రాము వాళ్లది చాలా చిన్న ఇల్లు. ఒకటే గది. ఆ గదిలోనే చాలా సామాగ్రి నిండి ఉండేది. అందులోనే ఒక మూలన పాత ఫ్యాను ఒకటి పడి ఉండేది. దానిని బాగు చేయించాలని రాముకి గట్టి కోరిక. అయితే ఆ పనికి వంద రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ డబ్బు దొరికే మార్గం ఒకటి తట్టింది రాముకి.
ప్రతి ఆదివారమూ వాడు ఒక మెకానిక్ దగ్గర పని చేయటం మొదలుపెట్టాడు. ఆ పనికిగాను వాడికి పది రూపాయలు దొరికేవి. ప్రతి వారమూ వాడు తన పది రూపాయలను దాస్తూ వచ్చాడు. నెల తిరిగే సరికి వాడి దగ్గర నలభై రూపాయలు జమ అయ్యాయి! అయితే సరిగ్గా అదే సమయానికి వాడు పరీక్ష ఫీజు చెల్లించాల్సి వచ్చింది. దాంతో వాడు సంపాదించిన నలభై రూపాయలూ ఖర్చయిపోయాయి. పని మళ్ళీ‌మొదటికి వచ్చింది!

అయినా రామూ నిరాశ పడలేదు. ప్రతి ఆదివారమూ మెకానిక్ దగ్గర పని చేస్తూనే వచ్చాడు. ఇంకొక నెల ఇలా జరిగేసరికి మళ్ళీ నలభై రూపాయలు జమ అయ్యాయి. అంతలోనే మరొక కష్టం! రాము వాళ్ళమ్మ ఆరోగ్యం పాడయింది. నలభై రూపాయలూ ఖర్చయిపోయాయి.
అయినా రాము తన పనిని కొనసాగించాడు. మరోనెల గడిచింది. మరొక నలభై రూపాయలు జమ అయ్యాయి. మళ్ళీ ఏదో అవసరం- అవీ ఖర్చయిపోయాయి. ఆరోజు రాత్రి రాముకు నిద్ర పట్టలేదు. ఎన్ని సార్లు ప్రయత్నించినా ఆటంకాలే ఎదురయ్యేసరికి వాడికి చాలా బాధ వేసింది. అయితే అంతలోనే తన సమస్య తీరేందుకు ఒక మార్గం కూడా కనిపించింది.
తెల్లవారగానే వాడు తనే సొంతగా ఫ్యానును విప్పదీసేందుకు పూనుకున్నాడు. మెకానిక్ దుకాణంలో‌ పనిచేసిన అనుభవం అందుకు బాగా తోడ్పడింది. ఫ్యానులో నిజానికి పెద్ద సమస్యలేవీ లేవు. ఒక తీగ కాలి తెగిపోయి ఉన్నది-అంతే. దాన్ని అతికించేసరికి ఫ్యాన్ తిరగటం మొదలు పెట్టింది.
రాముకి చాలా సంతోషం వేసింది. మూడు నెలలు మెకానిక్ దగ్గర పనిచేయటం వృధా పోలేదు. నిజానికి అక్కడ తను సంపాదించింది డబ్బు కాదు-పనిలో నేర్పు. డబ్బులు ఖర్చయిపోయినా ఆ నేర్పు తనకు సహాయపడింది!