"ఆ రోజు తాతయ్యతో వీడు ఎట్లా మాట్లాడాడో తెలుసా, నీకు అసలు?" అని అమ్మమ్మని కోపంగా అడుగుదామనుకు-న్నాడు బిట్టూ. కానీ 'ఎవరి గురించైనా అట్లా చెడ్డగా చెప్పటం బావుండద'ని ఊరుకున్నాడు.

‘అయినా అమ్మమ్మా, బట్టలు ఉతికేందుకు వాషింగ్ మిషన్ కొనుక్కోవచ్చుగా, వీళ్లతో చేయించుకునేదెందుకు?’ అన్నాడు, అమ్మమ్మకి సులువు చెబుతూ.

‘ఎందుకురా, మనకు ఎన్నో ఏళ్లుగా బట్టలు కమలమ్మే ఉతుకుతోంది. మనం మిషన్ కొనుక్కున్నామంటే మరి ఆవిడ చేతిలో పని పోతుంది కదా!

అయినా, నలుగురూ ఇంటికొచ్చి వెళ్తూంటే ఇల్లంతా సందడిగా బావుంటుంది- ఒట్టి మిషన్లతో ఏం బావుంటుందిరా? మీకైతే, మరి సిటీలో బట్టలు ఉతికే మనుషులు కావాలన్నా దొరకరు; దొరికినా ఇంట్లో కూర్చుని ఉతికించుకునే తీరిక కూడా ఎవరికీ ఉండదు- అందరూ ఉద్యోగాలకి పరుగెడతారు కదా; మరి ఇక్కడైతే అట్లాంటి హడావిడి ఉండదు: చాలామంది నాలాగే బట్టలు ఉతికించుకుంటారు’ అంది అమ్మమ్మ.

"నలుగురూ ఇంటికి వచ్చి వెళ్తుంటే ఇల్లంతా సందడిగా బావుంటుంది" అని అమ్మమ్మ చెప్పింది బిట్టుకి కూడా నచ్చింది..

"నిజమే..దిల్లీలో అయితే ఎవరి ఇంటికి ఎవ్వరూ వెళ్లేందుకు సమయం చిక్కదు- అంతా బిజీనే! ఎవరి ఇంటికైనా వెళ్లాలంటే ముందు ఫోన్ చేసి, ‘ఇంట్లో ఉంటారా?’ అని అడిగి, అప్పుడు వెళ్లాలి.

అమ్మ ఆఫీసుకి వెళ్తూ ఇంటిపని చేసే తారా దీదీకి 'చాబీ' (తాళం చెవి) ఇచ్చి వెళ్లిపోతుంది. అమ్మ వచ్చేసరికి తారా దీదీ పని చేసి వెళ్ళిపోతుంది! ఇంక తనతో మాట్లాడేంత తీరిక ఎందుకుంటుంది అమ్మకి?

మరి ఆదివారాల్లో మాట్లాడచ్చుగా అంటే ఆదివారంనాడు తారాదీదీ పనిలోకి రాదు. దాంతో అసలు ఎవరూ ఎవ్వరితోటీ తీరిగ్గా మాట్లాడుకోనే మాట్లాడుకోరు! తనకైతే జావేద్ అంకుల్ ఉన్నారనుకో; కానీ అమ్మకి, నాన్నకి ఎవరున్నారు, రోజూ మాట్లాడేందుకు?...

జావేద్ అంకుల్ కూడా అమ్మని అడిగారట- 'బిట్టు ఎప్పుడొస్తాడు?' అని. ఇక్కడ చూస్తే తాతయ్య, అమ్మమ్మ, తాతమ్మ అందరూ మంచివాళ్లే. అమ్మని, నాన్నని వదిలి ఇక్కడ ఉండాలంటే కొంచెం బాధగానే ఉంటుంది; కానీ ఇక్కడ వీళ్ల దగ్గర ఉంటే తనకు చాలా బావుంటుంది కూడా. అయితే మరి ఈ సంగతి అమ్మకి చెబితే పాపం, తను బాథ పడుతుందేమో. 'బిట్టూ‌ ఇంక దిల్లీకి రాడు' అనుకుంటుందేమో!

అయినా, రాత్రి పడుకునేప్పుడు అమ్మ తనకి కథలు కూడా చెప్పదు- అమ్మమ్మ అయితే చాలా కథలు చెబుతుంది! అమ్మకి అసలు సమయమే చిక్కదు.. ఈ సారి ఫోన్ లో అడగాలి అమ్మని- నాకన్నా అమ్మకి తన ఉద్యోగం, మొబైల్‌ఫోన్ ఎక్కువ ఇష్టం అనిపిస్తుంది" బిట్టు ఆలోచనలు అట్లా సాగాయి ఆరోజంతా.

"..ఇక్కడ ఉన్నవాళ్ళందరిలోకీ చెడ్డవాడంటే ఒక్క దావీదే. వాడు కూడా మరి, 'నిజంగా చెడ్డవాడా' అంటే.. అంటే.. ఏమో, ఇంతకీ వాడు ఏం చెడ్డ పని చేసాడు? తాతయ్య చెప్పినట్టు వాడు మంచివాడేనేమో..?! అయినా సైకిల్ రిపేర్ భలే చేస్తాడు.. పోనీ వాడికి చదువు నేర్పిస్తే?! చదువుకోవట్లేదని కదా, వాళ్ల అమ్మ వాడిని ఇక్కడ వదిలేసింది?! వాడికి మటుకు ఉండదూ, వాళ్ల అమ్మ దగ్గరకి వెళ్లాలని? తాతయ్యకి చెప్పాలి- 'ఇక్కడ అందరికీ హిందీ, ఇంగ్లీషు నేర్పండి; నాకేమో తెలుగు నేర్పండి అని'.." అనుకున్నాడు బిట్టు.


ఒక రోజు ప్రొద్దున్నే కమలమ్మ ఒక చిన్న పిల్లను వెంటపెట్టుకొని వచ్చింది. దావీద్ చెల్లెలట. 'చిట్టి'- పది, పదకొండేళ్లు ఉంటాయేమో.

ఆ అమ్మాయి వాళ్ల అమ్మమ్మ వెనుకే తిరుగుతూ పనులు చేస్తోంది. బిట్టు నిద్ర లేచి కూర్చొని, ఆ అమ్మాయి చేసే పనుల్నే గమనిస్తున్నాడు. 'అంత చిన్నపిల్ల చేత పనులు చేయించకు కమలా’ అంటోంది అమ్మమ్మ.

"ఏం చెయ్యనమ్మా, అక్కడ నా కూతురు ఇంటి బరువు మొయ్యలేక కష్టపడుతోంది; అల్లుడా, ఇల్లు పట్టించుకోడు; నాకు ఆరోగ్యం బాగోలేక నీరసం అయిపోయానని, 'నీకు తోడుగా ఉంటుంది- దీనికి కూడా పని నేర్పు' అని పంపింది ఈ చిన్నదాన్ని. ఏమాటకు ఆమాటే చెప్పుకోవాలమ్మా, దీని చురుకుదనమూ, తెలివితేటలూ- మీలాంటి పెద్దవారి ఇళ్లల్లో ఉండాల్సిన పిల్ల!’ అంటూ కళ్లు తుడుచుకుంది కమలమ్మ.

‘అయ్యో, బాథపడకు. దీన్ని, దావీదుని ఇద్దరినీ చదివిద్దాంలే; మన సారున్నారు, చూసుకుంటారు!’ అంటూ ఓదార్చుతోంది అమ్మమ్మ.

బిట్టుకి ఎందుకనో చిట్టి చాలా నచ్చింది. అమ్మమ్మ వెనకాలే చిన్న చిన్న పనులు అందుకుంటోంది ఆ పాప. తాతమ్మకి కళ్లజోడు, చేతికర్రా అందిస్తోంది.

ఆ రోజు సాయంత్రం తాతయ్యతో సైకిల్ మీద వెళ్తుంటే వీరబాబు షాపు దగ్గర దావీదు కనిపించలేదు. ‘తాతయ్యా, దావీదు చెల్లెలు వచ్చింది ఈ రోజు. దావీదు ఊరెళ్లిపోయాడా? షాపులో కనిపించటం లేదు?!’ అంటూ ఆరా తీసాడు.

‘అవునా?! వీరబాబు మరి నాకు ఏమీ చెప్పలేదే?! సరే పద, వాళ్ల ఇంటివైపు వెళ్లి చూద్దాం!’ సైకిలును వీరబాబు ఇంటివైపు తిప్పారు తాతయ్య.

బిట్టూ సైకిల్ దిగి, వాళ్ళ ఇంటి గుమ్మం ముందు నిలబడి, ‘చిట్టీ’ అంటూ పిలిచాడు. ఇంట్లోంచి ఎవ్వరూ రాలేదు గానీ, ఇంటి వెనకనుండి ఎక్కడినుండో పరుగెత్తుకొ-చ్చారు దావీదు, వాడి చెల్లెలు. దావీదు చేతిలో ఏమున్నదో చూడగానే బిట్టు కళ్లు సంతోషంతో మెరిసిపోయాయి: ఏముంద-నుకుంటున్నారు? ఒక చిన్న- నల్ల- కుక్కపిల్ల!! దాని మెడకి తాడు కట్టి, చేతిలో పట్టుకొని ఉన్నాడు దావీదు! బిట్టు ఎన్నాళ్ళుగానో అడుగుతున్నాడు అమ్మని-నాన్నని: "మనం ఒక కుక్కపిల్లని పెంచుకుందాం" అని. ఇప్పుడు ఆ కుక్కపిల్లని చూసాక, అకస్మాత్తుగా దావీదు తన ప్రాణ స్నేహితుడిలా కనిపించాడు బిట్టుకి: ‘దావీదూ, నాకు ఆ కుక్కపిల్లని ఇస్తావా?’ ఆశగా అడిగేసాడు.

"అలా ఎవరినీ, ఏదీ అడక్కూడదు" అని అమ్మ ఎప్పుడూ చెప్పేదంతా మరిచే-పోయాడు వాడు ఆ క్షణాన. అట్లా వాడు ఆశగా అడగ్గానే దావీదు కూడా ఏమీ మాట్లాడకుండా కుక్కపిల్లని బిట్టుకి అందించాడు.

‘రెయిన్ బో! కమాన్!’ అని పిలిచాడు బిట్టూ.

‘అదేంటి, దాని పేరు మార్చేసావు? నేను టైగర్ అని పెట్టాను, దాని పేరు?!’ అన్నాడు దావీదు.

‘కానీ రెయిన్‌బో ఇంకా బావుంది కదా? మనందరికీ ఇంద్రధనస్సు చూస్తే బోలెడు ఇష్టం కదా, అలాగే దీన్ని చూసినా అంతే సంతోషంగా ఉందని, అట్లా పిలిచాను. టైగర్ అంటే పాత పేరే కదా!’ అది తన సొంత కుక్కపిల్ల అన్నట్టు చెప్పేసాడు బిట్టు. ఏమనుకున్నాడో కానీ దావీదు చెల్లి వైపు చూసాడు. చిట్టితల ఊపింది ‘అవును- రెయిన్‌బో పేరు బావుందన్నయ్యా’ అంటూ బిట్టు పెట్టిన పేరుని బలపరిచింది.

తను అడగ్గానే దావీదు అలా రెయిన్‌బోని ఇచ్చెయ్యటం బిట్టుకి చాలా నచ్చింది.

అంతలో పెరట్లోంచి కమలమ్మ బయటికొచ్చి, ‘పట్టుకెళ్లు బాబూ! మీరైతే దీనికి పాలు, అన్నం, బిస్కెట్లు పెడతారు’ అంది నవ్వుతూ.

‘అక్కడ నువ్వు ఏం చేస్తున్నావ్?’ అన్నాడు, లోపలేదో తనకి తెలియని విషయం ఉందని పసిగట్టిన బిట్టు.

కమలమ్మ వాడిని పెరట్లోకి పిలుస్తూ ‘ఇలా రా, బాబూ, ఇదిగో, మా గేదెని చూడు, దావీదు దీనికి ‘కరీనా’ అని పేరెట్టేడు. అంటే ఏంటో నాకు తెలీదు కానీ, 'కరీనా!' అని పిలిస్తే చాలు- మా అమ్ములు- అదే, మా గేదె- పలుకుతుందిప్పుడు’ అంది ఉత్సాహంగా.

బిట్టు వెంటనే ‘కరీనా!’ అని పిలిచాడు. గేదె తలత్రిప్పింది. బిట్టు మళ్లీ మళ్లీ పిలిచాడు. 'అది వాడివైపే చూసింది కొంత సేపు'

‘దాని పొట్ట ఎందుకు అంత లావుగా ఉంది?’ అన్నాడు బిట్టూ దానివంక పరీక్షగా చూస్తూ.

‘మా కరీనా ఈ రోజో రేపో ఈనుతుంది బాబూ, అందుకే...’

‘ఈనుతుందా, అంటే....?’ అంటే?!

‘ఒక బుజ్జి గేదె పిల్ల పుడుతుంది’ సమాధానం చెప్పింది చిట్టి.

బిట్టు సంతోషానికి అంతులేదు. ఒక చేత్తో రెయిన్బో గాణ్ణి పట్టుకుని గేదె వైపు ఆసక్తిగా చూస్తూ నిలబడ్డాడు.

"ఈ రెండు మూడు రోజుల్లో ఎప్పుడైనా ఈనచ్చు బాబూ! ఈనిన తర్వాత నువ్వు కూడా వచ్చి మా బుజ్జి గేదె పిల్లను చూద్దువు" చెప్పింది కమలమ్మ.

తను రెయిన్‌బోని తీసుకెళ్తున్నా దావీదు ఏమీ అనలేదు. దాంతో బిట్టుకి దావీదు పూర్తిగా నచ్చేసాడు. రెయిన్బోని ఇంటికి తెస్తూ బిట్టు అమ్మ గురించి కూడా ఆలోచించాడు-

కుక్కపిల్లని పెంచుకుందామంటే అమ్మ ఏమంది? ఎన్ని నియమాలు చెప్పింది?! అమ్మకి క్రమ శిక్షణ ఎక్కువే! 'కుక్కపిల్లకి నువ్వు రోజూ స్నానం చేయించి శుభ్రంగా చూసుకోగలిగితే కొనిస్తాను' అన్నది.

రెయిన్బోని చూసి బిట్టుకి కవిత్వం ఆగకుండా వచ్చేసింది:

చిట్టి, నేనూ, దావీదూ!
బుజ్జి రెయిన్బో మా అందరి నేస్తం!
పరుగుపందెంలో వాడు!
మేడ ఎక్కేస్తాడు చూడు!

మా పాటలు, ఆటలు అన్నీ వాడికే!
బిస్కెట్ ఇస్తే తోకాడిస్తాడు,
మమ్మల్నందర్నీ ప్రేమిస్తాడు,
అల్లరి అంటే వాడే, నేస్తం అంటే వాడే!
దావీదు ఇప్పుడు నా నేస్తం కూడా!

ఆ మర్నాడే కమలమ్మ జున్ను పాలు పట్టుకొచ్చింది. అమ్మమ్మ జున్ను చేసే హడావుడిలో ఉంది. బిట్టు అదంతా గమనిస్తూ అక్కడే కూర్చున్నాడు. అమ్మమ్మకి సహాయంగా ఏలకులు పొడి చేసి ఇచ్చాడు కూడా. అమ్మమ్మ వండిన జున్ను వాడికి తెగ నచ్చేసింది. ఆ తర్వాత దావీదు ఇంటికి వెళ్లి బుజ్జి దూడని ముట్టుకుని కూడా చూసాడు. ఆనందంతో గెంతులేసాడు. ఆ తర్వాత ఇంటికొచ్చి తాతయ్యని, అమ్మమ్మని అడిగాడు- "మనం‌ ఒక గేదెని కూడా పెంచుకుందామా?" అని.

‘అది పెద్ద బాధ్యతరా! కావాలంటే నువ్వే ఎప్పుడైనా కమలమ్మ ఇంటికి వెళ్లి, ఆ బుజ్జి దూడతో ఆడుకో! దూడని మనం సరిగ్గా చూసుకోలేకపోతే పాపం, దానికి కష్టం కాదూ?!’ అంది అమ్మమ్మ.

"రెయిన్‌బోని పెంచుకునే నేను బర్రెదూడని ఎందుకు పెంచుకోలేను?' అని కొంచెం ఆలోచించాడు గానీ, తర్వాత 'అమ్మమ్మ చెప్పిందంటే అదేదో చాలా కష్టమే అయి ఉంటుంది' అని అర్థం చేసుకున్నాడు బిట్టు.

అట్లా అమ్మమ్మ ఊళ్ళో దావీదు, చిట్టి బిట్టుకు స్నేహితులైపోయారు.

(తర్వాత ఏమైందో వచ్చే సంచికలో..)