నీళ్ళ విత్తనం సేకరణ, చిత్రాలు: వినయ్, జెయన్‌టీయూ, హైదరాబాదు.



అనగనగా ఒక రాజ్యంలో విపరీతమైన నీటి సమస్య నెలకొన్నది. ఆ రాజ్యంలోని చెరువులు, నదులు అన్నీ ఎండిపోయి ప్రజలందరూ దాహంతో విలవిలలాడారు. నీటి సమస్యను గురించి రాజుగారితో విన్నవించుకోవాలనుకున్నారు అందరూ.




రాజుగారికి రాజ్యంలోని నీటి సమస్య గురించి పూసగుచ్చినట్లు వివరించారు మంత్రులు .





రాజుగారు సమస్య పరిష్కారం కోసం తీవ్రంగా ఆలోచించారు.





నలుగురు సైనికాధికారులను పిలిచి, రాజ్యం నలుమూలలా నీటికోసం వెతకమని పంపాడు.





సైనికాధికారులు నలుగురూ నాలుగు వైపులకు వెళ్ళారు.





వాళ్లలో ముగ్గురు తిరిగి తిరిగి అలిసిపోయి వెనక్కి తిరిగి వచ్చారు. ఉత్తరానికి వెళ్ళిన నాలుగోవాడు మటుకు పోయి పోయి హిమాలయాలు చేరుకున్నాడు. అక్కడమంచు కరిగి నీళ్ళు తయారవ్వటం గమనించాడు. 'నీళ్ళు తయారయ్యేది ఈ విత్తనం నుండేనన్నమాట' అనుకున్నాడు.



పెద్ద మంచు కొండనొకదాన్ని పెకలించి, చక్రాల బండి మీదికి ఎక్కించి అతి కష్టం మీద తమ రాజ్యానికి తీసుకు వచ్చాడు. ఆ క్రమంలో మంచు కొండ చాలానే కరిగిపోయింది. చిన్న ముద్ద మాత్రం మిగిలిందిప్పుడు. రాజుగారు దాన్ని చూసి 'ఇది మంచు విత్తనమే. దీన్ని మనరాజ్యంలో నాటండి' అని ఆదేశించారు.



జనాలు మంచుముద్దను ప్రక్కన పెట్టి, నేలను త్రవ్వటం మొదలు పెట్టారు.






వాళ్ళు నేలను త్రవ్వుతూ పోతుంటే, మంచుగడ్డ కరుగుతూ పోయింది.





'విత్తనం మొలకెత్తుతున్నట్లుంది.. త్వరగా నాటండి' అని అందరూ హడావుడి పడ్డారు. అయితే ఆ మంచు గడ్డను గుంతలోకి చేర్చేసరికి అది పూర్తిగా కరిగే పోయింది. త్రవ్వేవాళ్ళు దానికోసం వెతుక్కోవాల్సి వచ్చింది!





'విత్తనం నేలలోకే జారిపోయినట్లుంది. సరిగ్గా కూర్చున్నదో‌లేదో- త్రవ్వి , దాన్ని తీసి సరిగ్గా కూర్చోబెట్టాలి. ఇంకా త్రవ్వండి' అన్నారంతా. వాళ్లు గుంతను ఇంకా ఇంకా త్రవ్వుతూ పోయారు.





ఎంత త్రవ్వినా, మంచు గడ్డ మాత్రం దొరకనే లేదు. వాళ్లంతా త్రవ్వీ త్రవ్వీ అలిసిపోయారు. నీరసంగా అక్కడే పడుకొని నిద్రపోయారంతా.





తెల్లవారింది. నీటివిత్తనం నాటేందుకు వెళ్ళిన వాళ్ళు ఎంతకీ తిరిగి రాలేదేమని అక్కడికే వచ్చారు రాజుగారు కూడా. అందరూ గుంతలోకి చూసే సరికి - ఆశ్చర్యం! గుంతంతా నీళ్ళతో‌ నిండిపోయి ఉన్నది!





అందరూ సంతోషంగా కేకలు వేశారు- నీళ్ళవిత్తనం మొలకెత్తిందని గంతులు వేశారు.

రాజ్యంలో నీటి సమస్య తీరింది.

అట్లా ప్రపంచంలో మొదటి బావి తయారైంది.