు వసతి గట్రా ఏర్పరచారు.

అట్లా ఒక రెండు రోజులు గడిచాయి. కానీ అంతలోనే రంగడు వాళ్ళ అమ్మ నాన్నల మీద బెంగ పెట్టుకున్నాడు. రోజూ రాత్రిపూట ఏడవటం మొదలు పెట్టాడు. చివరికి దంపతులు ఇద్దరూ బేజారైనారు. వాడిని తల్లి దండ్రులనుండి వేరుచేసి తమతోటే ఉంచుకోవాలనుకున్న ఆలోచన-లకు సిగ్గుపడ్డారు, వాడిని కారులో ఎక్కించుకొని, వాళ్ళ ఇంటికి చేర్చేందుకు బయలు దేరారు!

దారిలో రంగడికి చెప్పారు- "చూడు బాబూ! అమ్మా నాన్నలు మన మంచిని కోరి రకరకాల సంగతులు చెబుతారు: ముద్దుగా చెబుతారు, కోపంగా చెబుతారు, తిడతారు, ఒక్కోసారి కొడతారు- అంత మాత్రానికే మనం అలిగి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకూడదు-

ప్రపంచం ఏమంత సరళంగా ఉండదు బాబూ!‌ ఊరికే అలగటం, ఇల్లువిడిచి పారిపోవటం లాంటివి ప్రమాదం!" అని. రంగడు కూడా సిగ్గుపడ్డాడు. తెలివి తెచ్చుకున్నాడు. "ఇంకెప్పుడూ అట్లాంటి పొరపాటు చేయను" అని మాట ఇచ్చాడు.

పన్నెండు-పదమూడు రోజుల తర్వాత క్షేమంగా ఇల్లు చేరిన రంగడిని చూసి వాళ్ళ అమ్మానాన్నలు చాలా సంతోషపడ్డారు.

సీత-రాములకు పదే పదే ధన్యవాదాలు చెప్పుకున్నారు. మేం వాడికోసం ఎంత వెతికామో! చూసి చూసి మా కళ్ళు కాయలు కాచాయి" అన్నారు. వాళ్ళ ప్రేమని చూసి సీతారాముల కళ్ళు చెమర్చాయి.

రంగడిని ఇంట్లో దింపి వచ్చాక దంపతులు ఇద్దరూ చిన్నబోయారు. దేవుడు తమకోసమే ఇచ్చాడనుకున్న పిల్లవాడాయె! వాడిని తిరిగి వాళ్ళింటికి పంపేసి "మంచి చేసామా, చెడు చేసామా?" అని ఒకటే ఆలోచించారు.

అయితే అంతలోకే వాళ్లకు శుభ శకునాలు కనిపించాయి. వాళ్ల ఎదురు చూపులు ఫలించాయి. సీతమ్మ గర్భం ధరించింది. కొన్ని నెలలకు చక్కని అమ్మాయి పుట్టింది వాళ్లకు!