I

వెంగళప్ప ఓసారి స్టేషన్లో నిలబడి ఉన్నాడు- రైలుకోసం ఎదురు చూస్తూ. అంతలో అక్కడే నిల్చొని ఉన్న కుర్రవాడొకడు అడిగాడు-

కుర్రాడు: అంకుల్! టైమెంతయిందంకుల్?

వెంగళప్ప: సారీ!

కుర్రాడు: ఎందుకు అంకుల్, సారీ?!

వెంగళప్ప: నేను చెప్పనయ్యా, టైం ఎంతైందో చెప్పేది లేదు.

కుర్రాడు: అదే సర్, నేను అడుగుతున్నది! ఎందుకు చెప్పరు, అని!

వెంగళప్ప: ఓహో! నీకు కారణం‌కూడా చెప్పాలా?! సరే అయితే- విను. నేను నీకు ఇప్పుడు టైమెంతయిందో చెప్పాననుకో, నువ్వు కొంచెం సేపు అయ్యాక మళ్ళీ టైం అడుగుతావు. ఆ తర్వాత నా పేరు అడుగుతావు. నీ పేరు చెబుతావు. ఆ తర్వాత, మా రైలు రాగానే నువ్వూ అందులోనే ఎక్కుతావు- ఎక్కి నాతో పాటు ప్రయాణం చేసి పరిచయం‌ మరింత పెంచుకుంటావు. ఆ తర్వాత మా స్టేషను వచ్చినప్పుడు నాతోబాటు నువ్వూ దిగుతావు. అక్కడ నన్ను రిసీవ్ చేసుకునేందుకు మా అమ్మాయి వచ్చి ఉంటుంది. మా అమ్మాయి చాలా అందంగా కూడా ఉంటుంది; దాంతో నువ్వు మా అమ్మాయిని పెళ్ళి చేసుకుంటానని అడుగుతావు. మా ఆవిడకి నువ్వు నచ్చుతావు; దాంతో‌మీరంతా నామీద ఒత్తిడి తెస్తారు- అయినా నేను ఒప్పుకునేది లేదు- ఎందుకంటే నువ్వు ఏమాత్రం ముందుచూపు లేని వాడివి-

కుర్రాడు: అట్లా ఎందుకంటారంకుల్?! మీరెలా-

వెంగళప్ప: నువ్వింకేమీ మాట్లాడక్కర్లేదు నాయనా, నీ చేతికి గడియారం లేదనగానే నాకు నీ గురించి మొత్తం తెలిసిపోయింది- నేను మాత్రం‌ ఈ పెళ్ళికి ఒప్పుకునేది లేదుగాక లేదు! (కుర్రాడు మూర్ఛపోయాడు)

II

ఒకసారి ఓ వెంగళప్ప పని కోసం వెతుక్కుంటూ ఇల్లిల్లూ తిరగసాగాడు- "అయ్యా! నాకు ఏమైనా పని ఉంటే ఇవ్వండయ్యా. ఇంతకు ముందు వేరే ఇంట్లో పనోడిగా చేశాను" అంటూ.

ఆ వీధిలో ఒక ఇంటి యజమానికి పనివాడి అవసరం ఉంది. ఆయన వెంగళప్ప కేసి ఎగాదిగా చూసి అడిగాడు- "ఇంతకు ముందు వాళ్ళు నిన్ను ఎందుకు పనిలోనుండి తీసేశారు?" అని.

"అయ్యా, అదే నాకు అర్థం కాలేదయ్యా" చెప్పాడు వెంగళప్ప- "మా యజమాని ఒకసారి 'కాళ్లు నొప్పి, కాళ్లునొప్పి' అన్నాడయ్యా. నేను ఆయన కాళ్లు పిసికాను. బాగుందన్నాడు. మళ్ళీ ఒకసారి 'భుజం నొప్పి, భుజం నొప్పి' అన్నాడయ్యా. నేను వెళ్ళి భుజాలు నొక్కాను; 'చాలా బాగుందిరా' అని మెచ్చుకున్నాడు. తర్వాత ఇంకోసారి 'నడుము నొప్పి, నడుమునొప్పి!' అని మొత్తుకున్నాడయ్యా; సరేనని నేను నడుము పిసికాను. 'బలే ఉంద'ని మెచ్చుకున్నాడయ్యా.

తరువాత కొన్ని రోజులకు 'మెడ నొప్పి మెడనొప్పి' అన్నాడయ్యా. 'దానిదేముంది' అని నేను..
ఇంటి యజమాని తెరిచిన నోరును తిరిగి మూయలేదు.