బిట్టు వాళ్ళ అమ్మ సునంద హడావిడి పడుతూ వచ్చింది ఢిల్లీ నుండి.

వస్తూనే, కొంచెం బుగ్గలొచ్చి సంతోషంగా కనిపిస్తున్న కొడుకుని చూసుకుని, మురిసిపోయింది. వాడిని అమ్మమ్మ-తాతయ్యల దగ్గరకి పంపి మంచి పని చేసానని తృప్తి పడింది. ఆ ఒక్క నెలలోనే బిట్టు ఎంతో పెద్దవాడు అయిపోయినట్టు అనిపించాడు తనకు.

అమ్మ చెయ్యి పట్టుకుని ఇల్లంతా చూపించి, రెయిన్బో గాడిని అమ్మకు పరిచయం చేసాడు బిట్టు.

తాతమ్మ గది వరండాలో ఉన్న పిచ్చుకల గూడును చూపించాడు. "చూసావా, అమ్మ పిచ్చుక? పిల్లలకు ఆహారం తెచ్చి తినిపిస్తోంది!" అన్నాడు.

తాతమ్మ దగ్గరకి తీసుకెళ్తూ రహస్యంగా నోటికి చెయ్యి అడ్డం పెట్టుకొని చెప్పాడు: ‘తాతమ్మతో కొంచెం గట్టిగా మాట్లాడు, పాపం, వినిపించదు’ అంటూ.

"ఏమిట్రా నామీద రహస్యాలు చెబుతున్నావ్ మీ అమ్మకు?!" అంది తాతమ్మ నోరంతా తెరిచి నవ్వుతూ. "సునీ, నీ కొడుకు సందడి అంతా ఇంతా కాదే, బోలెడు స్నేహితుల్ని పోగేసేడు. వాడు వెళ్లిపోతే మాకు ఎవ్వరికీ తోచనే తోచదు" అంది అమ్మతో. కొడుకు హిందీ యాస వదిలేసి తెలుగును స్పష్టంగా మాట్లాడటం, అంతకు ముందు వాడని తెలుగు పదాల్ని చాలా వాటిని వాడటం గమనించింది సునంద.

రమ్య, రాహుల్, చిట్టి, దావీదు అందరూ వచ్చేసారు సునందని చూసేందుకు. ఏడేళ్ల రమ్య సునందని చుట్టేసుకుంది ఎప్పటినుండో తెలిసున్న దానిలా. ఢిల్లీ ఆంటీ తనకి చాలా నచ్చేసింది చూడగానే. ఉదయాన్నే దువ్వెనలు, నూనె పట్టుకొని వచ్చి కూర్చున్నది- "ఆంటీ! నాకు జడలు నువ్వే వెయ్యాలి, . అమ్మమ్మకి జడలు వెయ్యటం సరిగ్గా రాదు" అంటూ.

"ఓసి భడవా కానా! నిన్నటివరకూ 'నువ్వే జడలు బాగా వేస్తావు అమ్మమ్మా!' అని నా దగ్గర వేయించుకునేదానివి, ఇవాళ్ల ఆంటీ పార్టీలో చేరావు" అంది అమ్మమ్మ నవ్వుతూ.

"అంటే నువ్వు కూడా బాగానే వేస్తావు; కానీ నీకంటే ఆంటీ ఇంకా చక్కగా వేస్తుంది" అని సర్ది చెబుతున్నట్లు అంది రమ్య. సునంద కూడా నవ్వి, "సరేలే! నేను ఉన్నన్ని రోజులు నేనే వేస్తాను" అంటూ మాట ఇచ్చేసింది.

ఆరోజున సునంద పిల్లలందరినీ‌ పిల్చింది. తను తెచ్చిన బహుమతులు తీసి, పేరుపేరునా ఇచ్చింది. చిట్టికి, రమ్యకి గౌన్లు, చెవులకి రకరకాల రింగులు, గొలుసులు తెచ్చింది. దావీదు, రాహుల్, బిట్టులకేమో టీ షర్టులు, చేతికి వాచీలు తెచ్చింది. రాహుల్ సంతోషంగా తీసుకున్నాడు, కానీ కాస్త పెద్ద వాడైన దావీదు ఇవన్నీ తీసుకుందుకు మొహమాటపడ్డాడు.

ఆ తర్వాతి రోజున ఇద్దరు అమ్మమ్మలు, కమలమ్మ అంతా కలిసి పిల్లల కోసం తిను బండారాలు చేసే హడావుడిలో ఉన్నారు. ‘మనందరం ఊరంతా తిరిగి, రెస్టొరెంట్ లో భోజనం చేసి, సినిమా చూసి వద్దాం పదండి’ అంటూ పిల్లల్ని తీసుకుని క్యాబ్‌ లో బయలుదేరింది సునంద.

అందరూ కలిసి ఊరంతా బాగా తిరిగారు ఆ రోజున. కనకదుర్గమ్మ గుడి దగ్గర క్రొత్తగా కడుతున్న ఫ్లై ఓవర్ పనులు చూసారు; విశాలమైన బి.ఆర్.టి.ఎస్. రోడ్డు చూసారు; క్రొత్తగా తయారవుతున్న గురునానక్ నగర్ కాలనీ అంతా తిరిగి, చివరికి కాళ్ళు నొప్పులు పుట్టే సమయానికి అక్కడే ఒక మంచి హోటల్‌లో భోజనం చేసారు. ఆ తర్వాత మల్టిప్లెక్స్‌లో నడుస్తున్న ఆమీర్ ఖాన్ సినిమా ‘దంగల్’ చూసేందుకు వెళ్లారు అందరూ. పిల్లలందరికీ కుస్తీ పోటీలు తెగ నచ్చేసాయి.

సాయంత్రం ఇల్లు చేరేసరికి పిల్లలు బాగా అలిసిపోయి ఉన్నారు. "ఇంక రెండు రోజుల్లో బిట్టు వెళ్లిపోతున్నాడు; అట్లాగే రమ్య, రాహుల్ కూడా వాళ్ల ఊరు వెళ్లిపోతున్నారు" అని అందర్నీ ఇక్కడే ఉంచేసింది సునంద. రాత్రి భోజనాలు అయ్యాక అందరూ డాబా మీదకి చేరారు.

పిల్లలు ‘దంగల్’ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. బిట్టు అన్నాడు ‘తాతయ్యా, గీత, బబిత ఇద్దరూ గెలవాలని ఎంత కష్టపడ్డారో తెలుసా, నువ్వు తప్పకుండా చూడాలి ఆ సినిమా’ అన్నాడు.

‘అవునురా బిట్టూ! మనం సాధించాలనుకున్నది సాధించేవరకు వదల కూడదు’ఒక పాఠంలా చెప్పారు తాతయ్య. తను అనుకున్నది గుర్తొచ్చిన దావీదు గుప్పెళ్లు బిగుసుకున్నాయి. తాతయ్యకు వాడి ఆలోచనలు అర్థం అయినై. ఆయన నవ్వి, వాణ్ణి దగ్గరగా కూర్చోబెట్టుకున్నారు.

ఇంతలో రమ్య, చిట్టి ఇద్దరూ క్రిందకి వెళ్లి, మళ్లీ వచ్చారు.

"ఏమైందర్రా?!" అంది మణి. "తాతమ్మకి మెలకువ వచ్చి, మనకోసం వెతుక్కుంటోందేమో అని, చూసి వచ్చాం అమ్మమ్మా!’ చెప్పారు వాళ్ళు.

సునంద ఆశ్చర్య పోయింది. "పల్లెల్లో పిల్లలకి ఇంత చిన్న వయసు నుంచే తోటి మనిషి గురించి ఎంత శ్రధ్ధ!" అనుకుంది. బిట్టు అమ్మమ్మ ఒడిలో తల పెట్టుకుని పడుకున్నాడు. వాడు ఏదో చేతులు, వేళ్లు మడిచి లెక్కలు వేయటం చూసి తాతయ్య అడిగారు- ‘ఏమి లెక్కలు వేస్తున్నావురా, బిట్టూ?!’ అని.

‘నేను మళ్లీ పోరంకి వచ్చేందుకు ఇంకా ఎన్ని రోజులు ఉందో లెక్కవేస్తున్నాను తాతయ్యా’ అన్నాడు వాడు.

వాడి మనసు అర్థమై, అమ్మమ్మ, తాతయ్యల మనసులు తడి అయ్యాయి. సునందకి కూడా ఒక్క క్షణం బాధ అనిపించింది. "కానీ తప్పదు, మనసును గట్టి చేసుకోవాలి" అనుకున్నది. వాడి దృష్టిని మరలించేందుకు అడిగింది- ‘బిట్టూ, నీకు అమ్మమ్మ ఊళ్లో బాగా నచ్చిన విషయాలు, అసలు నచ్చని విషయాలు చెప్పు’ అంది. బిట్టు టక్కున లేచి కూర్చున్నాడు--

‘నీకు తెలుసా, ఈ ఊళ్లో పిల్లలకోసం ఒక్క లైబ్రరీ కూడా లేదమ్మా! మన దిల్లీలో లాగా పిల్లల కోసం లైబ్రరీలు అసలు లేనే లేవు. ఇంక పిల్లలు చదువుకోవాలంటే ఎలా? తాతయ్యతో కలిసి నేను ఈ ఊళ్ళో లైబ్రరీకి వెళ్లాను- అక్కడ నేను చదువుకునే పుస్తకాలు ఏమీ లేవు. పెద్దవాళ్లకి కూడా కొంచెం పుస్తకాలే ఉన్నాయి’ అన్నాడు- "'కొన్ని' పుస్తకాలే ఉన్నాయి" సరిచేసారు తాతయ్య. "అవును 'కొన్ని' పుస్తకాలే ఉన్నాయి" దిద్దుకున్నాడు బిట్టు.

తాతయ్య మనవడి నోటినుంచి క్రొత్త విషయం వింటున్నారు. దాని ప్రాముఖ్యత గమనించో ఏమో, కొంచెం నిశ్శబ్దం అయ్యారు.

రాహుల్, దావీదు, చిట్టి, రమ్య మటుకు వెంటనే అడిగారు: "ఏమిటి?! దిల్లీలో పిల్లల కోసం ప్రత్యేకం లైబ్రరీలు ఉన్నాయా?!’ అని. వాళ్ళు అడగటంలోనే బయటపడింది, ఆ ఊహ వాళ్లకి ఎంత ఆశ్చర్యాన్నిచ్చిందో.

‘బోలెడు ఉన్నాయి! పోయిన సారి నా పుట్టినరోజుకి అమ్మ ఏం చేసిందో తెలుసా? మా యింటికి దగ్గర్లో ఉన్న పిల్లల లైబ్రరీలో నాకోసం మెంబర్షిప్ తీసుకుని, ఆ లైబ్రరీ కార్డ్ ఇచ్చింది! ఇంక అప్పటినుండి నేను దానితో బోలెడు పుస్తకాలు ఇంటికి తెచ్చుకుని చదువుకుంటున్నాను. పుస్తకాలు చదివి, వెనక్కి ఇచ్చేస్తే, మళ్ళీ వేరే పుస్తకాలు తెచ్చుకోవచ్చు!’ అన్నాడు బిట్టు, దాన్ని గుర్తు చేసుకుంటూ సంతోషంగా .

పిల్లలంతా అసూయ పడుతున్నట్లు చూసారు వాడివైపు.

‘దిల్లీలో కాటర్ పిల్లర్, టాయ్ ట్రెజర్, ట్రెజర్ హంట్ అనే లైబ్రరీలున్నాయి. ఇంకా 'చిల్డ్రన్స్ బుక్ ట్రస్ట్' వాళ్ల ఆఫీసు ఉంది కదా, అక్కడైతే పిల్లల 'రీడింగ్ రూమ్' ఉంది. అందులో కూర్చొని ఏ పుస్తకమైనా చదువుకోవచ్చు!' ఊరిస్తూ చెప్పాడు బిట్టు. "ఏ పుస్తకమైనా చదవచ్చా?!" ఆశ్చర్యపోయారు పిల్లలు.

"పుస్తకాలే కాదు- మంచి మంచి బొమ్మలు కూడా అద్దెకు ఇస్తారు తెలుసా, లైబ్రరీల్లో?!" అని బిట్టు అంటే పిల్లలంతా ఆశ్చర్యంతో నోళ్ళు తెరిచారు. అట్లాంటి లైబ్రరీల్ని తలచుకొని, వాటిలో తాము స్వయంగా కూర్చొని చదువుతున్నట్లు, ఆడుతున్నట్లు ఊహించుకున్నారు. ఆ ఊహ ఎంత అద్భుతంగా అనిపించిందో వాళ్ల నిశ్శబ్దమే తెలియజేసింది.

‘తాతగారూ, మన ఊళ్లో కూడా పిల్లల కోసం ఒక లైబ్రరీ పెట్టుకుందామండీ!’ అన్నాడు దావీదు ఒక క్షణం ఆగి.

బిట్టు, దావీదుల మాటల వల్ల తాతయ్య మనసులో క్రొత్త ఆలోచన మొదలైంది: 'ఇన్నాళ్లూ తనకు ఇది తోచలేదు. పిల్లల అవసరాలని వాళ్లే తెలుసుకుని చెబుతున్నారు చూడు!' అని.

'పోరంకికి దగ్గరలోనే విజయవాడలో ‘సర్వోత్తమ లైబ్రరీ’ ఉంది. ముఫ్ఫై ఏళ్ళుగా ఏ ఒక్క రోజూ సెలవు తీసుకోకుండా ప్రజలందరి కోసమూ తెరిచి ఉంటోంది అది. పిల్లలకోసమని అందులో ఒక బుక్ క్లబ్‌ని కూడా తెరిచారు క్రొత్తగా. కానీ తను పిల్లల్ని అక్కడికి తీసుకెళ్లనే లేదు..! రేపు వీలైతే పిల్లల్ని అక్కడికి తీసుకెళ్ళాలి తప్పకుండా" అనుకున్నారాయన.

'దావీదు, చిట్టిలనైతే ఇకపైన కనీసం నెలకు ఒక్కసారన్నా అక్కడికి తీసుకెళ్తాను. వీలైనంత త్వరలో ఇక్కడ కూడా పిల్లల లైబ్రరీ ఒకటి ఏర్పాటు చేయిస్తాను!" అని నిర్ణయించుకున్నారు.

"బిట్టూ! నువ్వు ఈసారి వచ్చేసరికి ఇక్కడ ఒక పిల్లల లైబ్రరీ ఉంటుంది. నేను మాట ఇస్తున్నాను!" అన్నారు ధృడంగా. "నాన్నగారూ, దానికి కావలసిన ఏర్పాట్లు చేయమని మీరు పంచాయితీ వాళ్లని అడగండి. వారికి సాధ్యం కాకపోతే, మన ఇంట్లోనే ఒక రెండు గదుల్లో లైబ్రరీని ఏర్పాటు చేద్దాం. పుస్తకాలు, ర్యాకులు నేను తెప్పిస్తాను. బిట్టు చెప్పింది నిజమే. పిల్లలు చదువుకునేందుకు సదుపాయం లేకపోతే ఎలా? అన్నీ మా రాజధాని వాళ్ల కోసమేనా?!" అంది సునంద.

రమ్య వచ్చి గారంగా సునంద ఒళ్లో కూర్చుంది. చిట్టి, రమ్య ఇద్దరిదీ ఒకే వయసు.. అయినా చిట్టి ఆ పసితనాన్ని దాటి, ఒక పెద్దరికంతో హుందాగా ప్రవర్తించటం తలచుకొని ముచ్చటేసింది సునందకి.

అయినా "చిట్టి తన బాల్యాన్ని పూర్తిగా అనుభ వించగలుగుతోందా?!" అని విచారపడింది. అంతలో ఏదో ఆలోచన వచ్చినట్టు, చిట్టిని దగ్గరకు పిలిచి "చిట్టీ, నువ్వు కూడా మాతో దిల్లీ వచ్చి చదువుకోరాదూ, మేం తీసుకెళ్తాం?!" అని అడిగింది. ఒక్క క్షణం ఆలోచించింది చిట్టి.

‘మరి అమ్మమ్మ, తాతయ్యలకి ఎవరు తోడుంటారు? అమ్మమ్మకి చిన్న చిన్న పనులలో నేను సాయం చేస్తాను కదా, నేను దిల్లీ వస్తే ఎలా?!’ అంది.

సునంద గుండె బరువెక్కింది. 'ఇంత చిన్న పిల్లలకి ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి? ఇంత బాధ్యతగా ఎలా ఆలోచించగలరు?' అని ఆశ్చర్యపోయింది.

"సరే, అయితే ముందు కొన్నేళ్ళు నువ్వు బాగా చదువుకో. ఆ తర్వాత దిల్లీ వద్దువుగాని. అప్పుడు అమ్మమ్మ, తాతయ్యలని కూడా తీసుకొద్దువు- సరేనా?!’ అంది.

ఆకాశంలో చంద్రుడు పిల్లల కబుర్లు వినేందుకా అన్నట్టు భూమికి ఇంకా దగ్గరగా జరిగాడు. దాంతో ఇప్పుడు మరింత పెద్దగా కనిపిస్తున్నాడు. బిట్టు ప్రక్కనే ముడుచుకుని పడుకున్న రెయిన్బో గాడు చటుక్కున లేచి చిన్నగా ‘భౌ’ అన్నాడు. అమ్మమ్మ నవ్వి ‘అదిగోనర్రా! వాడిని ఎవరూ పట్టించుకోటం లేదని, రెయిన్బో గాడు కూడా మాట్లాడుతున్నాడు!’ అంది. అందరూ నవ్వారు.

బిట్టు చటుక్కున లేచి డాబా మెట్ల వైపుకు పరుగు పెట్టాడు- ‘రెయిన్బో గాడి అరుపుకి తాతమ్మ లేచిందేమో చూసొస్తా!’ అంటూ.
(అయిపోయింది)