అనగనగా తాడిపత్రిలో రాముడు, నాగలక్ష్మి అనే దంపతులు ఉండేవారు. వాళ్లకు లేకలేక ఒక కొడుకు పుట్టాడు. పేరు రంగయ్య. ఆ పిల్లవాడి ముద్దు మురిపాలకు హద్దులు ఉండేవి కావు. 'కాలు క్రింద పెడితే కందిపోతాడు' అన్నట్లు చాలా సున్నితంగా చూసుకునేవాళ్ళు తల్లిదండ్రులు.

మెల్లగా బడికెళ్ళే వయసు వచ్చింది రంగయ్యకు. ప్రతిరోజూ కొడుక్కు చక్కగా ఉతికిన బట్టలు వేసి, ఖర్చులకు పది రూపాయలు ఇచ్చి, బడికి పంపించేవాడు రాముడు.

రంగయ్య పిల్లవాడుగా ఉన్నంత కాలం అమ్మానాన్నలు చెప్పినట్లు బాగా చదువుకున్నాడు. కానీ, రాను రాను- రంగయ్య వయసు పెరిగింది; పెద్దవాడయ్యాడు; వక్రబుద్ధులు పెరిగాయి; తల్లిదండ్రులకు అబద్ధాలు చెప్పటం మొదలు పెట్టాడు; తెలివి కూడా పక్కదారి పట్టింది. బడికి వెళ్ళేటప్పుడు నాన్న ఇచ్చే డబ్బులు తీసుకుని, బడి ఎగ్గొట్టి, జులాయిగా తిరగటం మొదలు పెట్టాడు.

అమ్మానాన్నలు మాత్రం రంగయ్య బాగానే చదువుకుంటున్నాడని అనుకునే వాళ్ళు. వాళ్లకు రంగయ్య చేస్తున్న మోసం తెలియనే తెలియదు.

ఇట్లా రోజులు-నెలలు-సంవత్సరాలు గడిచినయ్. రంగయ్య పదో తరగతికి వచ్చాడు. తరగతికి అసలు సరిగా వచ్చేవాడే కాదు; పాఠాలు వినేవాడే కాదు; ఉపాధ్యాయులు చెప్పిన మాటలు వినేవాడు కాదు; చదువంటే అమిత అశ్రద్ధగా ఉండేవాడు. వాళ్ల అమ్మానాన్నలకు వాడి గురించిన వాస్తవాలు ఎవ్వరూ చెప్పనే లేదు: ఏమంటే, 'పిల్లాడి సంగతి తల్లిదండ్రులకు వాడి గురించి తెలీకుండా ఎలా ఉంటుంది? చెబితే మనల్నే తప్పు పడతారు' అనుకున్నారు.

అంతలో పదవ తరగతి ఆఖరి పరీక్షలు రానే వచ్చాయి. రంగయ్యకు అక్షరాలు కూడా రావు! ఇంక ఏం రాస్తాడు? పదవ తరగతి ఫెయిల్ అయ్యాడు.

తల్లిదండ్రులు లబోదిబోమంటూ బడికి పరుగెత్తుకొచ్చారు- 'ఇదేంటి, మావాడు ఇన్నేళ్ళు చదివితే ఇప్పుడు ఇలా ఎందుకైంది?' అని అందరినీ‌ అడిగారు.

సంగతి తెలిసాక వాళ్ళ బాధకు అంతులేదు. ఆ బాధలో రంగయ్యను చితకబాదారు. 'ఇక లాభం లేదు' అని చదువు మాన్పించి రంగయ్యను కూలి పనికి పంపించారు.

రంగయ్యకు ఆ పని నచ్చలేదు- కానీ వేరే ఏ విద్యా రాదాయె! అట్లా కొన్నాళ్ళు గడిపాక, అమ్మానాన్నల సాయంతో ఓ ఆటో కొనుక్కొని నడిపించటం మొదలు పెట్టాడు.

గతాన్ని తలచుకొని రంగయ్య చాలా సిగ్గు పడ్డాడు. 'అయినా గడిచిన కాలం తిరిగి రాదు కదా, కనీసం ఇప్పటినుండైనా బాధ్యతగా మెసలుకుంటాను!' అని సక్రమంగా పని చేస్తూ పోయాడు.

ఆలోగా కుటుంబ బాధ్యతలు పెరిగాయి- పెద్దవాడౌతున్న కొద్దీ తండ్రి సంపాదన తగ్గింది. రంగయ్య ఆయనకు చేదోడు వాదోడుగా నిలిచాడు. సొంతంగా ఒక ప్యాసెంజరు జీపు కొనుక్కున్నాడు. 'మంచోడు' అనిపించుకున్నాడు.

ఇప్పుడు రంగయ్యకు ఇద్దరు పిల్లలు. వాళ్లను రోజూ ఇష్టంగా బడికి పంపుతున్నాడు. ఊరికే పంపటం కాదు- వాళ్ళు ఎట్లా చదువుతున్నారో పట్టించు-కుంటున్నాడు. అధ్యాపకులను కలిసి పిల్లల లోటు పాట్లు తెలుసుకుంటున్నాడు; వాటిని సరిదిద్దేందుకు శ్రమించి పని చేస్తున్నాడు. "పిల్లలు వృద్ధిలోకి రావాలి, జ్ఞానవంతులు కావాలి" అని తపిస్తున్నాడు.

మరి రంగయ్య కలల్ని పిల్లలు నెరవేరుస్తారో, లేదో- చూడాలి.