అనగనగా ఒక గ్రామం. ఆ గ్రామం పేరు సిరిపురం. ఆ గ్రామంలో కొండయ్య దంపతులు నివసించేవారు. వాళ్లకు ముగ్గురు కొడుకులు. కొండయ్య ముసలివాడైనాక, మరణించబోతూ, తను సంపాదించిన ఆస్తినంతా పెద్దకొడుకులిద్దరికీ రాసి ఇచ్చాడు. మూడవ కొడుకుకు మాత్రం ఒక్క కుంటి గుర్రాన్ని రాసిచ్చాడు.

మూడవ కొడుకు పేరు విజయ్. విజయ్ తన వాటాకు కుంటి గుర్రం మాత్రమే వచ్చిందని ఏమీ‌బాధ పడలేదు. అన్నలిద్దరికీ తండ్రి ఆస్తిని ఇచ్చేసి, తన కుంటి గుర్రం మీద ఎక్కి వెళ్ళిపోయాడు. పోతూ పోతూ ఉంటే అడవి మధ్యలో ఒక గుహ కనబడింది. విజయ్ కిందకు దిగి, గుర్రాన్ని అక్కడ కట్టి లోపలికి వెళ్లాడు.

అక్కడ ఒక బామ్మ దారం చుడుతూ ఉన్నది. ఆమె తిప్పే చక్రానికి పన్నెండు చువ్వలున్నాయి. ఆమె చుట్టూ తొమ్మిదిమంది పిల్లలు తిరుగుతూ ఆడుకుంటున్నారు. విజయ్ ఆ బామ్మకు మర్యాదగా నమస్కరించి 'నేను ఇక్కడ ఉండచ్చా' అని అడిగాడు. 'నువ్వు చాలా మంచి పిల్లవాడివి నాయనా! ఎంత కాలమైనా ఇక్కడ ఉండచ్చు!" అన్నది ఆ అవ్వ. దాంతో విజయ్ అక్కడే ఉండిపోయాడు. అక్కడున్న పిల్లలను సాకుతూ, అవ్వనీ, గుర్రాన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ జీవించాడు. అలా రెండు సంవత్సరాలు గడిచాయి. ఆలోగా కుంటి గుర్రంకూడా బలంగా, ఆరోగ్యంగా తయారైంది- కానీ దాని కాలు మాత్రం బాగు కాలేదు.

రెండు సంవత్సరాలు నిండాక, బామ్మ విజయ్‌ని పిలిచి, "ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళాల్సిన సమయం వచ్చింది- లోకం నీకోసం ఎదురు చూస్తోంది- వెళ్ళిరా" అని, విజయ్ కు రెండు కాసుల బంగారు నాణాలు ఇచ్చింది. విజయ్ వాటిని తీసుకొని గుర్రం ఎక్కి వెళ్ళాడు. పోతూ ఉంటే అతనికి ఒక బిచ్చగాడు ఎదురయ్యాడు "బాబూ! రెండు రోజులనుండి ఏమీ తినలేదు. నీదగ్గర తినేందుకు ఏమైనా ఉంటే ఇవ్వు" అన్నాడు అతను విజయ్‌తో.

"అయ్యో, నాదగ్గర తినేందుకు ఏమీ లేవు తాతా, రెండు కాసులు మాత్రం‌ఉన్నై, తీసుకో- ఇవి నీకేమైనా ఉపయోగపడతాయేమో చూడు"అని విజయ్ తన దగ్గర ఉన్న రెండు కాసులనూ ఇచ్చేశాడు బిచ్చగాడికి.

బిచ్చగాడు నవ్వి, "పాపం నీ దగ్గర నిజంగానే తినేందుకు ఏమీ లేవు కదా! నా దగ్గరే నయం, కనీసం త్రాగేందుకు కొంచెం అమృతమైనా ఉంది!" అని తన దగ్గర ఉన్న అమృతాన్ని ఒక సీసాలో పోసి ఇచ్చి, "ఇది నీకు చాలా ఉపయోగపడుతుందిలే, పోయిరా ఇంక!" అన్నాడు. విజయ్ దానిని తీసుకొని పోతూ‌ఉంటే ఒక నగరం కనబడింది.

ఆ నగరంలో ఉన్నవాళ్లంతా ముతక బట్టలు వేసుకున్న విజయ్‌నీ, అతను ఎక్కిన కుంటి గుర్రాన్ని చూసి నవ్వారు. విజయ్ ఏమీ సిగ్గుపడలేదు. ఆ ఊరి రాజుగారి గుర్రపుశాలలో పనికి కుదురుకున్నాడు. అక్కడి గుర్రాలకు మేత వేస్తూ, పని చేసుకుంటూ హాయిగా ఉన్నాడు.

అలా ఉండగా ఒక రోజు రాత్రి మధురమైన గానం వినబడింది. ఎక్కడినుండో, చక్కని పాట ఒకటి, గాలిలో తేలుతూ వచ్చి చేరింది వాళ్ళను. ఆ సమయంలో విజయ్ గుర్రపుశాల బయట మంచం మీద పడుకొని ఉన్నాడు. కుంటి గుర్రం విజయ్ తో "విజయ్! ఈ పాట పాడుతున్నది ఈ ఊరి రాజకుమార్తె. నువ్వు ఇప్పుడు బయలుదేరి ఆ యువరాణి దగ్గరికి వెళ్ళు. నీకు మేలు జరుగుతుంది" అన్నది.

సరేనని, విజయ్ పాట వినబడే వైపుకు వెళ్ళాడు. తోట బయట ఉన్న కాపలావాళ్ళు అతన్ని లోపలికి పోనివ్వలేదుగానీ, లోపలినుంచే అతన్ని చూసిన యువరాణి మాత్రం అతన్ని లోపలికి రమ్మన్నది. చూడగా ఆమె ముసుగు వేసుకొని ఉన్నది! "నేను మూడు ప్రశ్నలు అడుగుతాను- నువ్వు వాటికి సరియైన సమాధానాలు చెబితే నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను" అన్నదామె. విజయ్ 'సరే' అన్నాడు.

"మొదటి ప్రశ్న: నేను ఎందుకు ముసుగు వేసుకున్నాను?" అడిగింది యువరాణి.

"నీ అందం చూస్తే ఇక ఎవ్వరూ సమాధానాలు చెప్పలేరు అని" అన్నాడు విజయ్.

యువరాణి అతన్ని మెచ్చుకొని, రెండవ ప్రశ్న వేసింది: "మా అన్నయ్య ఒక కుంటి గుర్రంగా మారాడు. అదేమి కధ?" అని అడిగింది యువరాణి.

"దీనికి జవాబు ఆ కుంటి గుర్రమే చెప్పాలి" అని చెప్పి, విజయ్ వెళ్ళి తన కుంటి గుర్రాన్ని తెచ్చాడు. యువరాణిని చూడగానే కుంటి గుర్రం కళ్ళనీళ్ళు పెట్టుకున్నది. అది ఏమీ చెప్పకనే యువరాణి మూడో ప్రశ్న సంధించింది:

"కుంటి గుర్రానికి జీవాన్నిచ్చే అమృతం ఎక్కడ దొరుకుతుంది?" అని.

'అమృతం ' అనేమాట వినగానే విజయ్‌కి బిచ్చపుతాత ఇచ్చిన సీసా గుర్తుకువచ్చింది. అతను దాన్ని ఒక గిన్నెలో‌పోసి, తను ముందు దాన్ని కొంత రుచి చూసి, గుర్రం ముందు పెట్టాడు-
మరుక్షణం మునిశాపం తీరిన ఆ కుంటి గుర్రం, ఒక అందమైన రాకుమారుడిలాగా మారిపోయింది!

యువరాణి సంతోషంగా విజయ్‌ని వరించింది. ఆ తర్వాత ఇక ఏ కష్టాలూ లేవు!