హుజుర్‌నగర్లో ఆరవ తరగతి చదువు-తున్నారు శ్రీకాంత్, నరేందర్. వాళ్ళిద్దరూ చాలా మంచి స్నేహితులు. ఒకరి కష్టాలు-సుఖాలు మరొకరు పంచుకునేవారు. ప్రతి పనినీ నిజాయితీగా చేసేవాళ్లు.


వాళ్ళిద్దరూ మంచిగా ఉండటం చూసి తరగతిలోని మిగతా పిల్లలకు ఈర్ష్యగా ఉండేది. దాంతో వాళ్ల మీద ఉన్నవీ, లేనివీ కల్పించి చెప్పి, ఉపాధ్యాయులకు వాళ్లంటే చెడు అభిప్రాయాన్ని కల్పించారు. అప్పటినుండీ ప్రతి ఉపాధ్యాయుడూ వాళ్ళనే నిందించడం మొదలుపెట్టారు. అన్నింటా అనుమానించ సాగారు.

అట్లా ఎన్ని నిందలు పడ్డా 'మన మంచికే' అనుకున్నారు వాళ్ళు. ఏమాత్రం బాధపడలేదు. తోటివారి మీద ఏమాత్రం కోపం పెంచుకోలేదు.

అంతలో SA-1 పరీక్షలు వచ్చాయి. శ్రీకాంత్, నరేందర్ ఇద్దరూ గదిలో చెరొక మూలనా కూర్చున్నారు. ఎవ్వరినీ ఏమీ అడగకుండా నిజాయితీగా పరీక్ష రాశారు.

వాళ్ళు రాసిన పేపర్లను వేరే బడి టీచర్లు దిద్దారు. తర్వాతి వారంలో మార్కులు వెళ్ళడించినప్పుడు చూస్తే, క్లాసు మొత్తం మీద శ్రీకాంత్‌కు, నరేందర్‌కు వచ్చినన్ని మార్కులు వేరే ఎవ్వరికీ రాలేదు!




అప్పుడు ఉపాధ్యాయులకు నిజం తెలిసింది. అటుపైన వాళ్ళతో మంచిగా ప్రవర్తించటం మొదలు పెట్టారు.

కోపాన్ని, ఆవేశాన్ని పనులు సాధించటం ద్వారా వ్యక్తం చేయాలి తప్ప, ఇతరులతో ఊరికే గొడవ పడి కాదు!