"ఏంటి వీడి సాహసం?!" అనుకుంటున్నారు కదూ? "వీడు పోయి డ్రాగన్‌తో యుద్ధం చేస్తాడు; వందలాది మంది వీరులను-యోధులను కాల్చేసే భయంకర డ్రాగన్‌ను వీడు ఎట్లా చంపుతాడో!” అని కంగారు పడుతున్నారు కదూ?!

నిజానికి వాడికి అలాంటి ఉద్దేశ్యాలు ఏమీ లేవు. ఎక్కడో దూరంగా 'కౌంటీ- గాల్వే' అనే చోట- ఊబిలో- నిప్పులు కక్కుతూ ఉండే డ్రాగన్‌ను ఎదుర్కునేందుకు ఇంత మంచి గుర్రం ఎక్కి పోయే ఉద్దేశ్యం వాడికి ఎంత మాత్రమూ లేదు.

తన 'కవచం కాని కవచంలో' డిబడిబలాడే బంగారు నాణేల చప్పుడుకు వాడి మనసు సంతోషంతో పల్టీలు కొడుతున్నది. ఇప్పుడు వాడు తను మళ్ళీ తన ఊరు డ్యులీక్‌కు ఎట్లా పారిపోవాలో, ఈ‌ డబ్బునంతా ఎంత బాగా ఖర్చు చేసుకోవాలో ఆలోచిస్తున్నాడు! భలే ఉంది కదూ వాడి తెలివి?!.

కానీ రాజు కూడా తెలివైన వాడేగా? ఆయన మాత్రం ఏం తెలివితక్కువవాడు?! తెలివైన వాళ్లందరి దగ్గరా వాళ్లకే సొంతమైన ట్రిక్కులు కొన్ని ఉంటాయి. రాజుగారు వాడికి ఈ గుర్రాన్ని ఊరికే ఇవ్వలేదు: దానికి ప్రత్యేకమైన శిక్షణ ఒక్కటి ఇచ్చి ఉన్నారు!

ఏ క్షణంలో అయితే వీరుడు దాని మీదికి ఎక్కి కూర్చున్నాడో, అదే క్షణంలో ఆ గుర్రం 'కౌంటీ గాల్వే' వైపుకు సూటిగా దూసుకు-పోయింది. మీద కూర్చున్న మన వీర యోధుడు ఏం చేసినా అది విననే లేదు!

ఏ నీళ్ళూ త్రాగకుండా, ఏ గడ్డీ మేయకుండా, ఏ తిండీ తిననీయకుండా అట్లా అది నాలుగు రోజుల పాటు ఏకబిగిన పరుగెత్తింది! దాని మీద కూర్చున్న నేతగాడు వణికిపోతూ‌ కళ్ళు మూసుకోవటం మినహా మరేమీ చేయలేకపోయాడు! చివరికి దూరంగా మంటలు, జనాల అరుపులు వినిపింవాయి. ఆ సరికి నిస్సత్తువ తోటీ, ప్రాణ భయంతోటి వణికి పోతున్న నేతగాడు "అదేనేమో డ్రాగన్, అదేనేమో! మంటలు కక్కుతోందే!! ఇప్పుడు ఎలాగ?!!” అనుకునేలోగా గుర్రం ఆ ప్రాంతానికి చేరుకునేసింది!

ఆ సరికి అడ్డ చేరిన జనాలంతా 'డ్రాగన్ డ్రాగన్' అని అరుస్తున్నారు. మన వీరయోధుడి గుర్రానికి ఎదురుగా పరిగెత్తు-కొస్తున్నారు. కాని గుర్రం మాత్రం వేరే దిక్కేదీ లేనట్టు, నేరుగా బురద నిండిన ఊబివైపు పరిగెత్తింది!. ఆ ఊబిలో కులాసాగా కూర్చొని నిప్పులు కక్కుతూ ఆవలిస్తున్న డ్రాగన్‌ను చూసే సరికి నేతగాడి పై ప్రాణాలు పైనే పోయాయి. కానీ డ్రాగన్‌ను చూసినా గుర్రం ఆగలేదు! తుపాకీలోంచి వెలువడిన తూటా మాదిరి సూటిగా డ్రాగన్ వైపుకు పరిగెత్తింది!

ఆఖరు క్షణంలో నేతగాడు తన చేతికందిన ఊడను ఒకదాన్ని పట్టుకొని గబగబా పైనున్న చెట్ల గుబురులోకి పాకాడు. గుర్రం మటుకు నేరుగా పోయి, ఆవలిస్తున్న డ్రాగన్ నోటిలోకి దూరి మాయమైంది!.

టక్కున నోరు మూసుకున్న డ్రాగన్ కొద్దిసేపు సంతోషంగా దాన్ని కరకరామని నమిలి, నాలుక బయటికి పెట్టి పెదిమలు నాక్కుంటూ, కళ్లు ఓసారి మూసుకొని తెరిచింది.

ఆ తర్వాత "ఎక్కడో ఏదో మంచి వాసన వస్తోంది" అన్నట్టు అది అటూ ఇటూ చూసి, ముక్కుపుటాలు ఎగరేసి, చివరికి పైన కొమ్మల్లో వణుకుతూ కూర్చున్న నేతగాడి మీద చూపులు నిలిపింది!

వాడిని చూడగానే దాని ముఖం ఇంకొంచెం వెలిగింది: "ఏయ్! నువ్వు ఇక నేరుగా క్రిందకి దిగొస్తే బాగుంటుంది! ఎందుకంటే నువ్వు ఇప్పుడు నా చేతికి చిక్కిన పిట్టవే! ఎటూ పోలేవు!! అందుకని, ఎంచక్కా వచ్చేయమ్మా, నా నోట్లోకి!!” అని నవ్విందది.

"లేదు! లేదు! నేను రానంటే రాను! దిగనంటే దిగను!” అని అరిచాడు నేతగాడు.

"అయితే నాకేమి లెక్క?!” అన్నది డ్రాగన్ "నా జేబులో ఖర్చు పెట్టేందుకు రెడీగా ఉన్న డబ్బులాంటివాడివి నువ్వు. నిన్ను ఎప్పుడంటే అప్పుడు తినవచ్చు. నువ్వు ఎక్కడికీ పోలేవు. ఎప్పుడో ఒకప్పుడు నా ఒళ్లో తప్పకుడా పడతావు" అని అది అక్కడే కూర్చొని, తన ముళ్ల తోకతో పళ్లు శుభ్రం చేసుకోవటం మెదలుపెట్టింది.

ఏమంటే అది ఆ సరికి ఒక్క గుర్రాన్నే కాదు ఓ ఊరు ఊరంతటినీ తినేసి ఉన్నది!. కడుపు నిండుగా ఉంది కదా, అందుకని దానికి వెంటనే మన నేతగాడిని తినాలని అనిపించలేదు. అట్లా అది కొంచెంసేపు అక్కడే కూర్చొని కునికి, కునికి చివరికి ఇక లాభం లేదని నేతగాడు ఎక్కిన చెట్టు చుట్టూ రిబ్బను మాదిరి మెలికలు తిరిగి, అలా సుతారంగా కళ్లు మూసుకున్నది! కొద్దిసేపటికల్లా ఉరుము ఉరుమినట్లు గొరకలు పెట్టడం మొదలు పెట్టిందది. అది గమనించిన మన నేతగాడు మెల్లగా‌ చెట్టు ఊడ పట్టుకొని క్రిందకి జారటం‌ మొదలు- పెట్టాడు. ఇంకొంచెం సేపట్లో నేలను తాకుతాడనగా…! ఏం చెప్పాలి?! వాడు ఊతంగా పట్టుకున్న ఊడ కాస్తా తెగిపోయింది! వాడు సూటిగా డ్రాగన్ మీదే పడ్డాడు!

కానీ అదృష్టం ఇంకా వాడిని వదిలినట్లు లేదు. పడటం పడటమే వాడు డ్రాగన్ మెడకు రెండు వైపులా కాళ్ళు వేసి పడ్డాడు. గబుక్కున నిద్ర లేచిన డ్రాగన్ మెలికలు తిరిగింది; విదిలించింది; వణికింది; శరీరంపైనున్న పొలుసులన్నీ ఒక్కటి ఒక్కటిగా ఊపింది; వాడిని కరిచేందుకు ప్రయత్నించింది; నాలుకతో అందుకోవాలని చూసింది- అయినా ఏమాత్రం లాభం లేకపోయింది!

దాని చెవుల్ని గట్టిగా పట్టుకున్న నేతగాడు ప్రాణ భయంకొద్దీ కళ్లు మూసుకొని, నిశ్చేష్టం అయిపోయాడు- "అయ్యయ్యో, దేవుడా!! నేను ఇప్పుడు ఏం చేయాలిరా?!” అని.

అంతలోనే వాడి ఆలోచనలు విన్నట్టుగా కిచకిచమని నవ్వింది డ్రాగన్. అది నవ్వగానే దాని నోట్లోంచి నిప్పులు కురిశాయి! "మర్యాదగా నువ్వు నన్ను వదిలి క్రింద పడకపోతే నీ కళ్లు తిరిగేలాంటి అనుభవం ఒకటి చేయిస్తాను!” అని అరిచిందది. నేతగాడు ఇంకా‌ కళ్లు కూడా తెరవలేదు. అంతలో‌నే డ్రాగన్ తిక్క పట్టినట్లు, గాల్లోకి ఎగిరింది!

ఎటు పోయిందనుకున్నారు? నేరుగా డబ్లిన్ వైపుకే ఎగిరిందా డ్రాగన్! మెడ మీద ఉన్న యాత్రికుడి అస్తిత్వం దాన్ని కురుపులా సలుపుతున్నది: "వాడే గనక కడుపులో ఉండి ఉంటే ఎంత బాగుండు!” అనుకుంటూ అది ఇంకా ఇంకా పైకి ఎగిరింది.

అయితే ఆ సరికి అది తిన్నదంతా అరిగింది కూడా. దానికి ఇప్పుడు ఆకలితో పాటు నీరసం కూడా వస్తోంది. అయినా మొండిగా ముందుకే దూసుకుపోబోయిన డ్రాగన్ ఎదురుగా అకస్మాత్తుగా గోడలాంటి దొకటి ప్రత్యక్షమైంది!

దభాలున దానికి గుద్దుకున్న డ్రాగన్ మరుక్షణంలో స్మృతి తప్పి, పిట్టలా నేలమీదికి రాలింది.

అది గుద్దుకున్నది ఏమనుకుంటున్నారు! డబ్లిన్ రాజుగారి కోట బురుజే! ఆ ప్రక్కనే నిలబడి కిటికీలోంచి బయటికి చూస్తున్నారు డబ్లిన్ రాజుగారు! మంటలు క్రక్కుతున్న అగ్ని గోళం లాంటి డ్రాగన్ పైకి ఎక్కి, సవారీ చేసుకుంటూ వస్తున్న నేతగాడిని చూడనే చూశాడు ఆయన!

"ఏయ్! ఎవరక్కడ?! ఫైరింజన్లు సిద్ధం చేయండి!” అని ఆయన ఒక ప్రక్కనుండి అరుస్తూండగానే డ్రాగన్ ధడాలున నేలపైన పడింది.

వాళ్లంతా చేరుకునే సరికి మన తెలివైన నేతగాడు డ్రాగన్ మెడను వదిలి, రాజుగారి దగ్గరకు పరిగెత్తుతూ "ప్రభూ! 'ఏ మానమూ- మర్యాదా లేని ఆ పశువును నేను చంపటం ఎందుకు?' అని, ముందుగా దాన్ని మచ్చిక చేసుకొని. 'ఆ పైన ఏం చేయాలో తమరే చేస్తారు' అని దాన్ని తమ సన్నిధికి లాక్కొచ్చాను!" అన్నాడు.

అనుకున్నట్టుగానే మహారాజు సంతోషంగా తన కత్తిని ఎత్తి "భళా! నీ భక్తికి మెచ్చాను! అని ముందుకు దూకి, ఒక్క వేటుతో డ్రాగన్ పని ముగించాడు! సభికులందరూ కూడా సంతో- షంతో గంతులు వేశారు!

అప్పుడు రాజు "నువ్వు ఇప్పటికే వీరయోధుడివి! కనుక నిన్ను మళ్లీ వీరయోధుడిగా సత్కరించటంలో అర్థం లేదు కదా! అందుకని మేము నిన్ను ఇక ఒక చిన్నపాటి ప్రభువుగా చేస్తున్నాం!" అని ప్రకటించాడు.

"సరే ప్రభూ!" అన్నాడు నేతగాడు, తన అదృష్టానికి తానే మూర్ఛపోతూ.

"అవును-” అన్నాడు రాజు. "డ్రాగన్‌ను సవారీ చేశారు- అని మేము విన్న-కన్న మొదటి ప్రభువువి నువ్వే! కనుక మేము నిన్ను 'డ్రాగన్ ఎక్కిన ప్రభువు' అని బిరుదునిస్తున్నాం, సన్మానిస్తున్నాం" అన్నాడు మర్యాదగా.

ఆనాటి నుండి ఈనాటి వరకూ కూడా డ్యులిక్ నగర వాసులందరూ నేతగాడిని, అతడి వీరోచిత కార్యాలను రాజుగారి తోటి, డ్రాగన్ తోటి సమంగా గౌరవిస్తూ ఉత్సవాలు జరుపుతున్నారు! (అయిపోయింది!)