ఆకాశాలన్నింటికి రాజు న్యాన్‌కోపాన్. ఆ పేరుకు అర్థం "అన్నీ తెలిసిన వాడు, అన్నీ చూసేవాడు" అని. అతని కుడి కన్ను సూర్యుడు. పగటి పూట అతను దాన్ని తెరుస్తాడు. అతని ఎడమ కన్ను చంద్రుడు. దాన్ని అతను రాత్రి పూట తెరుస్తాడు.

మొదట్లో కథలన్నీ న్యాన్‌కోపాన్ దగ్గరే ఉండేవి. కానీ ఆ రోజుల్లో భూమి మీద నివసించే సాధారణ ప్రాణి- అనాన్సీకి గొప్ప ఆత్మ విశ్వాసం ఉండేది. తన సామర్థ్యం మీద తనకు చాలా నమ్మకం ఉండేది. తన తెలివి తేటల మీద, చాతుర్యం మీద అనాన్సీకి గొప్ప నమ్మకం ఉండేది.

"కథలన్నీ న్యాన్‌కోపాన్ దగ్గర ఉంటే ఎట్లా" అనుకున్నది అనాన్సీ. "నేను అంతకంటే గొప్ప కథల్ని అల్లగలను.." అట్లా‌ అనుకొని, అనాన్సీ భూమి మీద ఉండే అతి పెద్ద చెట్టు పైకెక్కి, ఆకాశ దేవుడితో నేరుగా మాట్లాడింది: "న్యాన్‌కోపాన్! నువ్వు నీ కథలన్నీ నాకు ఇచ్చేయచ్చుగా? నేను వాటిని నీకోసం చాలా చక్కగా కాపాడి పెడతాను" అన్నది.

న్యాన్‌కోపాన్ తన సూర్య నేత్రంతో ఈ చిట్టి- పొగరుబోతు- సాలీడును చూసాడు. "హీ హీ హీ" అని మెల్లగా నవ్వుకున్నాడు. "ఓ దానిదేముంది అనాన్సీ! నీకు ఎన్ని కథలు కావాలంటే నీకు అన్ని కథలు తీసుకోవచ్చు. కానీ అంతకంటే ముందు నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉన్నది. నేను కోరిన మూడు వస్తువులు తెచ్చిపెట్టాలి నాకు". "ఏంటా మూడు?" అడిగింది అనాన్సీ.

"ఊ.. ఊ.." అంటూ ఆలోచించాడు న్యాన్‌కోపాన్.

"కొండ చిలువ-ఆనిని, చిరుత పులి-ఆసిబోని, ఇంకా కందిరీగలు మోబోరోని-ఈ మూడూ తెచ్చిపెట్టు చాలు" అన్నాడు న్యాన్‌కోపాన్, "హా హా హా" అని పెద్దగా నవ్వుతూ. వేలెడంత లేని ఈ పురుగు, 'భయంకరమైన అతి పెద్ద జంతువుని తేవటం' అన్న అలోచనకే అతనికి నవ్వు ఆగలేదు.

కానీ అనాన్సీకి ఈ పందెం చాలా నచ్చింది. "సరే" అన్నదది. "పందెం అంటే పందెమే".

అట్లా అది తన ఎనిమిది కాళ్ల మీద ప్రయాణం మొదలుపెట్టింది- కొండ చిలువను, చిరుత పులిని, కందిరీగను పట్టుకొచ్చేందుకు.

పోతూ పోతూ ఉంటే దట్టమైన అడవి ఒకటి వచ్చింది. అక్కడ అనాన్సీ బాగా వెతికి, పొడుగ్గా-సూటిగా ఉన్న కట్టెనొకదాన్ని ఏరుకున్నది. ఆ తరువాత అది దాన్ని తీసుకెళ్లి, కొండ చిలువ ఉండే ఇంటి ముందు స్థలంలో పడేసి, ఆ కట్టె ప్రక్కన కూర్చున్నది.

ఆ రోజు సాయంత్రం కొండచిలువ ఇంటికి తిరిగొచ్చే సమయానికి దాని ఇంటి ముందు ఈ కట్టె, దాన్ని సునిశితంగా పరిశీలిస్తున్న అనాన్సీ కనిపించాడు దానికి!

"ఎనిమిది కాళ్ల సోదరా! ఇక్కడ ఏం చేస్తున్నావు?!" అని అడిగింది కొండ చిలువ.

"ఏం చెప్పను, నా కష్టాలు?!" అన్నది అనాన్సీ. "న్యాన్‌కోపాన్ తో ఒక పందెం వేసుకోవాల్సి వచ్చింది. 'నువ్వు ఈ కట్టె కంటే పొడుగు' అని నేను- 'కాదు- పొట్టి!' అని ఆయన! ప్రపంచంలో ఉన్నవన్నీ గమనించుకునే ఆయనకి 'నువ్వు తప్పు స్వామీ!' అని నిరూపిస్తే చాలు కదా అని ఇట్లా వచ్చా!" అన్నది అనాన్సీ.

కొండ చిలుక ఆనినికి పొడవాటి తన శరీరం అంటే చాలా ఇష్టం; దాన్ని బాణం లాగా నిక్కదీసి, నిటారుగా పడుకోవటం అంటే ఇంకా చాలా ఇష్టం. అందుకని అది 'తను ఆ కట్టె కంటే పొడవు' అని చూపించుకోవటం కోసం వెళ్లి దాన్ని ప్రక్కన పడుకున్నది.

మెరుపు వేగంతో అనాన్సీ తన చుట్టూ గూడు కట్టేస్తుందని గాని, తనను నిలువుగా ఆ కట్టెకు కట్టేస్తుందని గానీ అస్సలు ఊహించలేదు అది! కానీ ఇప్పుడు ఏం చేయగలదు పాపం, ఏ మాత్రం కదిలేకి లేకుండా ఉంది. అది ఇప్పుడు చేయగలిగిందల్లా తన పొడవైన వెండి నాలుకని గడ గడ లాడిస్తూ "జిత్తులమారి అనాన్సీ! నా కట్లు విప్పు! లేకపోతే చూసుకో!" అనటమే.

కానీ అనాన్సీ దాని మాటలు పట్టించుకోకుండా ఆకాశంకేసి చూసి "న్యాన్‌కోపాన్! పందెంలో మొదటి భాగం గెలిచాను! ఆనినిని నీకిస్తున్నాను!" అన్నది.

ఆకాశం నుండి న్యాన్‌కోపాను "నిజంగానే నువ్వు ఓ జిత్తుల మారి పురుగువి అనాన్సీ! ఎట్లాగో శ్రమ పడి దీన్ని పట్టుకున్నావు కానీ, మెరుపు వేగంతో పరిగెత్తే చిరుత పులి ఆసెబో నీ పాల పడదు- చూసుకో!" అన్నాడు.

"చూద్దాం" అన్నది అనాన్సి. కానీ 'చూడటం' అనేది అసలు దాని పథకంలో భాగం కానే కాదు. తన ఎడమ కంటిని అది ఇప్పుడు పూర్తిగా‌ కుట్టేసుకున్నది- ఆ కంటితో ఇక ఏమీ కనిపించదు. ఆపైన ఆ ఒంటి కన్ను సాలీడు అడవిలో ముందుకు పోయి, చిరుత పులి ఆసెబో నివాసం ఉండే చెట్టు కిందికి చేరుకున్నది.

చెట్టు కొమ్మ మీద కులాసాగా పడుకొని, కాళ్లు-పంజాలు కిందికి విలాసంగా జారవిడిచిన చిరుత పులి దాన్ని చూసి "ఏయ్ అనాన్సీ! జిత్తుల మారి అనాన్సీ! నీ కంటికి ఏమైంది?!" అని అడిగింది.

జిత్తులమారి సాలీడు "అయ్యో, ఏమి చెప్పమంటావ్! న్యాన్‌కోపాన్ నా కంటిని మూసి కుట్టేసాడు! అయితేనేమిలే, ఇప్పుడు నేను అద్భుతమైన వస్తువులన్నింటినీ చూడగల్గుతున్నాను. ప్రపంచాలు, నక్షత్రాలు- మొత్తం విశ్వం అంతా- నా కళ్ల ముందు ఆటలు ఆడుతున్నది. బహుశా దేవతలంతా ఇట్లానే చూస్తారేమో!" అన్నది ఆశ్చర్యపోతున్నట్లు.

"వావ్! ఇది నిజంగా దైవత్వమే!" నిర్ఘాంతపోయింది చిరుత పులి ఆసెబో. "కొంచెం నా కన్ను కూడా కుట్టేయరాదూ, ఆ అద్భుతాలేవో నేనూ చూస్తాను?!" అన్నది.

"నేను దాని కంటే ఇంకా మంచి పనే చేయగలుగుతాను" అన్నది అనాన్సీ. "నేను నీ రెండు కళ్ళూ కుట్టేస్తాను. దాంతో నువ్వు ఇక అన్ని రకాలుగానూ పూర్తిగా దేవుడివే అయిపోతావు!"

అది తన పని పూర్తి చేసే సరికి పాపం ఆసెబో పూర్తిగా గుడ్డిదైపోయింది. దాన్ని న్యాన్కోపాన్ దగ్గరికి నడిపించుకెళ్లటం మరింత సులభం అయిపోయింది.

"ఊఁ..సరే..సరే..సరే!" అన్నాడు న్యాక్రోపాన్. "చిట్టి జిత్తులమారి సాలీడు పిల్లా! నేను నీ తెలివి తేటలని బహుశా కొంచెం చిన్న చూపు చూసినట్టున్నాను.. కానీ ఇప్పుడే ఏమైంది? నీకు మిగిలి ఉన్న మూడో పని అన్నిట్లోకీ అతి కష్టమైన పని! ఎందుకంటే ఆ కందిరీగల కోపం ఎంత భయంకరమైనదంటే, వాటిని ఇప్పటి వరకూ ఎవ్వరూ లొంగదీసుకోలేకపోయారు!"

"వాటిని నీ దగ్గరకు తెస్తానని నేను పందెం కాసాను; వాటిని తెచ్చి తీరుతాను!" జవాబిచ్చింది అనాన్సీ, స్థిరంగా. కానీ ఆ కందిరీగల కోపం ఎట్లాంటిదో తెలిసిన న్యాన్‌కోపాన్ మటుకు, దీని మూర్ఖత్వాన్ని చూసి జాలిపడ్డాడు.

అనాన్సి ఆ మొబోరో కందిరీగలు కట్టుకున్న గూడు దగ్గరికి పోయాడు; తనతో పాటు ఓ పెద్ద గాజు జాడీనొకదాన్ని తీసుకెళ్లాడు. దాన్ని చూడగానే కందిరీగలన్నీ అనాన్సీ చుట్టూ మూగి 'బజ్' మంటూ "ఆ జాడీలో ఏముంది అనాన్సీ?!" అని అడిగాయి.

"ఊఁ..ఊఁ..ఏమీ లేదు!" జవాబిచ్చింది అనాన్సీ. "న్యాన్‌కోపాన్‌తో నేను ఒక పందెం కాశాను.

'మీరు ఎక్కడికైనా ఎగరగల్గుతారు గానీ ఈ జాడీలోకి మాత్రం ఎగరలేరు' అని ఆయనంటాడు. 'మీరు ఎక్కడికైనా ఎగురుతారు- చివరికి జాడీలోకి కూడా ఎగర గలరు" అని నేనంటాను. 'ఆయనే తప్పు' అని నా నమ్మకం; కానీ మీరు ఆ సంగతిని నిరూపించగలరా?"

"ఓఁ..దానిదేముంది?! మేము జాడీలోకి కూడా ఎగరగలం!" అన్నాయి కందిరీగలు కోపంగా. "అసలైనా మేం ఏం చేయగలమో, ఏం చేయలేమో చెప్పేందుకు ఆయనెవరు?! అస్సలు మమ్మల్ని ఏమనుకుంటున్నాడు ఆయన?" అని అరిచాయి అవి.

తమ మాటను నిరూపించుకోవటం కోసం అన్నీ ఒక జట్టుగా జాడీలోకి దూరాయి. ఒకసారి చివరి కందిరీగ వరకు లోనికి పోగానే జాడీ మూత పెట్టేశాడు అనాన్సీ.

మోబోరో కందిరీగల్ని కూడా తెచ్చిన అనాన్సీ తెలివి తేటల్ని చూసి న్యాన్‌కోపాన్ నిజంగానే ఆశ్చర్యపోయాడు. 'ఇంత చిన్న పురుగు, ఇంత భయంకరమైన కందిరీగలను పట్టుకోగలుగుతుందని ఎవరు అనుకోగలరు?' "నిజంగా, అనాన్సీ! నువ్వు నీ శక్తియుక్తుల్ని నిరూపించుకున్నావు! భూమి మీద ఉన్న జంతువులన్నిటిలోనూ నువ్వు గొప్పదానివని నిరూపించుకున్నావు! ప్రపంచంలోని కథలన్నిటినీ అల్లేందుకు కావలసిన అర్హతను సంపాదించుకున్నావు" అని ఆశీర్వదించాడు న్యాన్‌కోపాన్.

ఆ విధంగా అనాన్సి సాలీడు ప్రపంచంలోని కథలన్నిటినీ తెచ్చుకున్నది. ప్రపంచంలోవి అన్నీ కాకపోయినా, కనీసం ఘనాలోని కథలన్నీ అయితే వచ్చేసుంటాయి దాని దగ్గరికి.

ఆ తర్వాత అది ఆ కథల్నే ఇంకా ఇంకా అల్లుతూ పోయింది. అల్లుతూ పోయింది.. అట్లా కథలు అల్లుతూ అది ఎంత దూరం పోయిందంటే, తను వాటిని ఎక్కడెక్కడ అల్లిందో కూడా పూర్తిగా మర్చిపోయింది!