కార్తీక్‌ ఒక అల్లరి పిల్లవాడు. వాడు, వాళ్ల అమ్మ ఇద్దరూ ఒక టౌన్‌షిప్ చివర్లో ఉండేవాళ్ళు. వాళ్ల టౌన్‌షిప్‌లో వాళ్ళంతా చదువుకునేందుకు ఒక స్కూల్ ఉంది. కార్తీక్ ఆ స్కూల్‌లోనే చదువుతాడు.

కార్తీక్‌ బాగానే చదువుతాడుగానీ, వాడికి చెడ్డ అలవాటు ఒకటి ఉండేది: స్నేహితుల వస్తువుల్ని వాడు దొంగలించేవాడు. వాళ్ళ పెన్నులు, పెన్సిళ్ళు, ఇరేజర్లు ఏవి దొరికితే అవి- మాయం చేసేసేవాడు.

ఈ సంగతి తెలిసాక వాళ్ల అమ్మ వాడికి చాలా సార్లు చెప్పింది "ఒరే! వేరేవాళ్ల వస్తువులు తీసుకోకూడదు; మళ్ళీ వాళ్ళు ఏడుస్తారు కదా! మనకు ఏమైనా వస్తువులు కావాలంటే మనమే సొంతగా కొనుక్కోవాలి" అని. అయినా వాడు వినేవాడు కాదు.

అట్లా చాలా మంది పిల్లల వస్తువులు పోయినై. చివరికి వాళ్ల తరగతి ఉపాధ్యాయుడు నిశ్చయించుకున్నాడు- "ఈ పని ఎవరు చేస్తున్నారో తప్పక కనుక్కుంటాను" అని.

ఆ రోజున ఆయన తరగతిలోనికి రాగానే పిల్లలు కొందరు లేచి కంప్లెయిన్ చేసారు. "మా వస్తువులన్నీ పోతున్నై సర్, ఎవరో తీసుకెళ్ళిపోతున్నారు!" అని.

ఆయన కొంతసేపు "ఆస్తిహక్కు" గురించి మాట్లాడి, "సరేలెండి! నాకు ఇట్లాంటి పనులన్నీ ఎవరు చేస్తున్నారో ముందుగానే తెలుసు. అయితే అందరి ముందూ వాళ్ళెవరో చెప్పేస్తే మరి వాళ్ళు చాలా బాధ పడతారు- అందుకని, ప్రస్తుతానికి వాళ్ళ పేరు బయట పెట్టటం లేదు. ఒక పని చేస్తాను- సాయంత్రం వరకూ సమయం ఇస్తాను. ఆలోగా వాళ్ళు సొంతంగా ముందుకొచ్చి, నా ముందు నిజం ఒప్పుకుంటే, ఇక వాళ్ళను ఏమీ అనను. అట్లా ఎవ్వరూ ముందుకు రాకపోతే అప్పుడింక చెయ్యగలిగేది ఏముంది, వాళ్ల పేరు ఏంటో నేనే చెప్పేస్తాను అందరిముందూ!" అన్నాడు.

దాంతో కార్తీక్‌కి భయం వేసింది. అందరిముందూ తన పేరు చెబితే పిల్లలంతా తనని ఎగతాళి చేస్తారు, పేరు పెడతారు. దానికంటే వెళ్ళి ఉపాధ్యాయుడి ముందు నిజం ఒప్పుకోవటం మంచిది" అనుకున్నాడు.

ఆరోజు తను ఇంటికి వెళ్ళే ముందు కార్తీక్‌ ఉపాధ్యయుడి దగ్గరకు వెళ్ళి నిజం చెప్పాడు. క్షమించమని అడిగాడు. కార్తీక్‌ తనంతట తానే నిజం చెప్పినందుకు ఉపాధ్యాయుడు చాలా సంతోషించాడు. "నువ్వు తీసుకున్న వస్తువులన్నీ రేపు తిరిగి ఇచ్చేయి. మళ్ళీ ఎప్పుడూ ఇతరుల వస్తువులను దొంగిలించకు- సరేనా?!" అని చెప్పాడు.

"సరే" అని, ఆయన చెప్పినట్లే చేసాడు కార్తీక్.

ఆ తర్వాత అతను ఇక మళ్ళీ ఎప్పుడూ ఇతరుల వస్తువులను దొగలించలేదు.

అతనిలోని మార్పుని చూసి వాళ్ళ అమ్మ కూడా చాలా సంతోషించింది.