మండే పుల్లను ముక్కున కరచుకొని దొంగతనంగా కోటలోనికి చొరబడిన ఆ కాకి వెన్నంటే, దాని అనుచరులైన కాకులు ఒక వెయ్యి అమిత వేగంగా గుహలోనికి ఎగిరివచ్చాయి. అవన్నీ కలిసి త్వరలోనే కోటలో ఉన్న ప్రతి ఇంట్లోనూ మంటలు రగిల్చాయి. అన్నీ తమ తమ రెక్కలతో విసిరే సరికి, ఆ మంటలు చెలరేగినై; హంసరాజు అనుచరులు గమనించే సరికే ఆ మంటలు కోటను పూర్తిగా ఆక్రమించినై. అప్పుడు పైకెగసిన మంటకు, పొగకు భయపడి కోటలో ఉన్న పక్షులు పైకి ఎగిర చూశాయి. కానీ మంటల వేడికి రెక్కలు కమిలిపోయేసరికి అవన్నీ గింగిరాలు తిరుగుతూ క్రింద పడిపోయి, ఎగసి పడుతున్న అగ్ని కీలలకు ఆహుతి అయిపోయాయి.

ప్రళయ సమానంగా పెచ్చరిల్లుతున్న మంటలకు అదిరిపోయి, చావగా మిగిలిన పక్షులు ఏదో ఒక విధంగా తప్పించుకొని ఆకాశానికి ఎగరగానే, వాటిని దూరంగా పోనివ్వక, కాకులు వాటికి అడ్డునిలచి, తమ వాడి ముక్కులతో పొడిచి, కాళ్ళతో రక్కి, తమకు ఇక అడ్డు లేకుండా ఆ పక్షి సమూహాలను అంతం చేసేశాయి.

అటుపైన ఆ కాకులన్నీ‌ ఏకకంఠంతో "కోట పట్టుబడింది! కోట పట్టుబడింది!" అని అరిచాయి. ఆ కోలాహలం ఆకాశం అంతటా నిండి ప్రతిధ్వనించేసరికి, కోటలోని పక్షులన్నీ ఆ మంటలు తెచ్చిన ఉత్పాతానికి భయపడి, గట్టిగా ఏడవసాగాయి. వాటిలో కొన్ని ధైర్యం చేసి, మంటలకు ఎదురు ఎగసి, దూరంగా పారిపోయి, ప్రాణాలను అరచేత పట్టుకొని నీళ్లలోకి దూకి, అట్లా అతి కష్టం మీద తమ ప్రాణాలను దక్కించుకున్నాయి.

మరికొన్ని పక్షులు- తమ సహజ స్వభావానికి భయం కూడా తోడయి గుండెలు ఝల్లుమనేసరికి, కళ్ళు తిరిగేసరికి, ఎగిరేందుకు ఇక రెక్కలు రాక, శత్రువుల కాలిగోళ్ళ దెబ్బలకు తట్టుకోలేక, రక్తపుటేర్లు ప్రవహిస్తున్న కొండల మాదిరి క్రిందపడి, చేష్ఠలు ఉడిగి, ఏం చేయాలో అర్థం కానట్లు మ్రాన్పడిపోయాయి. మంటలు అట్లాంటి పక్షులను నలువైపులనుండీ క్రమ్ముకుంటూ‌ పోయాయి. ఆ విధంగా క్షణకాలంలో కోట యావత్తూ చీడపురుగు తాకిడికి గురైన పొలం మాదిరి నిరుపయోగం అయ్యేసరికి, బయట యుద్ధం చేస్తున్న పక్షులలో కూడా కలవరం మొదలైంది; కాలు-చెయ్యి ఆడలేదు.

మీద పిడుగు పడ్డట్లు అవన్నీ విచారంతో నీరసించి పోయాయి. అన్నీ అట్లా ఏమరుపాటుతో ఉండగానే వాటిని చుట్టుముట్టిన శత్రుమూకలు వాటిని వాడి ముక్కులతో‌పొడిచి గాయపరచటం, రెక్కలతో దఢాలున మోదటం మొదలుపెట్టాయి.
వాటి ధాటికి తాళలేని పక్షులు చాలా ప్రాణాలు పోగొట్టుకొని నేలమీద పడిపోయాయి. పిరికి పక్షులు కొన్ని రాజును శత్రు మధ్యంలోనే విడచిపెట్టి, నిలబడ్డ చోట నిలబడక, చూసిన వైపుకు చూడక, దూరదూరాలకు ఉరికి, ఒకటి పోయిన వైపుకు ఒకటి పోనట్లు చెల్లాచెదరై, చెట్టుకొకటిగా పారిపోయాయి.

వాటిమాదిరి పారిపోలేని పక్షులు కొన్ని వెనకబడి, శత్రుమూకల చేతికి చిక్కిపోయినై. శత్రువుల దెబ్బలకు, తన్నులకు, ముక్కు పొడుపులకు తాళలేక, ఎముకలు విరిగిపోగా అసువులు బాసాయి.

ఇట్లా నాశనం అవుతున్న తన సైన్యాలు శత్రువుల ధాటికి నిలువలేక చెల్లాచెదరైపోగా, ఆ విపత్సమయంలో రాజహంస, సహజంగానే మెల్లగా నడిచేది గనక, ఇక పారిపోలేనని నిశ్చయించుకున్నది. ఆ సమయంలో దాని వెంట సేనాపతి 'బెగ్గురు పక్షి' మాత్రం ఉన్నది. పొరలి పొరలి వచ్చే కన్నీరు వరదలు కాగా రాజహంస సేనాపతివైపుకు తిరిగి "ఓ వీర యోధుడా! చూశావు కదా, నా మూలంగా మనవాళ్ళు ఎందరికి ఇట్లా ప్రాణాంతకమైన ఆపద ఎదురైందో?! వీళ్లందరి శౌర్యాన్ని గురించీ ఇకమీదట జనాలు కథలు కథలుగా చెప్పుకుంటారన్నమాట!

ఈ క్షణంలో అయితే నువ్వూ, నేనూ ఇద్దరం ఊపిరితో‌ ఉన్నాం. రానున్న క్షణంలో ఎవరం ఏమి అవుతాయో తెలీదు. నన్ను కాపాడటం కోసం అంత గొప్ప యోధులే నశించారే- ఇక నా యీ పాడు శరీరం నన్ను ఏం‌ కాపాడగల్గుతుంది?

ఆ నీలవర్ణుడిని నమ్మటం వల్లనేగదా, పరిస్థితి ఇలా అయ్యింది?! వాడి మాయమాటలు విని, వాడు 'విశ్వసనీయుడు' అని భ్రమపడి, తప్పు చేసి ఈ గతిని తెచ్చుకున్నాను. ఆ దుర్మార్గుడు నమ్మించి ఇప్పుడు మోసం చేశాడు. 'ఇతన్ని దగ్గరికి రానివ్వద్దు' అని ఆనాడు మీరంతా ఎన్నెన్ని విధాలుగానో చెప్పారు. ఏమి కాలకర్మ దోషమోగాని, ఆ మాటలేవీ అప్పుడు నా చెవులకు రుచించలేదు. అప్పటి నా మనో ప్రవృత్తి ఎలా ఉండిందని చూస్తే ఇప్పుడు నాకు నాకే ఆశ్చర్యం అవుతున్నది. కాలం మూడినవాడికి మంచి మాటలు ఎలా రుచిస్తాయి? 'వద్దు-వద్దు' అని మీరంతా చెవిన ఇల్లు కట్టుకొని పోరినా వినకపోతినే?! ఆ పాపఫలం అనుభవించక తప్పుతుందా?

అయినా దేవుడి సంకల్పం ఇలా ఉంటే మన పౌరుషం ఏం‌ పనికివస్తుంది? అయ్యో! దేవుడు ఇలా ఎందుకు చేశాడు?! వెయ్యిమంది అనుక్షణం కొలుస్తుండగా ఒకనాడు వెలిగిపోయిన నన్ను, ఈనాడు పిలిచినా 'ఓ' అనేవాడు లేకుండా చేశాడే! మనవాళ్లంతా ముందుగానే దోవ తీశారు; క్షణం ఎక్కువ-తక్కువగా మనం కూడా అదే దారిన వారిని చేరబోతున్నాం. మన సర్వజ్ఞుడు ఆనాడు చెప్పిన మాటలన్నీ ఈనాడు నిజం‌ అయ్యాయి. మరి అతను కూడా మనవాడే- అతని గురించి ఇంకా ఏమీ తెలియరాలేదు- ఏ దుర్వార్త వినాల్సి వస్తుందో అని భయంగా ఉంది.

'సేనానీ! నువ్వు మంచివాడివైతే ఓ సాయం చెయ్యి. దైవంచేత శపించబడినవాడిని నేను-అట్లాంటి నన్ను రక్షించాలనుకునే నీ ప్రయత్నం ఎట్లాగూ సఫలం కాదు. అందుకని ఇవాల్టితో నా మీద ఆశ వదిలెయ్యి. నా యీ చివరి కోరికకు మోకాలడ్డక, ఈ ఒక్క కోరికనూ తీర్చి పుణ్యం కట్టుకో- నువ్వు తక్షణం‌ఇంటికి వెళ్ళి, సర్వజ్ఞుడి అనుమతితో నాకొడుకు చూడాకర్ణుడిని పక్షి రాజ్యానికి అధిపతిగా నియమించి, పట్టాభిషేకం చెయ్యి. ఆపైన ఆ శుభవార్తను తెచ్చి కాస్త నా చెవిన వేస్తే సంతోషంగా ప్రాణాలు విడుస్తాను. చూడాకర్ణుడైనా ప్రాణాలతో‌ ఉండి వర్థిల్లితే, ఏనాటికైనా మన యీ పగను చల్లార్చగలడు. దైవం మనల్నిద్దరినీ చల్లగా చూసిందనుకో, అప్పుడు మళ్ళీ కలుస్తాం. లేదంటే 'ఇంతే మన అదృష్టం- ఇదే కడసారి చూపు' అనుకుందాం“ అంది .



హంస మాటలు సేనాపతి చెవుల్లో శూలాల మాదిరి గుచ్చుకొని, దాని హృదయాన్ని కలచివేశాయి. అది కొంతసేపు నిర్ఘాంతపోయి, తెలివి తెచ్చుకొని, కళ్ళనీరు నిండగా గద్గద స్వరంతో "ప్రభూ, వినరాని ఇటువంటి మాటలు తమ నోట రారాదు. చూడాకర్ణుడికి పట్టం కట్టమని ఎంతమాట అన్నారు! ఆకాశంలో చంద్రుడు, నక్షత్రాలు ఉన్నంతకాలం ఈ భూవలయాన్ని మొత్తాన్నీ తమరే ఏలుదురుగాక.


నేను సేనానిగా జీవించి ఉండగా తమరిని ఎవరే కానీ వ్రేలెత్తి చూపగలరా? వేయి మాటలు ఎందుకు? నా రక్తమాంసాలతో నిండిన మార్గాన తప్ప ప్రభువులవారు ఈ రణరంగంనుండి వెనుకకు మరలరాదు. ఓపికగలవాడు, దాత, సుగుణములను పెంచేవాడు అయిన యజమాని దొరకడం కేవలం అదృష్టం. శుభ్రత, దక్షత, ఇష్టం అనే మూడూ కలిగిన అనుచరుడు దొరకటం కూడా దుర్లభమే. ఆ విధంగా అదృష్టంకొద్దీ లభించిన ప్రభువు అనే రత్నాన్ని పోగొట్టుకునేంత తెలివితక్కువవాడు ఉంటాడా? నాకు తమరి తోడిదే లోకం. తమరిని ఎడబాసి క్షణంకూడా ఉండలేను...

(ఇంకా ఏమన్నదో వచ్చేసారి...)