"వెనక్కి రారా, నా గుర్రాన్ని ఎత్తుకెళ్తున్న పనికిమాలిన దొంగా! కుండలు కప్పుకున్న పీనుగా!” అని గుర్రపు యజమాని మిల్లర్ తిట్లు అందుకునే సరికే నేతగాడు అల్లంత దూరం వెళ్ళిపోయాడు. అతని ప్రమేయం లేకుండానే గుర్రం తనకు నచ్చిన దారిన వేగంగా దౌడు తీసింది.

గుర్రపు కళ్లాన్ని ఒడిసి పట్టుకొని, అటూ ఇటూ పడిపోతూ, సరిగ్గా కూర్చునేందుకు తంటాలు పడుతూనే ఆలోచించాడు నేతగాడు: "మాలా సంచారంలో ఉన్న వీరయోధులు నివసించాల్సింది పనికిమాలిన మొద్దులు, మూర్ఖులు ఉండే పల్లెల్లో కాదు: డబ్లిన్‌లో వెలుగొందే చక్రవర్తి తప్ప, మనకు తగిన పనిని ఇవ్వగలిగే వాడు ఇంకొకడుండడు!" అని.

ఒకసారి నిశ్చయానికి వచ్చాక, అప్పుడిక గుర్రాన్ని ఉత్సాహంగా ముందుకు ఉరికించాడు నేతగాడు. నాలుగు గంటల పాటు నిలబడకుండా ఉరికి, ఆ గుర్రం నిజంగానే డబ్లిన్ చేరుకున్నది. ఒకప్పుడు రాజుగారి గుర్రపుశాలలో పెరిగిందో ఏమో, ఇప్పుడది వాడిని నేరుగా తీసుకెళ్లి, రాజుగారి భవనంలో ఓ చక్కని ఉద్యానవనం మూలన దులపరించింది.

డబ్లిన్ మహారాజు చాలా మంచోడు. తన తోటని చూసేందుకు వచ్చే ప్రజలకోసం అతను అక్కడక్కడా బెంచీలు వేయించి, వాళ్లు కూర్చునేందుకు, అలసట తీర్చుకునేందుకు కూడా తగిన ఏర్పాట్లు చేసి ఉన్నాడు. అట్లాంటి ఓ బండమీద పడుకొని మనవాడు కాలు మీద కాలు వేసుకొని ఏదో ఆలోచిస్తూ ఉంటే, వాడిని అక్కడికి తెచ్చి పడేసిన గుర్రం దగ్గర్లోనే తచ్చాడుతూ, బండల మధ్య పెరుగుతున్న గడ్డి పోసలను మేయటం మొదలుపెట్టింది.

గుర్రం మీద వీరయోధుడు ఆ విధంగా తోటలోకి ప్రవేశించే సమయానికి మహారాజు తన గదిలో వేరే ఏదో పనిచేస్తున్న వాడల్లా దానిని ఆపి, కిటికీలోంచి వాడికేసి చూస్తూ నిలబడ్డాడు. వాడు తనే రాజైనట్లు బండమీద పడుకునేసరికి ఆయనకు బలే మండింది. గుర్రం మీద సరిగ్గా కూర్చోవటం కూడా రానట్టు అటూ ఇటూ పడుకుంటూ వచ్చి, తన తోటలో నిశ్చింతగా పడక వేసిన ఆ బుడబుక్కల వాడిని చూపిస్తూ తన ప్రక్కనే ఉన్న రాజోద్యోగి ఒకడితో- "ఆ వింత బుడ బుక్కల వాడిని చూశావా? 'నేనేదో మంచివాడినీ, ఆదరించే వాడినీ అనిపించుకునేందుకని, మామూలు జనాలంతా కూర్చుని- ధ్యానం చేసుకునేందుకు వీలుగా ఇట్లా బండలు అవీ పెట్టిస్తే, వీడెవడో ఈ విధంగా దీన్ని హోటల్‌ మాదిరి మలచుకొని, కాళ్లమీద కాళ్లు వేసుకొని పడుకోవడం ఏమంత సరిగా అనిపించట్లేదు- నువ్వేమంటావు?” అన్నాడు.

"ప్రభూ! తమరి అభిప్రాయంతో ఏకీభవించటం కంటే మేమేమీ చెయ్యం!” అన్నాడు రాజోద్యోగి ఎప్పటిమాదిరే.

"వీడెవడో చాలా వింత దుస్తులు ధరించి వచ్చాడు. తనను గురించి తను ఏమనుకుంటూన్నాడో ఏమో! నేనే స్వయంగా వెళ్లి పరిశీలించి వస్తాను!” అని బయలుదేరాడు రాజు.

ఆ విధంగా రాజు, రాజోద్యోగి ఇద్దరూ అడుగులో అడుగు వేసుకుంటూ అరుగు మీద పడుకున్న నేతగాడి వైపుకు వచ్చారు. వాళ్లు రావటం గమనించిన నేతగాడు మరింత గట్టిగా కళ్లు మూసుకొని నిద్రపోతున్నట్టు నటించాడు.

అయితే "ఒక్కదెబ్బకు డెబ్భై ప్రాణాలు తీసిన వీరయోధుడు ఇతడే" అని రాసి ఉన్న తన డాలును అటువైపుకు వంచి అక్షరాలు బాగా కనపడేటట్టు పెట్టడం మటుకు మర్చిపోలేదతను.

రాజుగారు దాన్ని చదివి నిజంగానే నిర్ఘాంతపోయారు. "ఓహో, ఏమాశ్చర్యం, ఎంత ఆశ్చర్యం?!, ఇతని కోసమే కదా నేను ఇన్నాళ్లు ఎదురుచూస్తున్నది?! అన్నాడు పరవశంగా కళ్లు మూసుకుంటూ.

"ప్రభూ! ఏ పని కోసం?!” అడిగాడు రాజోద్యోగి.

"ఇంకెందుకు, నా రైతుల్ని వేధిస్తూ , వారి శ్రమ ఫలితమైన పంటల్ని నాశనం చేస్తూ, వాళ్ళు పెంచే కోళ్లను, జీవుల్ని స్వాహా చేసే డ్రాగన్‌ను ఇతని వంటి వీరయోధులు కాక మరెవరు చంపుతారు?!” అన్నాడు రాజు చటుక్కున.

ఉద్యోగికి కొద్దిసేపు నోటమాట రాలేదు. చివరికి ధైర్యం తెచ్చుకొని వాడు "క్షమించాలి మహారాజా! అంతమంది వీరయోధులు- నిజఖడ్గ సంపద గలవారు, మొక్కవోని ధైర్య సాహసాలు గలవారు- అంతమంది చేయలేని పనిని, ఈ మామూలు బుడబుక్కలవాడు చేయగలడంటారా?” అనుమానంగా అడిగాడు.

"ఖచ్చితంగా చేస్తాడు. వాడి డాలు మీద ఏమి రాసి ఉందో చదవలేదా?! ఒక్క దెబ్బకు డెబ్భై ప్రాణాలు తీసాడట! అలాంటి వాడికి డ్రాగన్‌ని చంపటం ఒక్క లెక్కా?” అంటూ రాజుగారు పోయి నేతగాడి భుజం పట్టుకొని కుదిపాడు.

అప్పుడే కళ్లు తెరిచిన నేతగాడు హుందాగా పెదాలు విరుస్తూ "మరి ఇప్పుడు ఎవరొచ్చారు, మా సేవలకి?!” అన్నాడు.

మహారాజు ఒక్కసారిగా నిటారుగా నిలబడి, అటూ ఇటూ చూస్తూ, గట్టిగా గాలి పీల్చుకొని "మ్‌మ్‌మ్‌.. మరి నేను డబ్లిన్ మహారాజునే కదా?” అన్నాడు ఒకింత అనుమానంగా.

అది వినగానే నేతగాడు టక్కున లేచి, మోకాళ్ళమీద నిలబడి, రాజుగారి కాళ్ళు పట్టుకున్నాడు: "ప్రభూ, నన్ను క్షమించండి. నా ఆజ్ఞానాన్ని క్షమించండి. మిమ్మల్ని గుర్తించక నేను చేసిన అపరాధాలని మన్నించండి. ఈ అల్పుడిని క్షమించానని మాట ఇవ్వండి ముందు-లేకపోతే మీ కాళ్ళు వదిలేది లేదు!" అంటూ.

దాంతో రాజుగారికి తన మర్యాద నిలిచిందని సంతోషం వేసింది. 'దాంతోపాటు వీడు అన్నంతపనీ చేస్తాడ'ని భయం‌ కూడా వేసింది. అందుకని నేతగాడికి అభయాన్నిస్తూ "దూర ప్రయాణపు బడలికతో అలసి ఉంటావు ఓ వీరుడా! ఏమీ పరవాలేదు! నిన్ను క్షమించాం!" ఇంతకీ ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు, మా ఈ రాతి బండమీద?!” అని అడిగాడు రాజు.

"ప్రభూ! తమరి సైన్యంలో సంచారయోధుడిగా సేవలందించేందుకే నేను డబ్లిన్‌కి చేరుకున్నాను!” అన్నాడు నేతగాడు గౌరవంగా.

"ఓ! అలానా!" సంతోషంగా అన్నాడు రాజు- “నీ వంటి వీరుడికి ఏ మాత్రమూ కష్టం కలిగించని పని ఒకటి ఉన్నది నా దగ్గర. డెబ్భై ప్రాణాలు ఏమీ కాదు కనీసం! దానికంటే చాలా చిన్న పనే! కేవలం చిన్న- పనికిమాలిన డ్రాగన్ ఒకటి నా రాజ్యాన్నంతా చికాకు పెడుతోంది. ప్రజల్ని కష్టపెడుతోంది; వాళ్ల కోళ్లను తింటోంది. కనీసం నేను తినేందుకు కూడా గుడ్లు దొరకట్లేదు!" అన్నాడు రాజు బాధగా ముఖం‌ పెట్టి.

"దాని పని అయిపోయినట్లే ప్రభూ! ఇలాంటి చిన్న పనులు నాకు ఎంత పాటివి!” అన్నాడు నేతగాడు తేలికగా ముఖం‌ పెట్టి.

"క్షమించు వీరయోధా! నీ శౌర్యానికి తగిన పని కాదేమో, ఇది!” అన్నాడు రాజు కొంచెం అనుమానంగా. "కానీ నాక్కూడా ఈ డ్రాగన్‌కు అస్సలు ఏమాత్రం బయపడాల్సిన అవసరం లేదనుకో; అయినా ఏం చెయ్యను?! అది ఎక్కడో‌ 'కౌంటీ గాల్వే' అనే ఊళ్లో ఒక బురద గుంట ఊబిలో ఉంటోంది ఇప్పుడు. అక్కడికి వెళ్ళాలంటే మరి నాకేమో బోల్డన్ని పనులాయె!" చెప్పాడు, విచారాన్ని తెచ్చిపెట్టుకున్న ముఖంతో.

"మీరేమీ విచారించకండి ప్రభూ! నన్ను తక్షణం అక్కడికి తీసుకెళ్లమనండి!" అన్నాడు నేతగాడు, తెగించి.

"అదే నాకు నచ్చింది!” అన్నాడు రాజు సంతోషంగా "నా డబ్బుకు తగిన వీరుడివి నువ్వే"

"ఓఁ.. డబ్బు అంటే గుర్తొచ్చింది.." అన్నాడు నేతగాడు. "నా ప్రయాణాన్ని నిరాటంకంగా కొనసాగించేందుకు నాకు కొంచెం డబ్బుల అవసరం ఉంటుంది...”

"ఓఁ.. దానిదేముంది, నీకెంత కావాలో అంత తీసుకో!” అన్నాడు రాజు, అతన్ని ఓ అలమార దగ్గరకు తీసుకుపోతూ. ఆ అలమారలో నిండా పాత మేజోళ్ళు ఉన్నై. ఆ మేజోళ్ళలో నిండా బంగారు నాణాల్ని దాచి పెట్టుకున్నాడు రాజు.

నేతగాడు ముందుకెళ్ళి, తన కవచంలో పట్టినన్ని నాణేల్ని నింపుకున్నాడు.

"ఇక మన గుర్రపు శాలకు వెళ్దాం పద! నీకు చురుకైన కొత్త గుర్రం అవసరం ఉంది!” అని రాజుగారు వాడిని తన గుర్రపుశాలకు తీసుకెళ్లాడు. మిల్లర్ గాడి ముసలి తొక్కు గుర్రాన్ని అక్కడే వదిలేసి, బదులుగా రాజుగారు చూపించిన ఓ మంచి కుర్ర గుర్రాన్ని పుచ్చుకున్నాడు నేతగాడు. (తర్వాత ఏమైందో వచ్చేమాసంలో చదవండి...)