బిట్టు వచ్చి ఇన్ని రోజులైనా వాడు అమ్మ-నాన్నల గురించి పెద్దగా అడగటం లేదు. నాలుగు రోజులకు ఒకసారి తాతయ్య వాడి చేత అమ్మ-నాన్నలకు ఫోను చేయిస్తున్నారు. ఆ నాలుగు రోజుల్లో జరిగిన కబుర్లన్నీ వరస పెట్టి వాళ్లకి చెప్పేస్తూ ఉంటాడు బిట్టు. ‘ఇన్ని కబుర్లు ఎప్పుడు నేర్చుకున్నాడమ్మా వీడు? ఇంట్లో ఎప్పుడూ ఇంతగా మాట్లాడడు?!’ అన్నది సునంద, తల్లితో.

‘అక్కడ ఇంట్లో ఎవరుంటారమ్మా, వాడి కబుర్లు వినేందుకు? ఇక్కడైతే నలుగురితో కలిసి మెలిసి తిరుగుతాడు. అసలు నీకు తెలీదుగానీ, వాడి పొట్టనిండా కబుర్లే! తాతమ్మకి కొత్త కొత్త కబుర్లు చెబుతాడు; ఢిల్లీ వింతలన్నీ ఇక్కడ వాడి స్నేహితులకి చెబుతాడు..’

తల్లి మాటలు వింటుంటే సునందకి సంతోషం కంటే ఎక్కువ దిగులుగా అనిపించింది- 'ఇక్కడ తను, శివ ఇద్దరూ ఎప్పుడూ బిజీగా ఉంటారు. వాడు చెప్పేది ఇద్దరూ సరిగ్గా వినరు. ఇంట్లో వాడికి ఒక్క తోడు కూడా లేకుండా ఒంటరిగా పెంచుతున్నారు. ఏదో ఈ సెలవల పుణ్యమా అని, వాడికి విశాల ప్రపంచాన్ని చూసే అవకాశం వచ్చింది గానీ..'

కానీ వాడు ఆరోజు ఉన్నట్టుండి ‘అమ్మా, నీకు నేనంటే ఇష్టమేనా?’ అని అడిగాడు ఫోనులో.

సునంద ఆశ్చర్యపోయింది. ‘ఏమైందిరా?’ అంది.

‘నువ్వు అమ్మమ్మ లాగా రాత్రి పడుకోబోయేప్పుడు కథలు చెప్పవు; నన్నే చదువుకోమంటావు; నువ్వేమో మొబైల్ తో ఎప్పుడూ బిజీగా ఉంటావు; నేను పుస్తకం చదువుకునేప్పుడు ఏదైనా చెప్పమంటే జావేద్ అంకుల్‌ని అడగమంటావు!’ అన్నాడు. సునందకి తను చేస్తున్న పొరబాటు అర్థమైంది. 'బిట్టు కనీసం ఇట్లా అడిగాడు కనుక, తను తెలుసుకోగలిగింది. లేకపోతే ఆ అసంతృప్తి వాడికి ఎప్పుడూ ఉండిపోయేది కదా?!' అనుకుంది.

‘లేదురా, బిట్టూ, నువ్వు దిల్లీ వచ్చాక మనిద్దరం కలిసి పుస్తకాలు చదువుదాం. నేను నీ కబుర్లన్నీ శ్రద్ధగా వింటాను-సరేనా?’ అన్నది, బిట్టుకి నమ్మకం కలిగేలా.


ఆరోజు తాతయ్య స్నేహితులెవరో వచ్చారు. ఆ సందర్భంగా సాయంత్రం చదువు లేదని చెప్పేసారు. పిల్లలు ముగ్గురూ, రెయిన్బో గాడు- అందరూ ఇల్లంతా తిరిగి హడావిడి చేసారు. తాతమ్మ కాస్సేపు వాళ్లని చూసినట్టే చూసి, ‘ఒరేయ్ బిట్టూ, ఒకసారి ఇట్లా వచ్చి కూర్చో, ఒకసారి! మీ ఢిల్లీ మన దేశానికే రాజధాని నగరం కదా, అక్కడి విశేషాలు చెప్పు! నేను ఎప్పుడూ వెళ్లనే లేదు మరి!’ అంది. బిట్టు ఆశ్చర్య పోయాడు- 'అంత పెద్దదైంది గానీ తాతమ్మ ఇంకా దిల్లీ చూడనే లేదు' అని.

‘దిల్లీ అంటే చాలా పెద్ద ఊరు తాతమ్మా, బోలెడు పెద్ద పెద్ద కార్లు, మెట్రో రైళ్లు ఉంటాయి. దేశంలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచీ వచ్చిన వాళ్లు కనిపిస్తారు అక్కడ. మన దేశ ప్రధాని, రాష్ట్రపతి ఇద్దరూ అక్కడే ఉంటారు. దేశానికి కావలసిన అన్ని నిర్ణయాలూ దిల్లీలోనే చేస్తారట, అమ్మ చెప్పింది!’

దావీదు, చిట్టి నోర్లు తెరిచి వింటున్నారు.

‘దిల్లీలో ఎర్రకోట అని ఒక కోట ఉన్నది. దాని మీద ఆగష్టు 15నాడు జాతీయ జెండా ఎగురవేస్తారు. అప్పుడే కాక, జనవరిలో వచ్చే రిపబ్లిక్‌డే కూడా దిల్లీలో చాలా ప్రత్యేకంగా జరుగుతుంది. వేరే వేరే దేశాల నుంచి అధ్యక్షులు, ప్రధానమంత్రులు వస్తారు- మన జాతీయ పండుగ చూసేందుకు!’

‘బిట్టూ, నువ్వు ఎప్పుడైనా ఎర్రకోటకి వెళ్లావా? అక్కడ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు చూసావా?’ ఉత్సాహంగా అడిగాడు దావీదు.

‘ఓ, రెండుసార్లు వెళ్ళాను. స్వాతంత్ర దినోత్సవం నాడు ఎర్ర కోట మీద జెండా ఎగురవేస్తారు మన ప్రధాని. స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న జాతీయ నాయకుల గురించి, వారి త్యాగాల గురించి చెబుతారు. జాతీయ గీతం పాడతారు.

దిల్లీలో గాలిపటాల్ని కూడా ఆ రోజున ప్రత్యేకంగా ఎగుర వేస్తారు. అన్నిచోట్లా రకరకాల కార్యక్రమాలు జరుగుతాయి, ఆ రోజున. మేమందరం మా చొక్కా జేబులకు చిన్న చిన్న జెండాలు తగిలించుకుంటాం కూడా...

మరి మీరు మీ స్కూల్లో రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే ఎలా జరుపుకుంటారు?’ అడిగాడు బిట్టు. దావీదు జవాబిచ్చాడు: ‘మా స్కూల్లో కూడా జరుపుతారు, కానీ దానికి మాత్రం నేను ఎప్పుడూ వెళ్లను- ముందు నాలుగురోజుల పాటు పని చేసి, స్కూలునంతటినీ రంగు రంగుల కాగితం జెండాలతో అలంకరిస్తాం. ఆ నాలుగు రోజులూ క్లాసుల గొడవ, పాఠాల గొడవ ఉండదు: హాయిగా ఆడుతూ పాడుతూ సమయం గడపచ్చు! కానీ ఆగస్టు పదిహేనున స్కూలుకి వెళ్లినా ఏముంది, ఏదో ఒక బిస్కెట్ ప్యాకెట్టో, చాక్లెట్టో ఇస్తారు అంతే. అందుకనే నేను హాయిగా 'సెలవు వచ్చింది చాలురా' అని నా నేస్తగాళ్లతో కలిసి ఊరంతా తిరుగుతాను. అయినా మేం కూడా జెండాలు చొక్కాలకి తగిలించుకుంటాంలే. మా అనిల్ గాడైతే వాడి సైకిల్‌కి పెద్ద జెండా ఒకటి పెట్టుకుంటాడు’ ఎలాంటి సంకోచమూ లేకుండా చెప్పేసాడు.

చిట్టి చెప్పింది: "నేను మాత్రం స్కూలుకి వెళ్తాను బాబూ! ప్రతి ఏడాదీ స్కూల్లో ఆగస్టు పదిహేనుకు ముందు జరిపే వ్యాస రచన పోటీల్లోనూ, వక్తృత్వ పోటీల్లోనూ, ఆటల పోటీల్లో కూడా నాకు బహుమతులు వస్తాయి! ఆరోజు నేను, మా స్నేహితురాలు లత- ఇద్దరం వేదిక మీద జాతీయ గీతాలు పాడతాం!" అని.

అది విన్నాక కొంచెం సేపు ఏమీ మాట్లాడలేదు దావీదు. వాడికి తను చేసిన తప్పు అర్థమైంది. 'మళ్ళీ కావాలంటే మాత్రం తనని ఇప్పుడు స్కూలుకి ఎవరు పంపిస్తారు? ఇప్పుడైతే తను కూడా అన్ని పోటీల్లోనూ పాల్గొంటాడు చెల్లి లాగా! పరుగు పందెంలోనూ, కబడ్డీ లోనూ ఐతే తనకి పోటీయే లేదు, స్కూల్లో. అయినా తను ఆడేవాడు కాదు! అట్లా ఎందుకు చేసేవాడో తనకే తెలీదు..'

వాడి ముఖం చూస్తూనే బిట్టుకి అర్థం అయిపోయింది- 'మళ్లీ ఏదో దిగులు పడుతున్నాడు' అని. ‘ఏమైంది దావీదూ, నాకు చెప్పు!’ అన్నాడు పెద్దవాడి లాగా.

‘నిజమేరా బిట్టూ! చెల్లి లాగా నేను బడికి వెళ్ళేవాడిని కాదు. ఎందుకో, మరి నాకే తెలియదు! రాయటం, చదవటం రాదు కదా; అయినా క్లాసులో చెప్పేదేదీ వినేవాడిని కాదు... ఇంక ఇంట్లోనేమో అమ్మ, నాన్న ఎప్పుడూ గొడవపడుతుండేవాళ్లు. నాన్న అమ్మని కొట్టటం, అమ్మ ఏడవటం, అది చూసి చిన్న చెల్లి, తమ్ముడు ఏడవటం.. అబ్బ, చాలా విసుగ్గా ఉండేది! రాత్రి పూట సరిగ్గా నిద్ర కూడా పట్టేది కాదు. ఇల్లు వదిలి వెళ్లిపోదామని అనుకునే వాణ్ణి, చాలాసార్లు. కానీ ఎక్కడికి వెళ్లాలో తెలియదుగా?!’ చెబుతున్నాడు సన్నగా, బలహీనంగా ఉన్నదావీదు.

"నిజానికి మొదట్లో చూసిన దావీదు కంటే ఇప్పుడున్న దావీదు కాస్త నయంగానే ఉన్నాడు. ఇక్కడ వాడి అమ్మమ్మ ప్రేమగా తినిపిస్తుంది..వాళ్ల ఇంట్లోలా కాకుండా. వాడి అమ్మమ్మ తాతయ్య వాడిని చాలా ప్రేమగా చూసుకుంటారు. పిల్లలకి ఇచ్చేందుకు, వారిని ఆరోగ్యంగా, ఆనందంగా పెంచేందుకు ప్రేమని మించినది ఏముంది?" అనుకున్నది, అక్కడే కూర్చొని ఏదో ఎంబ్రాయిడరీ చేసుకుంటూ వాళ్ల మాటలు వింటున్న మణి అమ్మమ్మ.

‘పోనీలే, ఇప్పుడు స్కూలు తెరవగానే వెళ్ళు! ఇకనుంచీ స్కూల్లో సరిగ్గా ఉందువు- సరిపోతుంది!’ అన్నాడు బిట్టు.

బిట్టు మాటలకి దావీదు పెద్దగా నవ్వేడు. 'అయినా ఇప్పుడు నన్నెవరు పంపిస్తారు, స్కూలుకి? మా అమ్మా-నాన్న అయితే నన్ను పని నేర్చుకొమ్మని పంపించేసారు ఇక్కడికి. ఇప్పటికే పదిహేను ఏళ్లు వచ్చేస్తున్నాయి నాకు- ఇంక స్కూలేమిటి?!’ వాడి గొంతులో నిరాశ అందరికీ స్పష్టంగా తెలిసింది. ‘ఇక్కడ తాతయ్య చదివిస్తారులే, నిన్ను. ఇప్పుడు సెలవుల్లో చదవటం, రాయటం నేర్చుకుంటున్నావుగా? అందుకని ఇంక క్లాసులో అన్నీ అర్థం అవుతాయి! అదీకాక తాతయ్య నీకు అర్థం కానివి చెబుతారు ఎట్లాగూ’ బిట్టు ధైర్యం చెప్పాడు వాడికి.

దావీదు మాట్లాడలేదు. వాడు ఆలోచిస్తున్నాడు: "నన్ను మళ్లీ ఇక్కడ స్కూల్లో చేర్చుకుంటారా?" అని. తను చదువుకుంటే 'చెల్లెళ్లని, తమ్ముళ్లని ఇంకా బాగా చదివించచ్చు' అని బిట్టు వాళ్ల తాతగారు చెప్పారు కూడా. అందుకని ఇప్పుడు ఇంక రోజూ ప్రొద్దున్నే పనికి వెళ్లి, తాతయ్యకి సాయం చేసి, అటుపైన స్కూలుకెళ్లి బాగా చదువుకోవాలి! తెల్లారగట్ట తన స్నేహితుడొకడు వార్తా పత్రికలు ఇంటింటికీ వేస్తాడు. తను కూడా అలా కాస్త కాస్త సంపాదిస్తూ చదువుకోవాలి...

"మాటలు ఆగాయేం" అనుకుంటూ వాళ్ల వైపు చూసింది అమ్మమ్మ. దావీదు ముఖంలో ఇప్పుడు ఒక పట్టుదల, కష్టపడేందుకు సన్నద్ధత కనిపిస్తున్నాయి. "వీడిని ఇంక వదలకూడదు" నిర్ణయించుకుంది ఆవిడ. "ఈ సెలవుల్లో వీడిని మరింత సాన పట్టాలి. సెలవలు అయిపోగానే మళ్ళీ బడిలో చేర్పించాలి.."

(తరువాతి కథ మళ్ళీ...)