ఒక ఊళ్లో రాము-కళ అనే భార్యాభర్తలు ఉండేవాళ్ళు. వాళ్లకి ఇద్దరు పిల్లలు- సంధ్య, పవన్.

సంధ్య-పవన్ ఒకరోజు బడికి వెళ్తుంటే, రోడ్డు ప్రక్కనే వాళ్లకొక సీసా మెరుస్తూ కనబడింది. పవన్ రోడ్డు దిగి పోయి, ఆ సీసాను పట్టుకొని, దాని మూత తీసేందుకు ప్రయత్నించాడు. అది తెరుచుకోలేదు. కొంతసేపటికి వాడికి విసుగు వచ్చి, దాన్ని విసిరి కొట్టి పోదామనుకున్నాడు. కానీ‌ ఎందుకనో దాన్ని వదిలెయ్య బుద్ధి కాలేదు.

అట్లా దానితో చాలా సేపు తంటాలు పడ్డాక, చివరికి దాని మూత తెరుచుకున్నది: అందులో ఒక కాగితం మడత పెట్టి ఉంది. సంధ్య-పవన్ ఇద్దరూ మెల్లగా ఆ కాగితాన్ని బయటికి తీసి చూసారు. దానిపైన ఏదో మ్యాప్ లాగా ఉంది. ఏవేవో పేర్లు ఉన్నాయి. అన్నిటికంటే పైన 'నిధికి దారి' అని రాసి ఉన్నది!

"వావ్! నిధి!" అరిచింది సంధ్య. "నిధి అంటే ఏంటో తెలుసా? బంగారు నాణేలు! ఎక్కడా లేనన్ని- చాలా డబ్బులుంటై!" "మరి మనం‌ వెళ్దాం పద. ఈ రోజే పోదాం" అన్నాడు పవన్.

"కానీ నిధుల్లో ఉండే డబ్బులన్నీ‌ గవర్నమెంటుకు ఇచ్చెయ్యాలి. మనం తీసుకునేందుకు వీలు లేదు" చెప్పింది సంధ్య.

"అట్లాగే చేద్దాం. నిధి ఎక్కడుందో వెతికి ప్రభుత్వానికి ఇచ్చేద్దాం- పద" అన్నాడు పవన్.

"ఇవాళ్ల కాదు. ఈ రోజు బడి ఉంది కదా! త్వరలో సంక్రాంతి సెలవలు వస్తున్నాయి..ఆదివారంనుండి పది రోజులపాటు బడి ఉండదు. అప్పుడు వెళ్దాం!" అంది సంధ్య.

పవన్‌కి అది నచ్చలేదు గానీ, "సరేలే, అట్లాగే కానియ్యి. ఆదివారం వెళ్దాంలే!" అన్నాడు అక్కతో.

ఆదివారం రానే వచ్చింది. ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న పవన్ ఇంకా తెల్లవారకనే లేచాడు. సంధ్యను కూడా నిద్ర లేపాడు. ఇద్దరూ తయారయ్యి, అమ్మతో "పెద్ద పని మీద వెళ్తున్నాం. రాత్రి చీకటి పడేలోగా వచ్చేస్తాం. వచ్చాక మేం ఏమేం సాధించామో చెబుతాం" అని చెప్పి బయలుదేరారు.

అమ్మ వాళ్లకు దారిలో తినమని తిను బండారాలు ఇచ్చి, జాగ్రత్తలు చెప్పి పంపింది.

ఇద్దరూ మ్యాప్ చూపించిన దారిలో పోతుంటే ఒక పెద్ద చెట్టు కనిపించింది. దాని నీడలో సేదతీరారు.

పవన్ నిద్రలోకి జారుకున్నాడు. కాసేపటి తర్వాత సంధ్య పవన్‌ని తట్టి లేపింది. "చీకటి పడే లోపు నిధిని వెతకాలి-పద" అంది. అంతలోనే వాళ్ళు వెతుకుతున్న పురాతన గుహ కనిపించింది. భయపడుతూనే మెల్లిగా లోపలికి వెళ్లారు. లోపల అంతా చీకటి.. గుడ్లగూబలు.. గబ్బిలాలు. వాటి అరుపులకు వీళ్ళిద్దరికీ కొద్దిగా భయం వేసింది. కానీ ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగారు..

లోపల ఒక గదికి మటుకు తాళం వేసి ఉంది. పిల్లలిద్దరూ ఆ తాళాన్ని రాయితో పగలగొట్టారు. గది లోపలికి వెళ్లి చూస్తే అక్కడ ఏమీ లేదు! అది ఒట్టి ఖాళీ గది!

సంధ్య చురుకుగా ఆలోచించింది: "ఇందులో‌ ఏమీ‌ లేకపోతే తాళం ఎందుకు వేస్తారు, ఇక్కడ ఏదో‌ ఉండే ఉంటుంది- వెతకాలి" అని. జాగ్రత్తగా చూస్తే నేలమీద ఒక సూచిక- గోడ వైపుకి చూపుతూ- కనబడింది.

ఆ గోడకు ఒక చిన్న పువ్వు బొమ్మ అతికించి ఉన్నది. సంధ్య కొద్ది సేపు దాన్ని పరిశీలనగా చూసి పవన్‌కి చెప్పింది: "దీనిలో ఏదో కిటుకు ఉన్నది. దీనిని త్రిప్పి చూద్దాం" అని. పవన్ దానిని త్రిప్పగానే ఆ గోడకాస్తా కదిలింది! 'కి..ర్రు' మని శబ్దం చేసుకుంటూ గోడ తెరుచుకున్నది! గోడ వెనకగా ఒక చిన్న గది, దానిలో ఒక పెట్టె ఉన్నాయి. పెట్టెకు తాళం వేసి ఉన్నది.

పవన్, సంధ్య ఇద్దరూ ఆ పెట్టెను తెరవడానికి ప్రయత్నించారు. అది తెరుచుకోలేదు.

"దీని తాళం‌ కూడా ఇక్కడే ఎక్కడో‌ ఉంటుంది- చూడు!" చెప్పింది సంధ్య. "ఆ తాళం మామూలుగా ఉండదు. కనీసం మన అర చెయ్యంత పొడుగు ఉంటుంది"

"ఇందాక పువ్వు వైపు చూపిస్తున్న సూచిక! అది తాళమే!!" అన్నాడు పవన్, దానివైపు పరుగెత్తుతూ. ఆ తాళం చెవిని తెచ్చి పెట్టెను తెరిచి చూసారు ఇద్దరూ.

పెట్టెలో నిండుగా బంగారు నాణెలు!

"వావ్!‌ నిజంగానే నిధి ఉంది ఇక్కడ!" అరిచాడు పవన్.

"దీన్ని మనిద్దరం‌ మోసుకెళ్ళలేం! నువ్వు ఇక్కడే కూర్చో. నేను పోయి పోలీసుల్ని పిల్చుకొస్తాను" చెప్పి వెనక్కి బయలుదేరింది సంధ్య.

ముందుగా ఇంటికి వెళ్ళి, వాళ్ల నాన్నని కూడా వెంట బెట్టుకొని, పోలీసు స్టేషనుకు వెళ్ళింది. వారి సహాయంతో పెట్టె ప్రభుత్వానికి అందింది!

"బలే పిల్లలు! పారేసిన సీసాలో ఏదో కాయితం ఉంటే, దాన్ని పట్టుకొని నిధి వేటకెళ్తారా ఎవరైనా?! ఏ దొంగలో, మోసగాళ్ళో అలాంటి కాయితాలు అక్కడక్కడా వదిలి ఉంటే?! మీలాగా ఒంటరిగా దొరికే పిల్లల్ని పట్టుకుపోతే?! ఈసారికి ఏదో‌ అయ్యింది గానీ ఇంకెప్పుడూ‌ ఇలా చేయకండమ్మా!"అని సున్నితంగా చీవాట్లు పెట్టారు పోలీసులు.