బాగున్నారా, అంతా?
సెలవలన్నీ గబగబా, హడావిడిగా, గందరగోళంగా, సంతోషంగా గడిచి ఉంటాయి కదూ?
చాలా కథలు చదివి ఉంటారు, క్రొత్త క్రొత్త ఆటలు, పాటలు నేర్చుకొని ఉంటారు.
మండే ఎండల్లో తిరగకుండా జాగ్రత్తగా ఆడుకున్నారుగా?
కొత్తపల్లి కోసం ఎదురు చూసారా, పాపం? పత్రిక వచ్చి ఉంటే బాగుండేది కానీ, ఏంచేద్దాం, ఎండలు కదా, ఈ రెండు నెలలూ కుదరలేదు. ఇప్పుడు మళ్ళీ కొన్ని చక్కని కథలు పట్టుకొని వచ్చేసాం, ఇవిగో! !
ఈ కథలన్నీ చదవెయ్యండి గానీ- ఇదిగో, ఇందులో 'మొక్కలు నాటే కథ' అని ఓ గొప్ప కథ ఉంది. అది మాత్రం తప్పకుండా చదవండి- చదివి, ఈ వానాకాలంలో వీలైనన్ని మొక్కలు పెంచండి!
అదికాక, ఇందులో ఉజ్బెకిస్తాన్‌ వాళ్లది 'బాకీ' అని ఓ మాంఛి పెద్ద కథ ఉన్నది. పెద్ద పిల్లలు చదివేందుకు భలే ఉంది. చదివి ఆలోచించాలి మరి!
ఇంకేమి- మామూలేగా, మీరు రాసిన కథలేమైనా ఉంటే పంపండి! మీ పెద్దవాళ్లతో కూడా రాయించండి! బాగున్నవాటిని దిద్ది, రానున్న నెలల్లో ప్రచురిస్తాం!

కొత్తపల్లి బృందం