1. పురాతన సొరంగాల్లో దయ్యాలుంటాయా?

ప్రముఖ రచయిత స్టీవెన్సన్ రాసిన ఓ కథలో పిల్లలు కొందరు.. "క్యాండిళ్ళు పట్టుకొని‌ ఓ పురాతన సొరంగం లోకి దిగుతారు. వాళ్ల వెంటే వస్తున్న వాళ్ల పెంపుడు కుక్క టామీ కొంచెం దూరం పోగానే 'కుయ్..కుయ్'మనటం మొదలు పెడుతుంది. వాళ్ళు దాన్ని సముదాయించి ముందుకు సాగుతారు. ఇంకొంతదూరం పోయేసరికి కుక్క మరింత మొండికెయ్యటమే కాదు, వీళ్ళ చేతి పట్టు విడిపించుకొని వెనక్కి తిరిగి పారిపోతుంది! అయినా పిల్లలు ముందుకే వెళ్తారు... కొంచెం దూరం పోయేసరికి వాళ్ల చేతుల్లోని క్యాండిళ్ళు ఒక్కటొక్కటిగా అరిపోతాయి..అంతా చీకటి..! పిల్లలకు భయం వేస్తుంది..'వెనక్కి వెళ్ళిపోదామా' అనుకుంటారు. అంతలోనే అందరిలోకీ చిన్నవాడైన జేమ్స్ గొంతునెవరో పట్టుకొని ఒత్తినట్లవుతుంది.. వాడు క్రిందపడి గిజగిజా కొట్టుకోసాగాడు.. వాడికి సాయం చేయబోయిన మిగతా పిల్లలకూ అదే అనుభూతి ఎదురౌతుంది.. అందరి గొంతులూ బిగిసిపోసాగాయి... మరుక్షణం‌ అందరూ జేమ్స్ ని కూడా లాక్కొని సొరంగంలోంచి బయటికి పరుగు పెడతారు. పూర్తిగా బయట పడ్డాక సంతోషంగా ఊపిరి పీల్చుకుంటారందరూ..”
పురాతన సొరంగాల్లోకి మీరు వెళ్తే మీకూ ఇలాంటి అనుభూతే ఎదురవ్వచ్చు! ఎందుకిలాగ? పురాతన సొరంగాల్లో దయ్యాలుంటాయా?
జవాబు:
మీరెప్పుడైనా 'కార్బన్ డయాక్సైడ్ తయారీ' చూశారా? మన ఇంట్లోనే వంటసోటా మీద వినెగర్ వేస్తే బుడగలు బుడగలుగా కార్బన్ డయాక్సైడు విడుదల అవ్వటం చూడచ్చు. ఇది మంటను మండనివ్వదు; దీనినే పీలుస్తుంటే మనకు ఊపిరాడదు; దీనికి రంగులేదు- కాబట్టి ప్రత్యేకంగా కనబడదు కూడాను.
ఇంకో సంగతేంటంటే, కార్బన్ డయాక్సైడు గాలికంటే బరువుగా ఉంటుంది. అందువల్లనే, పురాతన సొరంగాలలోను, గుహల్లోను గాలి ఎంతోకాలంగా కదలకుండా ఉంటే, దానిలోంచి ఈ వాయువు పెద్ద బరువైన పొరలాగా విడిపోయి, సొరంగపు క్రిందివైపుగా అంతటా పరచుకొని ఉంటుంది.
కుక్కలు, పిల్లులు పెద్ద ఎత్తుగా ఉండవు కదా, అందుకని అవి ఆ సొరంగాలలోకి పోయినప్పుడు వాటికి ముందు ఊపిరాడదు- మనకంటే ముందుగానే అవి గందరగోళపడి పారిపోతాయి. క్యాండిళ్ళూ అంతే- కార్బన్ డయాక్సైడు వాటి ఎత్తు వరకూ రాగానే అవీ ఒక్కటొక్కటిగా ఆరిపోతాయి. మరి, ఆ తర్వాత జేమ్స్ లాంటి చిన్న పిల్లల వంతు- ఆపైన వాడికి సాయం చేయబోయిన పెద్దల వంతు! అంతా బయట పడి మంచిగాలిలోని ఆక్సిజన్ పీల్చుకుంటే తప్ప లాభం లేదు- ఎందుకంటే మరి పురాతన సొరంగాల్లో ఉండేది దయ్యాలు కావు- కార్బన్ డయాక్సైడు!

2. మంట ఎప్పుడూ పైకే ఎందుకు పోతుంది?

ఓసారి అగ్గిపుల్లను వెలిగించి చూడండి. పుల్ల క్రిందివైపున ఉంటుంది; మంట పైకి పోతుంది.
క్యాండిల్ వెలిగించి చూడండి. క్రొవ్వొత్తి క్రింద ఉంటే, మంట పైకి తిరిగి ఉంటుంది.
మరి క్యాండిల్‌ని తిరగ ద్రిప్పి వెలిగిస్తే? చేసి చూడండి- కానీ జాగ్రత్త- మంట పైవైపుకే వస్తుంది- క్యాండిల్‌ని, మీ వ్రేళ్లను కాల్చేట్లు! ఎందుకిలా జరుగుతుంది? మంట ఎప్పుడూ పైకే ఎందుకు పోతుంది?
జవాబు:
మంటకు నూనెనో, మైనమో- ఏదో ఒక ఇంధనం కావాలి, తెలుసుగా? ఆ ఇంధనంనుండి రకరకాల వాయువులు వెలువడి మండటం వల్లనే, ఆ మంటకు నారింజరంగో, ఎరుపో, నీలం రంగో ఏర్పడుతుంటుంది. అయితే మండే వాయువులు తమ చుట్టూతా దూరంగా ఉన్న చల్లని గాలికంటే తేలికవుతాయి. వేడెక్కిన కొద్దీ వ్యాకోచిస్తాయి కదా, అందువల్ల వాటి సాంద్రత తక్కువౌతుందన్నమాట. అలా అవి గాలిలో పైకి తేలేందుకు ప్రయత్నిస్తాయి- అందువల్లనే మంట ఎప్పుడూ పైవైపుకే పోతుంది!

3. చెరువులు, సముద్రాలు నీలంగా ఎందుకుంటాయి?

మీరు ఎప్పుడైనా సముద్రం చూశారా? సముద్రపు బొమ్మలైతే చూసే ఉంటారుగా? మరి సముద్రం ఏ రంగులో ఉంటుంది చెప్పండి! నీలం రంగు- 'సీ బ్లూ'- అవునా? అయితే ఓసారి ఆ నీళ్లను చేతిలోకి తీసుకొని చూడండి; మామూలుగానే ఉంటాయి!
లోతైన చెరువుల్లో నీళ్ళూ అంతే- చెరువులో ఉన్నప్పుడేమో నీలంగా ఉంటాయి; చేతిలోకి తీసుకొని చూస్తే మామూలుగానే ఉంటాయి. ఎందుకిలాగ? చెరువులు, సముద్రాలు నీలంగా ఎందుకుంటాయి?
జవాబు:
సముద్రాలు, చెరువులు నీలంగా కనిపించటానికి చాలా కారణాలున్నై. కానీ వాటిలో ప్రథానమైన కారణం‌ ఏంటంటే, ఆ నీళ్ల ఉపరితలం అద్దం మాదిరి, తన పైనుండే నీలాకాశపు రంగును ప్రతిఫలిస్తూ ఉండటం! అంటే మనం‌ నీళ్ళలో చూసే నీలంరంగు నిజానికి ఆకాశాపు వర్ణమేనన్నమాట!
అయితే నీళ్ళలో కరిగి ఉన్న రకరకాల లవణాలను బట్టి, నేల రంగును బట్టి కూడా ఒక్కోసారి ఈ నీలవర్ణం‌ మారిపోతుంటుంది. మురికి గుంటల్లో నీళ్ళు నల్లగా ఉంటాయి కదూ; అలాగన్నమాట!
మరి కృష్ణానదిలో నీళ్ళు 'కృష్ణ వర్ణం'లో - అంటే నల్లగా- ఎందుకుంటాయి, చెప్పండిప్పుడు?!