అనగనగా ఒక ధనవంతుడు ఉండేవాడు. ఆయన పేరు వీరనరసింహుడు. ఆయన చాలా పిసినారివాడు. ఒకరోజున ఆయన దగ్గరికి పేదవాడు ఒకడు వచ్చాడు. తన కూతురికి వివాహం చేయడానికి కొంతధనం అడిగాడు. కానీ వీరనరసింహుడు ఇవ్వలేదు.

పేదవాడు బ్రతిమలాడాడు. కాని ఫలితం లేకపోయింది- వీర నరసింహుడి మనసు కరగలేదు. పైపెచ్చు, "నన్నే దబాయిస్తావా?" అని పోలీసులను పిలిచి ఆ పేదవాడిని జైల్లో పెట్టించాడు.

పాపం పేదవాడి భార్యా పిల్లలంతా భోరుభోరుమన్నారు. పేదవాడి భార్య వచ్చి వీరనరసింహుడి తల్లితో మొరపెట్టుకున్నది. తన భర్తని విడిపించమని కోరింది. వీరనరసింహుడి తల్లి వాళ్ళకు ధైర్యం చెప్పి, ఓ ఉపాయం ఆలోచించింది .

తమ కుటుంబ వైద్యుడిని పిలిపించి, ఆయనకు సంగతంతా వివరించి, "తమరు నాకు సహాయం చేయాలి!" అని కోరింది. వైద్యుడు అందుకు అంగీకరించాడు.

వెంటనే ఆమె పరుపు మీద పడుకొని దుప్పటి ముసుగు వేసుకున్నది. "నేను జబ్బుతో ఉన్నానురా, నన్ను మంచి డాక్టరుకు చూపించండి" అని సందేశం పంపింది భటులతో. వీరనరసింహుడు వచ్చి తల్లిని పలకరించాడు. కానీ ఒక్క డాక్టరును కూడా పిలవలేదు; ఒక్కపైసా కూడా ఖర్చుపెట్టలేదు.

అంతలో తల్లి ఆరోగ్యం బాగాలేదని ఆమె రెండవ కొడుకు పేరు వీరకృష్ణకు సందేశం అందింది. అతను వెంటనే తన తన ఖర్చుతో పెద్ద వైద్యులను పిలుచుకొని వచ్చి చేరుకున్నాడు. తల్లి వద్దకు చేరి కూర్చున్నాడు. ఆ వైద్యులు తల్లిని పరీక్షించబోగా, "మా కొడుకుతో‌ కొంచెం మాట్లాడతాను- ఒక్కసారి బయటికి వెళ్ళ గలరా?" అని డాక్టర్లను కోరింది తల్లి. "సరే" అని బయటకు వెళ్ళారు వాళ్ళు.

తల్లి లేచి కూర్చొని జరిగినదంతా చెప్పింది చిన్నకొడుక్కు. "నిన్ను రప్పించేందుకే ఇలా జబ్బు పడ్డట్లు నాటకం ఆడాను- నిజానికి నాకేమి, బాగున్నాను. ఎలాగో ఒకలాగా మీ అన్నను మార్చు. అలాగే ఆ పేదవాడిని విడిపించు నాయనా" అని ప్రాధేయపడిందావిడ.

అప్పటికప్పుడు ఒక ఉపాయం ఆలోచించాడు వీరకృష్ణ. "అమ్మను చూసేందుకు పట్నం నుండి గొప్ప డాక్టర్లను పిలిపించాను. వాళ్ళు ఇక్కడ ఉండగా మీరంతా ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి" అన్నాడు అందరితోటీ.

"ఊరికే చేస్తారుగా, నాదేం పోతుంది?" అని వైద్యపరీక్షలకొచ్చాడు వీరనరసింహుడు. ముందుగా నిర్ణయించిన ప్రకారం వైద్యులు ఆయన ఫలితాలను చూడగానే పెదవి విరిచి, గుసగుసలాడుకున్నారు.

వాళ్ళ ముఖాలు గమనించిన వీర నరసింహుడికి వెంటనే ఆయాసం మొదలయింది. "మీకు ఎలా చెప్పాలో తెలీటం లేదు. మీ గుండె... " అన్నారు డాక్టర్లు. "మరో వారం రోజులు ఉంటే ఉన్నట్లు. ఎందుకు, ఇలా తాస్కారంగా ఉన్నారు? మీకంటే మీ అమ్మ ఆరోగ్యమే నయంగా ఉంది!" అని చీవాట్లు పెట్టారు.

ఆ క్షణం వరకు బాగున్న వీర నరసింహుడు వెంటనే నీరసించి పోయాడు. మర్నాటికల్లా పూర్తిగా జబ్బు పడ్డాడు. "ఎంత డబ్బయినా పర్లేదు డాక్టర్, నా గుండెను కాపాడితే అంతే చాలు" అన్నాడు.

"ఎవరమైనా చేయగలిగింది పెద్దగా లేదు. ఏమైనా పుణ్యకార్యాలు చేయండి. ఎవరైనా పేదవాళ్ళకు అన్యాయం చేశారేమో చూడండి- ఈ వారం పది రోజుల్లో మీరు చేసిన తప్పులన్నిటినీ సరిదిద్దుకోండి. మాకు చేతనైనంత మేము కూడా‌చేస్తాం" అన్నారు డాక్టర్లు కొంచెం మెత్తబడుతున్నట్లు.

వీర నరసింహుడు వెంటనే తన తల్లిని , తమ్ముడి ని రమ్మని, వాళ్ళ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగాడు. తను అప్పులిచ్చి పీడిస్తున్న బీదవాళ్ల పత్రాలను చింపి పడేశాడు. పోలీసు స్టేషన్లో మ్రగ్గుతున్న పేదవాడిని విడిపించాడు. వాళ్ల కూతురి పెళ్ళికి సాయం చేశాడు. తాను ఉండే వారం-పది దినాలూ మంచి పనులు చేస్తూ గడపాలని నిశ్చయించుకున్నాడు.

ఆలోగా పట్నం వెళ్ళిన డాక్టర్లు వీరనరసింహుడిని పిలిపించుకొని మరిన్ని పరీక్షలు నిర్వహించారు. "మీ గుండె కొంచెం బలహీనమైంది అంతే. ప్రాణాపాయం లేదు. టానిక్కులు వాడండి" అని మందులు రాసిచ్చారు.

వీరనరసింహుడు సంతోషంగా ఊరికి తిరిగి వచ్చాడు. తను చేసిన పుణ్యకార్యాలవల్లే తన ఆరోగ్యం బాగైందని అతనికి గట్టిగా అనిపించింది. దానికి తోడు, వాళ్ళ అమ్మ "ఒరే, నా ఆరోగ్యమూ‌ బాలేదు- నీదీ అంతంత మాత్రమే. బ్రతికి ఉండగా ఇంత మంచి పేరు సంపాదించుకుందాం రా" అనేసరికి, అతను నిజంగానే మారిపోయాడు. త్వరలోనే "వీరనరసింహుడు మంచివాడు. దయామయుడు" అని పేరు తెచ్చుకున్నాడు.