అనగనగా ఒక చిలుక ఉండేది. ఆ చిలుకకు ఒక ప్రాణ స్నేహితురాలు. అది ఒక టమాటా.

ఒకసారి వాళ్ళిద్దరూ గుడికి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే, దారిలో వాళ్లకు ఒక మేక ఎదురైంది. ఆ మేక కాళ్ళు ముళ్ళ కంపల్లో ఇరుక్కుని ఉన్నాయి. అది తన కాళ్ళను బయటికి లాక్కునేందుకు ప్రయత్నించిన కొద్దీ ముళ్ళు ఇంకా గట్టిగా దిగుతున్నాయి; అది నొప్పి భరించలేక కళ్ళ నీళ్ళు కారుస్తున్నది.

దాన్ని చూసి చిలుకకు జాలి వేసింది. సహాయం చేయాలని అనుకుంది. కానీ ఎలాగ? టమాటాకేసి చూసింది. టమేటాకూడా సరేనన్నట్లు తల ఊపింది.

వెంటనే అవి రెండూ మేక దగ్గరకు వెళ్ళి, "నువ్వు కొంచెం ఆగు. ఓపిక పట్టు. మేం నీకు నేను సహాయం చేస్తాం!" అని కంపతో‌ కుస్తీ పట్టటం మొదలెట్టాయి. అయినా ఏమాత్రం లాభం లేకపోయింది. ముళ్ళు అన్నీ గీసుకుపోయి మేక కాలునుండి రక్తం కూడా కారసాగింది.

"అయ్యో! ఇప్పుడెలాగ?" అని అవి రెండూ ఆలోచనలో పడ్డాయి.

అంతలో అటుగా పోతున్న ఆపిల్‌ వచ్చింది అక్కడికి- "ఏం చేస్తూన్నారు, సోదరులారా?!" అంటూ.

"పాపం, ఈ మేకను చూడు- దాని కాలు ముళ్ళలో ఇరుక్కుపోయింది. దానికి చాలా నొప్పి పుడుతున్నది. ఎలాగైనా దాన్ని ఈ ముళ్ళ బారినుండి తప్పించాలని ప్రయత్నిస్తూన్నాం" అన్నాయి చిలుక, టమాటా.

ఆపిల్ మారు మాట్లాడకుండా పోయి రెండు కర్రలు తెచ్చింది. ఒక కర్రని మేక కాలు ముందువైపునుండి, మరో కట్టెను దాని కాలు వెనకవైపునుండి దూర్చింది ముళ్ళ కంపలోకి. "ఇదిగోండి- ఈ కర్రల్ని ఇద్దరూ వేరు వేరు వైపులకు లాగండి" అన్నది. దాంతో‌ ముళ్ళ కంప రెండుగా చీలి, మేక దాని మధ్యలో నిలబడగల్గింది.

"ఆగండి- మీరిద్దరూ ఇట్లానే పట్టుకొని ఉండండి- నేను ఇంకో‌ ఉపాయం చేస్తాను" అని ఆపిల్ దొర్లుకుంటా వెళ్ళి కుర్చీని పిల్చుకొచ్చింది. కుర్చీ చెక్కది కదా, దానికి ముల్లులంటే భయంలేదు. చిలుక, టమేటా లాగి పట్టుకున్న ముళ్ళ కంచెను అది కాస్తా పైకి నెట్టేసింది. అటుపైన మేకను తన మీద కూర్చోపెట్టుకొని యింటికి తీసుకువెళ్ళి కాలికి కట్టుకట్టింది. మేకకు బాగయ్యేంత వరకు టమోట, ఆపిల్ కూడా అక్కడే ఆగాయి.

ఆలోగా చిలుక,టమోటా చాలా పాటలు రాసాయి; కొన్ని కొన్ని పాటలు పాడాయి కూడా.

"ఒకటే ఒకటే ఒకటే
మనమంతా ఒకటే
మనందరికీ తల ఒక్కటే
తలక్రింద ఉండే ముఖం ఒక్కటే
ముఖంలో ఉండే ముక్కు ఒక్కటే
ముక్కు కింద ఉండే నోరు ఒక్కటే,
నోటిలోఉండే నాలుక ఒక్కటే
నాలుక పుట్టించే మాట ఒకటే!" అని.