"చరణ్! గంట నుండీ కార్టూన్స్ చూస్తున్నావు. ఇంతకీ హోం వర్క్ చేశావా, లేదా?!" అరిచింది అమ్మ.

చరణ్ నాలుక కొరుక్కున్నాడు. "లేదమ్మా! మర్చి పోయాను" అన్నాడు. ఆ తర్వాత మెల్లగా "ఇవాళ్ల హోంవర్కు చెయ్యనులేమ్మా, చెయ్యి నొప్పిస్తూ ఉంది" అన్నాడు బద్ధకంగా.

"ఒరేయ్! త్వరగా హోంవర్కు పూర్తి చేస్తే నీకో మంచి కథ చెప్తా" అంది జ్యోతి.

చరణ్‌కి కథలంటే చాలా ఇష్టం. తల్లి 'కథ' అనగానే వాడి చెయ్యి కదిలింది. చకచకా హోంవర్కు పూర్తిచేసాడు. ఆ వెంటనే కథ చెప్పడం మొదలు పెట్టింది జ్యోతి:

గోదావరి సముద్రంలో కలిసే చోట అమరాపురం‌ అనే ఊరు ఒకటి ఉండేది. ఆ ఊళ్లో ఉండే సోము ఉప్పు వ్యాపారం చేసేవాడు. అతనికి ఒక గుర్రం ఉండేది. రోజూ ఉప్పు మూటలు కట్టి నది ఆవలి ఒడ్డుకు తీసుకెళ్ళి అమ్మేందుకు ఈ గుర్రాన్ని వినియోగించేవాడు సోము.

ఒకసారి రోజూలాగే ఉప్పు మూటల్ని గుర్రానికి కడుతూ, "ఇదిగో, వీటిని తీసుకెళ్ళి నది అవతలి వైపున వేసి, వెనక్కి తిరిగి రా. ఆలోగా నేను మరో రెండు మూటలు నది ఒడ్డుకు చేరుస్తాను. ఒకసారి నువ్వు వెనక్కి వచ్చాక, ఈ రెండు మూటల్ని కూడా అవతలి ఒడ్డుకు తీసుకుపోయి, మొత్తం ఉప్పునూ అమ్ముకు వద్దాం!" అని చెప్పాడు సోము.

గుర్రం "సరే" అని తల ఊపి రెండు ఉప్పు మూటలు తీసుకొని, నది ఒడ్డుకు చేరుకొని, నది దాటబోయింది. నదిలో నీళ్ళు నిండుగా ప్రవహిస్తున్నాయి. అట్లా నది దాటుతున్న గుర్రానికి అకస్మాత్తుగా నది మధ్యలో కాలు జారింది- మూటలు రెండూ నదిలో పడ్డాయి.

“అరే! ఎంత పనైంది!” అనుకున్న గుర్రం నానా తంటాలు పడి మూటల్ని మళ్ళా తన వీపుకెత్తుకున్నది. ఐతే ఇప్పుడు బస్తాలు తేలిక బారాయి! నదీ ప్రవాహం కారణంగా మూటల్లోని ఉప్పు కరిగిపోయిందన్న మాట!

దాంతో గుర్రానికి చాలా సంతోషం వేసింది: "రోజూ ఇట్లాగే చేస్తే బలే ఉంటుంది కదా, ఎక్కువ బరువు మోసే ఖర్మ ఉండదు!” అనుకున్నది తనలో తాను.

అయితే ఆ రోజున సోము అమ్మిన ఉప్పుకు ఎప్పుడూ వచ్చేదానికంటే తక్కువ డబ్బు వచ్చింది. "మూటలు తేలిక ఎందుకు ఐనాయబ్బా, పొరపాటుగా నేనే ఏమైనా తక్కువ మూటలు కట్టానేమో" అనుకున్నాడతను.

రెండో రోజున సోము మరింత జాగ్రత్తగా మూటలు కట్టాడు. “ఇవాళ్ళ తూకం బాగా వస్తుందిలే!” అనుకున్నాడు. ముందు రెండు మూటలు గుర్రానికి కట్టి పంపాడు.

సుఖం మరిగిన గుర్రం నదిలో మునిగి, కొంత ఉప్పు కరిగిపోయాక, ఆ బస్తాలను అవతలివైపున పడేసి తిరిగి వచ్చింది. ఆ రోజు కూడా ఉప్పు మూటలు తక్కువ బరువే తూగాయి. "ఎందుకు, రోజూ ఇట్లా నష్టం వస్తున్నది?” అని అనుమానించిన సోము మరుసటి రోజున గుర్రం మీద రెండు మూటలు వేసి, దాని వెనకనే తనూ బయలుదేరి పోయాడు.

యజమాని వెనకే ఉండటం చూసుకోని గుర్రం ఆ రోజున కూడా నదిలో మునిగింది. కొంత ఉప్పు కరిగాక, పైకి లేచి అవతలి ఒడ్డుకు చేరుకున్నది.

"ఒహో! ఇదంతా దీని పనేనా? ఇంత మోసం చేస్తున్నదే?! బుద్ధి చెప్పాలి!” అనుకున్న సోము, మరుసటి రోజున ఉప్పుకు బదులుగా పెద్ద పెద్ద దూది మూటలు వేశాడు దాని మీద.

నది దాటబోయిన గుర్రం రోజూలాగే నది మధ్యకు రాగానే నీళ్ళలోకి మునిగింది. అయితే కొట్టుకు పోయేందుకు ఇప్పుడది ఉప్పు కాదుగా? తేలికైన దూది అంతా నీళ్ళు పీల్చుకొని బరువెక్కిపోయింది!

అంత బరువును లాగలేని గుర్రం‌ అటు మునగలేక, ఇటు ఒడ్డుకు రాలేక, నానా తంటాలూ పడింది!

దాని వెనకే వచ్చిన సోము "హ..హ..హ…!” అని నవ్వి, "చూడు గుఱ్ఱమా! నేను నా పనిని ప్రేమిస్తాను, ఎంచక్కా కష్టపడి పని చేస్తాను. నీలాగా సోమరిని కాదు నేను. నిజానికి నువ్వు కూడా ఇట్లా సోమరిగా ఉండకూడదనే, నేను నీకు బుద్ధి చెప్పింది!" అన్నాడు. అటుపైన గుర్రం తను చేసే పనిని ప్రేమించటం నేర్చుకున్నది.

అమ్మ ఈ కథ చెప్పి, "చూసావా చరణ్! సోమరితనం వల్ల ఎవ్వరూ ప్రయోజకులు కారు. అందుకని ఏనాడూ నీ పనిని నువ్వు వాయిదా వేయకు. చేయవలసిన పనిని చేస్తూ పోతుంటే విజయం నిన్నే వరిస్తుంది" అని అమ్మ సుద్దులు నేర్పింది.