ఆనందపురం నగరాలకు చాలా దూరంగా ఉండే ఒక కుగ్రామం. అక్కడి ప్రజలు ఎక్కువ శాతం మంది రైతులు. కులమత భేదాలు లేకుండా అందరూ చక్కగా కలసి మెలసి జీవించేవాళ్ళు. ఒకరి కొకరు సహాయం చేసుకునేవాళ్ళు.

అయితే కొన్నేళ్ల క్రితం గోవిందయ్య అనే వడ్డీ వ్యాపారి ఒకడు ఆ ఊరికి వచ్చి స్థిరపడ్డాడు. రైతులకు వడ్డీలకు డబ్బులు అప్పివ్వటం మొదలు పెట్టాడు. రైతులందరూ మంచివాళ్ళు, నిజాయితీ పరులు కాబట్టి, ఒక్కరు కూడా అతనికి ఇవ్వాల్సిన డబ్బులు ఎగగొట్టలేదు. దాంతో తక్కువ కాలంలోనే గోవిందయ్య పెద్ద ధనవంతుడు అయ్యాడు.

'డబ్బు అహంకారానికి హేతువు' అని చెబుతారు. రాను రాను గోవిందయ్యలో అహంకారం వేళ్ళూనుకున్నది. 'ఊళ్ళో జనాలంతా తన దయా దాక్షిణ్యాల వల్లే బ్రతుకుతున్నారు' అనుకోవటం మొదలుపెట్టాడతను.

పనివాళ్ళని, పాలవాళ్ళని, వృత్తికారుల్ని అందరినీ చులకనగా చూడటం మొదలుపెట్టాడు. ప్రతివారితోటీ అహంకారంగా మాట్లాడసాగాడు. దొరికిన వాళ్ళనల్లా రాచి రంపాన పెడుతున్నాడిప్పుడు.

దాంతో ఊళ్ళో ప్రజలందరికీ సహనం నశించింది. ఒక సందర్భంలో అందరూ కలిసి చర్చించుకున్నారు. 'గోవిందయ్యకు సరైన బుద్ధి చెప్పాల్సిందే' అనుకున్నారు.

మరుసటి రోజున గోవిందయ్య ఇంటికి పాలు పోసే వ్యక్తి 'పాలు లేవు అయ్యా!' అని మర్యాదగా చెప్పి, పాలు పోయటం ఆపేశాడు. గోవిందయ్య ఇంట్లో పనిచేసే మల్లన్న ఆరోగ్యం బాగా లేదని పని మానేశాడు. కిరాణ దుకాణపు రంగస్వామి 'ఇంటి పరిస్థితి బాలేదు గోవిందయ్యా! దుకాణం మూసేద్దామనుకుంటున్నాము' అని చెప్పి, గోవిందయ్యకు సరుకులు ఇవ్వలేదు.

చాకలి మోహనయ్య "చేతులు నొస్తున్నాయి సేటూ" అని పని మానుకున్నాడు. అన్నిటినీ‌ మించి, ఇప్పుడెవ్వరూ 'నాకు అప్పివ్వు' అని రావట్లేదు గోవిందయ్య దగ్గరికి!

అయినా కొన్నాళ్ళు పడుతూ లేస్తూ‌ పని నడిపించిన గోవిందయ్య చివరికి ఒక రోజున దిగాలుగా ఇంటి అరుగుమీద కూర్చున్నాడు. అటుగా వెళ్తున్న ఊరివాడు అతనిని పలకరించి "ఏమైంది సేటూ, నీరసంగా కనిపిస్తున్నావు" అన్నాడు. లేకలేక దొరికిన ఊరతనితో "నా వల్ల కావట్లేదు.

పరిస్థితి ఇట్లాగే ఉంటే నేను పట్నానికి వెళ్ళిపోవాల్సి వచ్చేట్లుంది" అంటూ తన గోడంతా వెళ్లబోసుకున్నాడు గోవిందయ్య.

అతను నవ్వి, గోవిందయ్యను ఊరి పెద్దల దగ్గరికి తీసుకెళ్ళాడు. "ఊళ్ళోవాళ్లం అందరమూ కలిసి, కావాలనే ఇట్లా చేశాం గోవిందయ్యా, నువ్వు ఇప్పటికైనా మనుషుల విలువ తెలుసుకుంటావని!" అని చెప్పి మందలించారు ఊళ్ళోవాళ్ళు.

అన్ని కష్టాలు పడటం వల్ల గోవిందయ్యకు వెంటనే అర్థమైంది: 'తన వల్ల ఊరి ప్రజలు బ్రతకడం లేదు- వాళ్ల సహకారం వల్లే తన జీవనం గడుస్తోంది! ఊళ్ళో ఒకరి కొకరు సాయం చేసుకుంటేనే జీవితం!' అని.

'మనుషులంతా సమానమే! కలిసి జీవించటంలో సార్థకత ఉంది" అని తెలుసుకున్న గోవిందయ్య ఆ తర్వాత అందర్నీ గౌరవించడం మొదలు పెట్టాడు.