జమీందారు రంగారావుగారికి ఒక్కగానొక్క కూతురు లత. తను ఐదవ తరగతి చదువుతున్నది. లత ఎప్పుడూ గొప్పలు చెప్పుకుంటుండేది; తనను మించిన వాళ్లు ఎవరూ లేరని అనుకునేది. బడిలో తోటి పిల్లలతో ఎవరితోటీ సరిగ్గా ఉండేది కాదు. ఎప్పుడూ ఇతరులను చులకనగా చూసేది.

ఐదో తరగతిలోనే గీత, రమ్య, జ్యోతి అనే ముగ్గురు పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళు ముగ్గురూ అందరితోటీ చక్కగా స్నేహంగా ఉండేవాళ్ళు.

లత మటుకు అవకాశం దొరికినప్పుడల్లా లత ఊరికే వాళ్లను ఆట పట్టిస్తూ ఉండేది: 'నువ్వు ఎంత పొట్టిగా ఉన్నావో‌ చూడు!' 'నువ్వు బొగ్గులాగా ఎంత నల్లగా ఉన్నావు!' 'లావు- లావు' అంటూ వాళ్లను ఏడిపించేది. అయినా వాళ్ళు పాపం మంచివాళ్ళు కదా, అందుకని లతని ఏమీ అనేవాళ్ళు కాదు.

ఆ పిల్లలు ముగ్గురూ సైకిల్ మీద బడికి వెళ్లేవాళ్లు. దారిలో ఒక చోట రోడ్డు ఎత్తుగా ఉండేది. అక్కడ మటుకు సైకిలు తొక్కటం బాగా శ్రమ అయ్యేది. అయితే లతకు ఆ శ్రమ లేదు. వాళ్ళ నాన్నకు కారు కూడా ఉన్నది: రోజూ వాళ్ల నాన్న లతని కారులో బడి ముందు దించి వెళ్ళేవాడు.

ఒక రోజు గీత, రమ్య, జ్యోతి ముగ్గురూ బడికి పోతుండగా, లత ఉన్న కారు వాళ్లని దాటుకొని ముందుకు పోయింది. అందులో‌ కూర్చున్న లత వాళ్ల నాన్నని కారు ఆపమని; అద్దం దించి, తల బయటికి పెట్టి చూస్తూ- "ఏంటి?! మీరు సైకిళ్ళు ఇంత మెల్లగా తొక్కుతున్నారు?! నా దగ్గర కూడా ఒక సైకిల్‌ ఉంది. మీ సైకిళ్ల కంటే చాలా వేగంగా పోతుందది. రేపు నేను ఆ సైకిల్ వేసుకొని వస్తాను- అప్పుడు చూడండి, నా సైకిల్‌ ఎంత బాగుందో, నేను దాన్ని ఎంత వేగంగా తొక్కగలనో!" అన్నది గొప్పగా.

పిల్లలు ముగ్గురూ ఆ పాప మాటల్ని పట్టించుకోలేదు. అయితే పంతాలమారి లత మరుసటి రోజున బడికి నిజంగానే సైకిల్ మీద బయలుదేరింది!

కానీ అంతగా అలవాటు లేదు కదా, సైకిలు తొక్కటం పాపం బాగా కష్టం అయ్యింది తనకు. అయినా పట్టుదలగా ముందుకే పోయిన లతకు మెల్లగా సైకిళ్ళు తొక్కుకుంటూ‌ పోతున్న గీత, రమ్య, జ్యోతి కనిపించారు.

అప్పుడిక లత గబగబా పోయి వాళ్ళను చేరుకొని, "ఇప్పుడు చూడండి! నా సైకిల్ ఎంత బాగా పోతుందో! నేను ఎంత వేగంగా తొక్కుతానో చూస్తూండండి!" అని గొప్పలు పోతూ, చకచకా వాళ్లను దాటుకొని ముందుకు వెళ్ళిపోయింది. అయితే ఆ హడావిడిలో తన సైకిలు టైరుకు ఎదురుగా ఉన్న పదునైన రాయిని ఒకదాన్ని తను చూసుకోనేలేదు! సైకిలు ఆ రాయి మీదికి ఎక్కటం, ముందు టైరుకు గుచ్చుకొని పంచరవ్వటం, 'చుయ్య్...' మంటూ గాలి పోవటం- అన్నీ టకటకా జరిగిపోయాయి!

ఆ శబ్దం ఏంటో కూడా తెలీదు లతకి. అయితే ముందు చక్రంలో గాలి పోయేసరికి బ్యాలన్సు నిలవలేదు- నాలుగు మెలికలు తిరిగి సైకిలు తటాలున క్రింద పడబోయింది! చివరికి ఎలాగో ఒకలా సైకిలును ఆపిన లత, 'ఇంక బడికి ఆలస్యం అవుతుంది- ఎలాగ?!' అంటూ ఏడవటం మొదలుపెట్టింది.

గీత, రమ్య, జ్యోతి "ఇప్పుడు ఏమైంది? ఎందుకు, ఏడవటం?!" అని అడిగారు. "సైకిలు పాడైంది! ఇప్పుడెలాగ? బడికి ఆలస్యమైపోతాను!" చెప్పింది లత, ఏడుస్తూ.

రమ్య ఆమెను ఓదారుస్తూ "ఏడవకు, ఏమీ పర్లేదు- నువ్వు నా సైకిల్ వెనక ఎక్కి కూర్చో. నేను నిన్ను బడికి తీసుకు పోతాను. వీళ్ళు నీ సైకిలును బడికి చేర్చుతారు" అని ఓదార్చింది.

"అవును లతా! ఏమున్నది, మేం తెస్తాంలే, నీ సైకిలును!" అన్నారు గీత, జ్యోతి.

వాళ్ల మంచితనం లత మొండి మనసును కరిగించింది. "నేను మిమ్మల్ని చాలా సార్లు వెక్కిరించాను. అయినా మీరు నాకు సహాయం చేస్తున్నారు. నన్ను క్షమించండి. నేను ఇంకెప్పుడూ ఎవ్వరినీ చిన్నచూపు చూడను" అంటూ క్షమాపణ కోరింది ఏడుస్తూనే.

గీత, రమ్య, జ్యోతి ఒకరి మొఖాలు ఒకరు చూసుకొని గట్టిగా నవ్వారు. "బలే ఉన్నావు తల్లీ! అంత పెద్ద పెద్ద మాటలు అవసరమా? పద- బడికి టైమైపోతుంది" అని లతని ఉత్సాహపరచారు. నలుగురూ ముందుకు సాగారు.

ఆ తర్వాత లత చాలా మారింది. పిల్లలందరితోటీ కలిసిపోయింది. అందరి కష్టసుఖాల్లోనూ పాలు పంచుకున్నది. ఇప్పుడు బళ్ళో ఆ పాపకు ఎందరు స్నేహితులో లెక్కలేదు!