అనగనగా ఓ అడవిలో తోడేలు ఒకటి ఉండేది. అమాయకంగా ఉండే జంతువులను నమ్మించి మోసం చేస్తుండేది అది.

ఒకసారి అడవి అంచుననే దానికి పెద్ద కోడి ఒకటి కనిపించింది. దాన్ని చూడగానే తోడేలుకు నోరు ఊరింది. కానీ అది తన చేతికి అంత సులభంగా దొరికేటట్లు లేదు.. "మీదికి దూకితే అది దొరక్కుండా పారిపోవచ్చు..ఏం చేద్దామా?" అనుకున్న తోడేలు స్నేహం నటిస్తూ, తను ఉన్న చోటినుండే : "ఏం అల్లుడూ?! ఎట్లా ఉంది ప్రాణం?" అంటూ‌ పలకరించింది. కోడి దాన్ని చూడగానే కలవర పడింది.

"అయ్యో! మావాళ్ళు అడవి దగ్గరికి వెళ్లద్దంటే వినకుండా ఇటు వచ్చానే, ఎంత తప్పైంది?! ఇప్పుడు దీని నుండి తప్పించుకునే ఉపాయం వెతకాలి" అనుకున్నది.

పైకి మటుకు "బాగుంది మామా! చాలా బాగుంది! నువ్వెట్లా ఉన్నావు?! అత్తా, అల్లుళ్ళూ అంతా కులాసానా?" అంది, తను కూడా వరస కలుపుతూ.

దాని ఆ వరస తోడేలుకు చాలా నచ్చింది. "ఇక్కడెక్కడో నేను ఆ మధ్య ధాన్యపు గింజల రాశి ఒక దాన్ని చూశాను అల్లుడూ! మీకు మేత పరిస్థితి ఎలా ఉన్నది?" అని మాట కలిపింది.

"అబ్బో! మా మేతకేమి, అద్భుతంగా ఉంది మామా! మా గూట్లో ఒక వందమంది కోళ్లం‌ ఉంటామా?! అందరం కలిసి కూర్చొని తిన్నా రెండేళ్లపాటు ఐపోదు- అంత మేత సేకరించి పెట్టుకున్నాం!

పైపెచ్చు, మాకో‌ వ్రతం కూడాను! రోజూ ఎవరో ఒక అతిథి ఉండాలి! లేకపోతే మేం ఎవ్వరం అన్నమే తినం! అందుకనే ప్రతిరోజూ ఇట్లా అడవి బాట పడుతున్నాం!" నవ్వుతూ చెప్పింది కోడి, తెలివిగా.

"నీకు అభ్యంతరం లేకపోతే, మామా!‌ నాతో పాటు రారాదూ, మా గూట్లో అందరం నీకు ఈ రోజున కడుపు నిండా విందు చేస్తాం!" అని జోడిస్తూ.

"ఓహో ఏమి నా భాగ్యం?! తంతే కోళ్ల బుట్టలో‌ పడటం అంటే ఇదే!‌ ఒకసారి దీనివెంట కోళ్ళగూడు చేరుకున్నానంటే ఇక అన్ని కోళ్లనూ‌ భోంచేయచ్చు" అనుకున్న తోడేలు సంతోషంతో ఎగిరి గంతేసింది.

"ఓ!‌ నువ్వు పిలవటమూ, నేను రాకపోవటమూనా, అల్లుడూ?! పద! పద! ఇప్పుడే వస్తాను!" అంటూ కోడి వెంట బయలుదేరిందది.

కోడి దాన్ని తాము ఉండే గూటి దగ్గరికి తీసుకెళ్ళింది.

అవి ఇంకా అల్లంత దూరాన ఉండగానే మిగిలిన కోళ్లన్నీ‌ గొల్లున అరవటం మొదలు పెట్టాయి.

"రా! మామా! మా వాళ్ళంతా నీకు స్వాగతం ఎలా పలుకుతున్నారో చూడు!" అంటూ ముందుకి దారి తీసింది కోడి.

కోళ్ల అరుపులు వినగానే బయటికి వచ్చిన కుక్కలు గట్టిగా మొరిగాయి. వాటి అరుపులు విన్న ఊళ్ళోవాళ్లంతా కట్టెలు పట్టుకొని వచ్చి తోడేలును చితకబాదారు.

"విందు పెడతారన్నావు కదా, అల్లుడూ!" అంది తోడేలు, పారిపోతూ.

"ఊరికే అన్నాను! ఈసారి అటొచ్చినప్పుడు నువ్వు చూపించే నిజం ధాన్యపు రాశిని ఎత్తుకొస్తాంలే మామా!" అంది కోడి, పరుగున పోయి తన వాళ్లను కలుసుకుంటూ.