వచ్చిందోయ్ వచ్చింది 
స్వాతంత్ర్యం మనకొచ్చింది
స్వరాజ్యమే మనకొచ్చింది
ఎందరెందరో మహానుభావులు 
ఎదురు నిలవగా 
బందూకులకు
1947 పదిహేను ఆగస్టు 
రోజున  |వచ్చిందోయ్ ।

ఎగిరిందోయ్ ఎగిరింది 
ఎర్రకోటపై త్రివర్ణ జెండా
దగాకోరులను తరిమికొట్టుటకు
ధైర్యవంతులైన నాయకులెందరో 
తెగించి ముందుకు నడిచారు 
ఆ తెల్ల దొరలనెదిరించారు  ।వచ్చిందోయ్ ।

పోయిందోయ్ పోయింది
భారతీయులకు బానిసత్వమె
భాయిభాయిగా కలసీమెలసి
చేయి చేయి కలపండి
న్యాయంకోసం ముందుకు నడిచి 
నవ చైతన్యం తేవండి  ।వచ్చిందోయ్ ।

మానండోయ్ మానండి 
కులమత  భేదం మానండి 
మనుషులందరు ఒకటేనని 
మానవత్వం పెంచుకోండిక
వినోదమ్ముగా విలాసాలతో 
విశ్వభారతిని పొగడండి  ।వచ్చిందోయ్ ।

కదలండోయ్ కదలండి 
కార్మిక కర్షకులందరేకమై
వదులుకోండిక నీదినాదని 
వాదులాటలికపైనుండి
అధర్మాలను అణచివేయగ 
అన్నిజాతులొకటవ్వాలి  ।వచ్చిందోయ్ ।

లేవండోయ్ లేవండి  
అధర్మాలను అణచివేయగ
నవభారతి యువనాయకులెందరొ 
నవ చైతన్యపు రథమునులాగుచు
భావిపౌరులై భారతదేశపు 
ప్రఖ్యాతిని కొనియాడండి  ।వచ్చిందోయ్ ।
పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song